త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Cabinet | తెలంగాణ‌ కేబినెట్ విస్త‌ర‌ణ‌..! కొండా సురేఖ‌కు ఉద్వాస‌న‌..?

Telangana Cabinet | రాష్ట్రంలో ఎప్పుడెప్ప‌డా అని ఎదురుచూస్తున్న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణకు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. పార్టీలో అస‌మ్మ‌తి ముదురుతున్న వేళ దాదాపు సంవ‌త్స‌ర కాలంగా ఊరిస్తూ ఉన్న మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణకు అవ‌కాశం వ‌చ్చింది.

S

Telangana | Published On Aug 23, 2026, 10.32 pm IST

Telangana Cabinet | తెలంగాణ‌ కేబినెట్ విస్త‌ర‌ణ‌..! కొండా సురేఖ‌కు ఉద్వాస‌న‌..?
Advertisement
  • పార్టీలో అస‌మ్మ‌తి వేళ అందివ‌చ్చిన అవ‌కాశం
  • కొండా సురేఖ‌కు ఉద్వాస‌న ప‌లికేందుకు రంగం సిద్ధం
  • ఇప్ప‌టికే సంకేత‌మిచ్చిన టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్‌
  • గ‌తంలో ద‌న్నుగా నిలిచిన భ‌ట్టి సైతం మౌనం
  • అదే సామాజిక వ‌ర్గానికి చెందిన వారికి అవ‌కాశం
  • ఇటీవ‌లి ప‌రిణామాల‌పై రేవంత్ గుర్రు
  • ప్ర‌భుత్వంపై ప‌ట్టు నిరూపించుకునేందుకు త‌హ‌త‌హ‌
  • అధిష్టానం గ్రీన్‌సిగ్న‌ల్ కోసం వెయిటింగ్‌
  • అటు ఆమె ఔట్‌.. ఇటు అనుయాయులు ఇన్‌

Telangana Cabinet | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో ఎప్పుడెప్ప‌డా అని ఎదురుచూస్తున్న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణకు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. పార్టీలో అస‌మ్మ‌తి ముదురుతున్న వేళ దాదాపు సంవ‌త్స‌ర కాలంగా ఊరిస్తూ ఉన్న మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణకు అవ‌కాశం వ‌చ్చింది. ముఖ్య‌మంత్రి రేవ‌త్ రెడ్డిపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మితా పటేల్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలతో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు మార్గం సుగ‌మ‌మైంది. ఇందులో భాగంగా కొండా సురేఖ‌కు ఉద్వాస‌న ప‌లికే అవ‌కాశం ఉంద‌ని పార్టీ అంత‌ర్గ‌త వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. ఒక‌వైపు అస‌మ్మ‌తి నేత‌ల వ్యాఖ్య‌ల‌తో వారిపై రేవంత్ తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు రేవంత్ అనుకూల ఎమ్మెల్యేలు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించి మ‌రీ మంత్రిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వంపై త‌న ప‌ట్టును నిరూపించుకునేందుకు ఆయ‌న కృత‌నిశ్చ‌యంతో ఉన్నారు. దీనికి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌ను అందివ‌చ్చిన అవ‌కాశంగా భావిస్తున్నారు.

మంత్రి కొండా సురేఖ‌పై చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ ప‌రోక్షంగా స్ప‌ష్టం చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఈ అంశం ఏఐసీసీ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని చెప్పారు. రాజ‌కీయ‌, సంస్థాగ‌తంగా హ‌ద్దులు దాటి చేసిన వ్యాఖ్య‌ల‌ను పార్టీ విస్మ‌రించ‌బోద‌ని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్ర‌ధాన కార్యాల‌యం నుంచి వ‌చ్చే స‌మాచారం కోసం తాను ఎదురుచూస్తున్నాన‌న్నారు. గ‌తంలో ప‌లుమార్లు కొండా సురేఖ‌కు అండ‌గా నిలిచిన ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క సైతం ఈ సారి మౌనం వ‌హించారు. మొత్తం ఉదంతంపై అధిష్టానం దృష్టి సారించ‌డంతో తానేమీ చేయ‌లేన‌ని చేతులెత్తేసిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

అస‌మ్మ‌తి వార్త‌ల నేప‌థ్యంలో అధిష్టానం అప్ర‌మ‌త్త‌మైంది. మొత్తం ఉదంతంపై కాంగ్రెస్ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జి మీనాక్షి న‌ట‌రాజ‌న్‌ను నివేదిక కోరింది. ఈ మేర‌కు ఆమె మొత్తం స‌మాచారం సేక‌రించి, అధిష్టానానికి నివేదించిన‌ట్లు స‌మాచారం. రేవంత్‌రెడ్డి విదేశాల నుంచి తిరిగివ‌చ్చిన అనంత‌రం మ‌రిన్ని కీల‌క స‌మావేశాలు ఉంటాయ‌ని భావిస్తున్నారు.

ఒక‌వేళ కొండా సురేఖ‌ను మంత్రిగా తొల‌గిస్తే.. అదే సామాజిక వ‌ర్గానికి అవ‌కాశం క‌ల్పించే అవ‌కాశం ఉంద‌ని అనుకుంటున్నారు. మున్నూరు కాపు వ‌ర్గానికి ప్రాధాన్య‌త ఇవ్వాల‌నుకుంటే వేముల‌వాడ ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీ‌నివాస్‌కు అవ‌కాశం ద‌క్కుతుంది. అలాకాకుండా బీసీల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని భావిస్తే మ‌రో ప్ర‌భుత్వ విప్ బీర్ల అయిల‌య్య‌, షాద్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే శంక‌ర‌య్య‌, రామ‌గుండం ఎమ్మెల్యే మ‌ఖ‌న్‌సింగ్ రాజ్ ఠాకూర్, జూబ్లీహిల్స్ ఎమ్మ‌ల్యే న‌వీన్‌యాద‌వ్‌ సైతం త‌మ‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతున్నారు. మంత్రివ‌ర్గంలో సీత‌క్క మాత్ర‌మే మ‌హిళా మంత్రిగా మిగిలే అవ‌కాశం ఉండ‌డంతో, మ‌రో స్థానం మ‌హిళ‌కు కేటాయించే అవ‌కాశం లేక‌పోలేదు. ఈ కోటాలో ప‌ద్మావ‌తి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, మ‌ట్టా రాగ‌మ‌యి, చిట్టెం ప‌ర్ణికారెడ్డి, మామిడాల య‌శ‌స్విని రేసులో ఉన్నారు.

శాఖ‌ల మార్పు సైతం..

మంత్రివ‌ర్గంలో ఇప్ప‌టికే రెండు ప‌దవులు ఖాళీగా ఉండ‌డంతో పాటు తాజాగా ఖాళీ అయ్యేవి వాటికి అద‌నం. శాఖ‌ల‌ను మార్చ‌డంతో పాటు, కీల‌క శాఖ‌ల‌కు స‌మ‌ర్థులైనవారిని మంత్రులుగా నియ‌మించాల‌ని రేవంత్ భావిస్తున్నారని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. 2028 అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మ‌రికొంద‌రు మంత్రుల‌కు పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని ఆయ‌న యోచిస్తున్న‌ప్ప‌టికీ, దానిని అధిష్టానం ఆమోదించాల్సి ఉంది. ఈ ప‌రిణామాల‌తో మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌ను కీల‌కంగా భావిస్తున్నారు.

Advertisement
Advertisement