త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Group 1 Petition Dismissed | తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. ఆ పిటిషన్ కొట్టివేత

తెలంగాణ గ్రూప్-1 నియామకాలపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది.

J

Telangana | Published On Apr 2, 2026, 9.11 pm IST

Telangana Group 1 Petition Dismissed | తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. ఆ పిటిషన్ కొట్టివేత

సంక్షిప్త సారాంశం

తెలంగాణ గ్రూప్-1 (2024) నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సింగిల్ బెంచ్ తమ వాదనలు వినకుండానే నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వారు ఆరోపించారు. అయితే, ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా మూడు దశల్లో జరిగిందని టీఎస్‌పీఎస్సీ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఎంపికైన వారు ఇప్పటికే విధుల్లో చేరారని తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం.. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ పిటిషన్లను డిస్మిస్ చేసింది.

Advertisement

Telangana Group 1 Petition Dismissed | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న గ్రూప్-1 (TSPSC Group 1) నియామకాల వ్యవహారంలో అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. 2024 నోటిఫికేషన్ ద్వారా జరిగిన ఈ నియామక ప్రక్రియపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. గ్రూప్-1 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం డిస్మిస్ చేసింది.

అసలేం జరిగిందంటే

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఆధ్వర్యంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం ఎంపిక ప్రక్రియ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ నియామక ప్రక్రియలో, ముఖ్యంగా మూల్యాంకనంలో (Evaluation) భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. నోటిఫికేషన్‌ను రద్దు చేసి, మరోసారి పకడ్బందీగా గ్రూప్-1 పరీక్షలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.

దీనిపై ముందుగా విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్.. గ్రూప్-1 పరీక్షల్లో ఎలాంటి అక్రమాలు జరిగినట్లు తమకు ఆధారాలు కనిపించలేదని స్పష్టం చేసింది. నియామక ప్రక్రియను యథాతథంగా కొనసాగించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి, టీఎస్‌పీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సుప్రీంకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు

హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన అభ్యర్థులు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. సింగిల్ బెంచ్ తమ వాదనలను కనీసం పరిగణనలోకి తీసుకోకుండానే తీర్పు ఇచ్చిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అభ్యర్థుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. "మూల్యాంకనంలో స్పష్టంగా అక్రమాలు జరిగాయని చెప్పినా పట్టించుకోలేదు. కాబట్టి వెంటనే ఈ పరీక్షను రద్దు చేసి, పారదర్శకంగా మళ్లీ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలి" అని కోరారు.

టీఎస్‌పీఎస్సీ వాదన ఇదే

టీఎస్‌పీఎస్సీ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించారు. "గ్రూప్-1 నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా మూడు దశల్లో జరిగింది. మూల్యాంకనం కూడా మూడుసార్లు జరిగింది. ఒకవేళ ఒక దశలో పొరపాటు జరిగినా, మిగిలిన రెండు దశల్లో అది కచ్చితంగా బయటపడుతుంది. ఎక్కడా ఎలాంటి అక్రమాలకు తావు లేదు. నియామక ప్రక్రియ కూడా పూర్తయింది. ఎంపికైన అభ్యర్థులు ఇప్పటికే తమ పోస్టుల్లో చేరి, విధులు సైతం నిర్వహిస్తున్నారు" అని ఆయన ధర్మాసనానికి వివరించారు.

పిటిషన్లు డిస్మిస్

ఇరువర్గాల వాదనలు సుదీర్ఘంగా విన్న జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. నియామకాలు పూర్తై అభ్యర్థులు విధుల్లో చేరినందున, ఇప్పుడు ఈ ప్రక్రియను రద్దు చేయలేమని తెలుపుతూ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో.. గ్రూప్-1 నియామకాలకు సంబంధించి ఇన్నాళ్లుగా ఉన్న న్యాయపరమైన అడ్డంకులు పూర్తిగా తొలగిపోయినట్లయింది.

Advertisement
Advertisement