త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS MLC Dasoju Sravan Slams TDP MPs | తెలంగాణపై ఏడుపు ఆపండి.. ఆంధ్రా ఎంపీల తీరుపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫైర్!

లోక్‌సభలో తెలంగాణ ఏర్పాటును కించపరిచేలా మాట్లాడిన టీడీపీ ఎంపీల తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సొంత రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేని అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణపై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

J

Telangana | Published On Mar 10, 2026, 8.52 pm IST

BRS MLC Dasoju Sravan Slams TDP MPs | తెలంగాణపై ఏడుపు ఆపండి.. ఆంధ్రా ఎంపీల తీరుపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫైర్!

సంక్షిప్త సారాంశం

రాష్ట్రం విడిపోయి పుష్కర కాలం (12 ఏళ్లు) గడుస్తున్నా, ఆంధ్రా నాయకులు తెలంగాణపై ఇంకా ఏడుపు ఆపడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. లోక్‌సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు కృష్ణదేవరాయలు తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఏపీకి 'ప్రత్యేక హోదా' సాధించలేని చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణపై పడి ఏడుస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటం దారుణమన్నారు. దమ్ముంటే కృష్ణా జలాల దోపిడీ, డిసెంబర్ 9 ప్రకటన అడ్డంకులపై బహిరంగ చర్చకు రావాలని టీడీపీకి సవాల్ విసిరారు.

Advertisement

BRS MLC Dasoju Sravan Slams TDP MPs | పార్లమెంట్ వేదికగా తెలంగాణ ఏర్పాటుపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ (TDP) ఎంపీలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లు గడుస్తున్నా.. ఆంధ్రా నాయకులు ఇంకా తెలంగాణ మీద పడి ఏడవడం మానలేదని విమర్శించారు. ఏపీకి రావాల్సిన నిధులు, 'ప్రత్యేక హోదా' సాధించలేని తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.

BRS MLC Dasoju Sravan Slams TDP MPs | కోతికి పుండు అయితే గోకినట్టు..

లోక్‌సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలంగాణ ఏర్పాటుపై అవాకులు చవాకులు పేలడాన్ని దాసోజు శ్రవణ్ తీవ్రంగా ఖండించారు. "కోతికి పుండు అయితే గోకినట్టు, నాకినట్టు తయారైంది టీడీపీ నాయకుల తీరు. ఆనాడు రాష్ట్ర ఏర్పాటుకు సైంధవుల వలె గండికొట్టి, వందలాది మంది తెలంగాణ యువకుల ఆత్మబలిదానాలకు కారణమైంది మీరు కాదా?" అని ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దల ముందు మోకరిల్లి ఏపీకి ఇచ్చిన 'ప్రత్యేక హోదా' హామీని సాధించుకోలేని మీరు.. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణపై ఏడిస్తే ఏపీ ప్రజలకు న్యాయం చేసినట్లా? అని నిలదీశారు.

దమ్ముంటే చర్చకు రండి!

టీడీపీ నాయకులకు దమ్ముంటే పార్లమెంట్‌లోనూ, తెలంగాణ అసెంబ్లీలోనూ బహిరంగ చర్చకు రావాలని శ్రవణ్ సవాల్ విసిరారు. డిసెంబర్ 9 ప్రకటన దగ్గరి నుంచి టీడీపీ పెట్టిన ప్రతి మోకాలడ్డంకుపై చర్చ పెడదాం.. సిద్ధమా? కృష్ణా జలాల్లో ఆంధ్రా సాగిస్తున్న నీటి దోపిడీపై బహిరంగంగా నిగ్గు తేలుద్దాం.. దమ్ముందా? తెలంగాణ రాజకీయాల్లో 'శిఖండి' పాత్ర పోషిస్తూ, ఇక్కడి అభివృద్ధిని అడ్డుకుంటున్న మీ కుట్రలపై చర్చ చేద్దాం.. వస్తారా?

తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీల మౌనం దేనికి?

లోక్‌సభలో ఒక ఆంధ్రా ఎంపీ తెలంగాణను కించపరుస్తూ మాట్లాడుతుంటే, రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఎందుకు నోరు విప్పలేదని శ్రవణ్ ప్రశ్నించారు. లావు కృష్ణదేవరాయలను అక్కడికక్కడే ఎందుకు నిలదీయలేకపోయారో తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలన్నారు. "మీ మౌనం తెలంగాణ ఆత్మగౌరవానికి ద్రోహం చేయడమే" అని దుయ్యబట్టారు. సభలో ప్యానెల్ స్పీకర్ కుర్చీలో కూర్చున్న టీడీపీ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ఈ 'వాగుడు'కు అనుమతి ఇవ్వడం, ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఈ 'సొల్లు' వాగడం చూస్తుంటే.. ఇది టీడీపీ పార్టీ అధికారిక వైఖరా? లేక వీళ్లిద్దరి సొంత పైత్యమా? చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఖబడ్దార్.. తస్మాత్ జాగ్రత్త!

ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా ఆంధ్రా, తెలంగాణ వాళ్లు అన్నదమ్ముల్లా తెలంగాణలో బతుకుతున్నారని, కలిసి అభివృద్ధి సాధిస్తున్నారని దాసోజు శ్రవణ్ అన్నారు. మీ చిల్లర రాజకీయాల కోసం ఇరు ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టొద్దని సూచించారు. "అనవసరంగా మా జోలికి వచ్చి తెలంగాణ ప్రజలను అవమానిస్తే, ఆత్మగౌరవాన్ని కించపరిస్తే.. తెలంగాణ సమాజం తగిన గుణపాఠం చెబుతుంది.. ఖబడ్దార్!" అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. మీ అతి తెలివినంతా మీ ఆంధ్ర అభివృద్ధి కోసం వాడుకోవాలని హితవు పలికారు.

https://x.com/sravandasoju/status/2031370682559508707

 

Advertisement
Advertisement