Revised Land Rates | అమల్లోకి పెరిగిన భూముల విలువలు.. ఎకరాకు కనిష్ఠం రూ.2.75 లక్షలు.. గరిష్ఠం రూ.35 కోట్లు
Revised Land Rates | రాష్ట్రంలో వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, అపార్టుమెంట్లు, ఇండ్లకు కొత్త మార్కెట్ విలువలు (Revised Land Rates) అమల్లోకి వచ్చాయి. 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇక కొత్త విలువల ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయి.
Revised Land Rates | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, అపార్టుమెంట్లు, ఇండ్లకు కొత్త మార్కెట్ విలువలు (Revised Land Rates) అమల్లోకి వచ్చాయి. శుక్రవారం నుంచి 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొత్త విలువల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. దీంతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో భూముల ప్రభుత్వ విలువలను పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 92 వేల ప్రాంతాల్లో ఈ సవరణలు చేసింది. సాగు భూములు, ఖాళీ స్థలాలకు మార్కెట్ విలువను పలు చోట్ల 50 నుంచి 100 శాతం, అపార్టుమెంట్లకు 10 నుంచి 20 శాతం వరకు మార్కెట్ విలువ పెంచింది. కనిష్ఠంగా భూముల ధర ఎకరా రూ.1.75 లక్షల నుంచి రూ.2.75 లక్షలకు పెంచింది. గరిష్ఠంగా బేగంపేటలో ఎకరా రూ.35.29 కోట్లకు పెంచింది. అయితే రిజిస్ట్రేషన్ చార్జీలు మాత్రం యధావిధంగానే కొనసాగుతాయని, ఎలాంటి మార్పూ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సవరించిన విలువల ద్వారా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు అదనంగా మరో రూ.1,400 కోట్ల భారీ రాబడి సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది.
మార్కెట్ విలువ సవరించిన ప్రాంతాల్లో ఎక్కువగా హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపలే ఉన్నాయి. కాపేట, నానక్‌రాంగూడ, కొంగర కలాన్, రాయ్‌దుర్గం, బుద్వేల్ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ పెరిగింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో సాగు భూముల విలువ కనిష్ఠంగా 50 శాతం గరిష్ఠంగా 100 శాతం పెంచారు. ఇక కరీంనగర్‌లో పాత విలువలే కొనసాగనున్నాయి. అదేవిధంగా నిజామాబాద్ ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో కూడా విలువలను సవరించలేదు. గ్రామీణ జిల్లాలో కనిష్ఠంగా 50 శాతం, గరిష్ఠంగా 75 శాతం పెంచారు. గరిష్టంగా శేరిలింగంపల్లి ఖజాగూడలో ఎకరా రూ.30 కోట్లుగా మార్కెట్ విలువ ఉంది. జూబ్లీహిల్స్‌లో చదరపు గజం గరిష్ట ధర ఏకంగా రూ.1.16 లక్షలకు చేరగా, గచ్చిబౌలిలో రెసిడెన్షియల్ ఏరియాలో చదరపు గజం ధర రూ.78,600గా నిర్ణయించారు.
అపార్టుమెంట్లు..
అపార్టుమెంట్లకు సంబంధించి ప్రభుత్వం పెద్దగా మార్పులు చేయలేదు. కనిష్ఠంగా 10 శాతం, గరిష్ఠంగా 20 శాతం వరకే పెంపుదల జరిగింది. ఓఆర్‌ఆర్ లోపల ప్రాంతాల్లోనే గరిష్ఠ పెంపును చేపట్టారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లో చదరపు అడుగుకు పాత విలువ రూ.2,500 ఉండగా రూ.2,700కు పెంచారు. పటాన్‌చెరులో రూ.2,500 నుంచి రూ.3,000లకు పెంచారు.
ఓఆర్‌ఆర్ లోపలి, సరిహద్దు ప్రాంతాల్లో ప్లాట్ల విలువను 100 శాతం పెంచారు. నల్లగొండ, హనుమకొండ, కాజీపేట, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 50 నుంచి 75 శాతం పెంపుదల జరిగింది. హెచ్‌ఎండీఏ వేలం పాటల్లో హైదరాబాద్ శివార్లలో పలుచోట్ల ఎకరా రూ.200 కోట్లు దాటిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతాల్లోనూ మార్కెట్ విలువను 100 శాతం పెంచారు. ఇక ప్లాట్లకు సంబంధించి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1, 12లలో చదరపు గజం రూ.1.16 లక్షలుగా నిర్ణయించారు. రాష్ట్రంలో స్థలాల అత్యల్ప విలువ చదరపు గజానికి రూ.600గా ఉంది.

మూడో సారి..
రాష్ట్రం ఏర్పడిన తరువాత భూముల విలవ పెంచడం ఇది మూడోసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా 2013లో భూముల మార్కెట్ విలువలను సవరించారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా దాదాపు ఎనిమిదేండ్ల పాటు పాత ధరలే కొనసాగాయి. అయితే, 2021 జూలైలో మొదటిసారిగా మార్కెట్ విలువలను భారీగా సవరించారు. ఆరు నెలల వ్యవధిలోనే అంటే 2022 ఫిబ్రవరిలో రెండోసారి భూముల ధరలను ప్రభుత్వం పెంచింది. తాజాగా ఇది మూడోసారి.
మారని రిజిస్ట్రేషన్ల చార్జీలు
భూముల మార్కెట్ విలువను సవరించినప్పటికీ, రిజిస్ట్రేషన్ల చార్జీల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో అమల్లో ఉన్న 7.5 శాతం చార్జీలతోనే రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని వెల్లడించింది. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో చూపే మార్కెట్ విలువ ప్రకారం రిజిస్ట్రేషన్ల చార్జీని వసూలు చేయనున్నారు. ప్రజలు ఎవైనా సూచనలు, సలహాలు తెలియజేయాలన్నా, సందేహాలు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 1800 599 4788, వాట్సప్ నంబర్ 82476 19983ని సంప్రదించవచ్చని రిజిస్ట్రేషన్ల శాఖ వెల్లడించింది.
తాజావార్తలు
- ●10th Supplementary Exams | నేటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు..
- ●Gas Cylinder Explosion | ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. ముగ్గురు సజీవ దహనం
- ●Heavy Rainfall | నేటి నుంచి ఈ నెల 8 వరకు భారీ వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు
- ●Free MMTS Travel | ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం.. ఆ షరతులకు అంగీకరిస్తేనే!
- ●Horoscope | జూన్ 5 రాశి ఫలాలు.. ఈ రాశివారు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి!
- ●Liver Protection Supplements | రెగ్యులర్‌గా మందు తాగుతున్నారా? లివర్ పాడవకుండా ఈ 3 సప్లిమెంట్స్ వాడండి!

10th Supplementary Exams | నేటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు..

Gas Cylinder Explosion | ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. ముగ్గురు సజీవ దహనం

Heavy Rainfall | నేటి నుంచి ఈ నెల 8 వరకు భారీ వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు

Free MMTS Travel | ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం.. ఆ షరతులకు అంగీకరిస్తేనే!



