Oil Palm Hub | సూర్యాపేటలో ఇంటిగ్రేటెడ్ ఆయిల్‌పామ్ హబ్ ఏర్పాటుకు రిలయన్స్ ఆసక్తి
Oil Palm Hub | నీటిని అధికంగా వినియోగించే వరి సాగుపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గిస్తూ, రైతులకు స్థిరమైన, లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలను అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగుకు భారీ ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించింది.
- వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్..
- కోదాడ–హుజూర్‌నగర్ నుంచే ఆయిల్‌పామ్ విస్తరణకు శ్రీకారం
- ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలనూ అనుసంధానిస్తూ భారీ ప్రణాళిక
- తోటల నుంచి ప్రాసెసింగ్, రిఫైనరీ, అనుబంధ పరిశ్రమల వరకు సమగ్ర వ్యవస్థ
- ఎల్‌నినో పరిస్థితులు.. జలాశయాలకు అనిశ్చిత ప్రవాహాల నేపథ్యంలో పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యం
- రైతుకు ఆదాయం.. సాగునీటిపై ఒత్తిడి తగ్గింపు.. రాష్ట్రానికి పారిశ్రామిక ప్రగతి
- నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
Oil Palm Hub | త్రినేత్ర.న్యూస్ : నీటిని అధికంగా వినియోగించే వరి సాగుపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గిస్తూ, రైతులకు స్థిరమైన, లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలను అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగుకు భారీ ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించింది. ఆయిల్‌పామ్ తోటల విస్తరణతో పాటు ప్రాసెసింగ్, రిఫైనింగ్, అనుబంధ పరిశ్రమలను ఒకే గొలుసులో అనుసంధానిస్తూ సమగ్ర ‘ఫార్మ్ టు ఇండస్ట్రీ’ ఆయిల్‌పామ్ వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
ఈ దిశగా రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖేతన్ మోదీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం బుధవారం రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కోదాడ ఎమ్మెల్యే ఎన్. పద్మావతి రెడ్డితో విస్తృతంగా చర్చించారు.
రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ అర్పన్ బసు, స్టేపుల్స్ విభాగం అధిపతి సంజీవ్ గిరి, ఉద్యానవన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. “రైతును వరి సాగు నుంచి మరో పంటవైపు మళ్లించాలంటే కేవలం సూచనలు సరిపోవు. ప్రత్యామ్నాయ పంట వరికంటే మెరుగైన ఆదాయం ఇవ్వాలి. మార్కెట్‌పై భరోసా ఉండాలి. పంట చేతికొచ్చిన వెంటనే కొనుగోలు, ప్రాసెసింగ్‌కు వ్యవస్థ సిద్ధంగా ఉండాలి. అప్పుడే పంటల వైవిధ్యీకరణ విజయవంతమవుతుంది” అని స్పష్టం చేశారు.
కోదాడ, హుజూర్‌నగర్ నుంచే తొలి అడుగు
సూర్యాపేట జిల్లాలో, ముఖ్యంగా ఒకదానికొకటి ఆనుకొని ఉన్న కోదాడ, హుజూర్‌నగర్ ప్రాంతాన్ని ఆయిల్‌పామ్ ప్లాంటేషన్, ప్రాసెసింగ్ క్లస్టర్‌కు ప్రారంభ కేంద్రంగా పరిశీలించాలని రిలయన్స్ ప్రతినిధులకు ఉత్తమ్ సూచించారు. తదుపరి దశలో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలను కూడా అనుసంధానించడం ద్వారా విస్తృతమైన ముడిసరుకు సేకరణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశాలను అధ్యయనం చేయాలని పేర్కొన్నారు.
ఆయిల్‌పామ్ తోటల విస్తరణ, ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్ (FFB) లభ్యత, ప్రాసెసింగ్ సామర్థ్యం, క్రూడ్ పామ్ ఆయిల్ (CPO), పామ్ కెర్నల్ ఆయిల్ ఉత్పత్తి, పామ్ గింజల పెంకులు తదితర ఉప ఉత్పత్తుల వినియోగంతో పాటు భవిష్యత్తులో సబ్బులు, ఇతర పామ్ ఆధారిత వినియోగ, పారిశ్రామిక ఉత్పత్తుల తయారీ వరకు సమగ్ర వ్యవస్థ ఏర్పాటుపై చర్చించినట్లు మంత్రి తెలిపారు.
వరి ఒక్కటే కాదు.. రైతుకు లాభం ఇచ్చే ప్రత్యామ్నాయం కావాలి
తెలంగాణలో సాగునీటి సదుపాయాలు విస్తరించడంతో పెద్దఎత్తున వరి సాగవుతోంది. సాగులో అలవాటు, ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థపై ఉన్న భరోసా కారణంగా అనేక ప్రాంతాల్లో వరి ప్రధాన పంటగా మారింది. అయితే విస్తృతమైన వరి సాగు సాగునీటి వనరులపై తీవ్ర ఒత్తిడిని పెంచడంతో పాటు ప్రతి ఏటా లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు, రవాణా, మిల్లింగ్, నిల్వ వంటి భారీ బాధ్యతను ప్రభుత్వంపై మోపుతోంది.
ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులు, వర్షపాతంలో అనిశ్చితి ఈ అవసరాన్ని మరింత స్పష్టంగా చేస్తున్నాయని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది నాగార్జునసాగర్‌కు ఆశించిన స్థాయిలో ప్రవాహాలు రాకపోవడం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (SRSP)తో పాటు పలు మధ్యతరహా ప్రాజెక్టుల్లోనూ నీటి లభ్యత పరిమితంగా ఉండటం వంటి పరిస్థితుల నేపథ్యంలో నీటి వినియోగ సామర్థ్యం కలిగిన, రైతుకు గిట్టుబాటు ఆదాయం అందించే పంటల వైపు వ్యవసాయాన్ని వైవిధ్యీకరించాల్సిన అవసరం ఉందని మంత్రులు పేర్కొన్నారు.
3.12 లక్షల ఎకరాలకు చేరిన ఆయిల్‌పామ్
జాతీయ వంటనూనెల మిషన్–ఆయిల్‌పామ్ (NMEO-OP) అమలులో తెలంగాణ దేశంలో వేగంగా ముందుకు సాగుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. సమావేశంలో వెల్లడించిన గణాంకాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 3,12,275 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతుండగా, 65,691 మంది రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారు. NMEO-OP అమలుకు ముందు రాష్ట్రంలో సుమారు 46,325 ఎకరాల్లో మాత్రమే ఆయిల్‌పామ్ ఉండగా, మిషన్ కింద అదనంగా 2,65,950 ఎకరాలు సాగులోకి వచ్చాయి. ఇందుకోసం ఇప్పటివరకు సుమారు రూ.515.84 కోట్లు వ్యయం చేశారు.
ముఖ్యంగా 2023 డిసెంబర్ తర్వాత ఆయిల్‌పామ్ విస్తరణ మరింత వేగం పుంజుకుంది. అప్పటి నుంచి సుమారు 1.29 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి రాగా, దాదాపు రూ.388.99 కోట్లు ఖర్చు చేశారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మరో 21,230 ఎకరాలు ఆయిల్‌పామ్ సాగులోకి వచ్చాయి.
సూర్యాపేటకు ఖమ్మం, కొత్తగూడెం అనుసంధానం
ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో సుమారు 5,753 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతోంది. అయితే భారీ ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు అవసరమైన ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్‌ను ఒక్క జిల్లా నుంచే సమకూర్చడం సాధ్యం కాకపోవచ్చని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సూర్యాపేటతో పాటు ఖమ్మం, కొత్తగూడెం తదితర అనుకూల జిల్లాల నుంచి ముడిసరుకును సమీకరించే అవకాశాలను అధ్యయనం చేయాలని రిలయన్స్‌ను ప్రభుత్వం కోరింది.
ఆయిల్‌పామ్ తోటల వయస్సు, ఉత్పాదకత, భవిష్యత్ FFB ఉత్పత్తి, సాగు విస్తరణ అవకాశాలు, రవాణా సదుపాయాలు, కలెక్షన్ సెంటర్లు, నర్సరీలు, పామ్ కెర్నల్స్, షెల్స్ లభ్యత తదితర అంశాలను అధ్యయనం చేసిన అనంతరం ప్రతిపాదిత పరిశ్రమ సామర్థ్యం, స్థలాన్ని రిలయన్స్ నిర్ణయించనుంది.
తోట నుంచి పరిశ్రమ వరకు.. దశలవారీ పెట్టుబడులు
ముందుగా ఆయిల్‌పామ్ తోటలు, ముడిసరుకు వనరులను బలోపేతం చేసి, అందుబాటులోకి వచ్చే FFBకు అనుగుణంగా ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలని సమావేశంలో చర్చించారు. తోటలు పరిపక్వత సాధించి ఉత్పత్తి పెరిగే కొద్దీ పరిశ్రమ సామర్థ్యాన్ని కూడా దశలవారీగా విస్తరించవచ్చని భావిస్తున్నారు. భవిష్యత్తులో క్రూడ్ పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, షెల్స్ తదితర ఉప ఉత్పత్తుల ప్రాసెసింగ్‌తో పాటు సబ్బులు, ఇతర పామ్ ఆధారిత వినియోగ వస్తువులు, పారిశ్రామిక ఉత్పత్తులను తయారు చేసే సమగ్ర ఆయిల్‌పామ్ పారిశ్రామిక సముదాయంగా దీనిని తీర్చిదిద్దే అవకాశాలను పరిశీలిస్తున్నారు.
30 ఏళ్ల వరకు రైతుకు ఆదాయం
వాణిజ్య నూనె పంటల్లో ఎకరానికి అత్యధిక నూనె దిగుబడి ఇచ్చే పంటల్లో ఆయిల్‌పామ్ ఒకటని అధికారులు వివరించారు. ఒకసారి తోట స్థిరపడిన తర్వాత దాదాపు 30 సంవత్సరాల పాటు రైతుకు ఆదాయాన్ని అందించే సామర్థ్యం దీనికి ఉందని పేర్కొన్నారు. సమావేశంలో ఇచ్చిన ప్రజెంటేషన్ ప్రకారం ఒక టన్ను నూనె ఉత్పత్తికి దాదాపు 0.625 ఎకరాల ఆయిల్‌పామ్ సాగు సరిపోతుందని, సంప్రదాయ నూనెగింజల పంటలతో పోలిస్తే భూ వినియోగ సామర్థ్యం గణనీయంగా ఎక్కువగా ఉంటుందని వివరించారు.
రైతుకు ఆదాయం.. నీటికి పొదుపు.. రాష్ట్రానికి పరిశ్రమ
ఆయిల్‌పామ్ ఆధారిత సమగ్ర వ్యవస్థ బలోపేతమైతే రైతులకు స్థిరమైన ఆదాయం లభించడంతో పాటు సాగునీటి వనరులపై ఒత్తిడి తగ్గుతుందని, ప్రతి ఏటా ప్రభుత్వం ఎదుర్కొంటున్న భారీ ధాన్యం కొనుగోలు, రవాణా, మిల్లింగ్, నిల్వ భారాన్ని క్రమంగా తగ్గించేందుకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ ఆయిల్‌పామ్ కార్యక్రమంతో 14 కంపెనీలు అనుసంధానమై ఉన్నాయి. జిల్లాల వారీగా ఆయిల్‌పామ్ విస్తీర్ణం, ఉత్పత్తి, సబ్సిడీలు, కంపెనీలకు కేటాయించిన ప్రాంతాలు, భవిష్యత్ FFB లభ్యతకు సంబంధించిన తాజా సమాచారాన్ని రిలయన్స్‌కు అందించాలని అధికారులను ఆదేశించారు.
రిలయన్స్ ప్రతినిధి బృందం త్వరలో కోదాడ, హుజూర్‌నగర్, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం ప్రాంతాల్లో పర్యటించి ఆయిల్‌పామ్ తోటలు, ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది. ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చితే కోదాడ, హుజూర్‌నగర్, సూర్యాపేట ప్రాంతం తెలంగాణలో విస్తృతమైన ‘ఫార్మ్ టు ఇండస్ట్రీ ఆయిల్‌పామ్ కారిడార్’కు కేంద్రబిందువుగా అవతరించే అవకాశం ఉంది. రైతులకు వరికి గిట్టుబాటు ప్రత్యామ్నాయాన్ని అందించడంతో పాటు, దేశం వంటనూనెల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే జాతీయ లక్ష్యంలో తెలంగాణ మరింత కీలక పాత్ర పోషించనుంది.
తాజావార్తలు
- ●Minister Jupally Krishna Rao | శ్రీలంక - తెలంగాణ మధ్య పర్యాటక బంధానికి మరింత ఊతం
- ●South Heroines | సౌత్‌లో ఒకలా.. నార్త్‌లో మరోలా! పాన్ ఇండియా కోసం బోల్డ్ రోల్స్‌కు సై..!
- ●Konda Sushmitha | జనసేనలోకి కొండా సుష్మిత.. క్లారిటీ ఇచ్చిన పార్టీ
- ●PJTAU | 27 నుంచి అగ్రికల్చర్ కోర్సులకు కౌన్సెలింగ్
- ●Onam | ఓనం పండుగకు సినీ గ్లామర్.. సంప్రదాయ లుక్‌లో హీరోయిన్ల మెరుపులు!
- ●BJP Welfare Schemes 2026 | 'ఉచితాల'పై యూటర్న్? దేశవ్యాప్తంగా బీజేపీని గెలిపిస్తున్న మాస్టర్ ప్లాన్ ఇదే..!

Minister Jupally Krishna Rao | శ్రీలంక - తెలంగాణ మధ్య పర్యాటక బంధానికి మరింత ఊతం

South Heroines | సౌత్‌లో ఒకలా.. నార్త్‌లో మరోలా! పాన్ ఇండియా కోసం బోల్డ్ రోల్స్‌కు సై..!

Konda Sushmitha | జనసేనలోకి కొండా సుష్మిత.. క్లారిటీ ఇచ్చిన పార్టీ

PJTAU | 27 నుంచి అగ్రికల్చర్ కోర్సులకు కౌన్సెలింగ్




