త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

National Press Day 2026 | జాతీయ పత్రికా దినోత్సవం: ‘మీడియా కమిషన్’ ఏర్పాటు చేయాలి.. సోషల్ మీడియా ఉధృతి వేళ విశ్వసనీయతే కీలకమన్న వక్తలు!

జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో వక్తలు కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా ఉధృతి నేపథ్యంలో మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు.

J

Telangana | Published On Nov 16, 2026, 7.54 pm IST

National Press Day 2026 | జాతీయ పత్రికా దినోత్సవం: ‘మీడియా కమిషన్’ ఏర్పాటు చేయాలి.. సోషల్ మీడియా ఉధృతి వేళ విశ్వసనీయతే కీలకమన్న వక్తలు!

సంక్షిప్త సారాంశం

హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీలో జాతీయ పత్రికా దినోత్సవం (నేషనల్ ప్రెస్ డే) ఘనంగా జరిగింది. సోషల్ మీడియా ఉధృతి, మీడియా రంగంలో వస్తున్న పెను మార్పులపై అధ్యయనం కోసం 'మీడియా కమిషన్' ఏర్పాటు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. ప్రధాన మీడియా సంస్థలు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే వాస్తవాధారిత, కచ్చితమైన వార్తలను అందించాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. మీడియాపై ప్రభుత్వాల నియంత్రణ ధోరణి పెరుగుతోందని, జర్నలిస్టులు నైతిక విలువలు, క్రమశిక్షణతో పనిచేయాలని చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు.

Advertisement

National Press Day 2026 | త్రినేత్ర న్యూస్ : ప్రస్తుత సమాజంలో మీడియా రంగంలో వస్తున్న పెను మార్పులు, సోషల్ మీడియా ఉధృతి నేపథ్యంలో జర్నలిస్టులు, మీడియా పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ‘మీడియా కమిషన్’ ఏర్పాటు చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. జాతీయ పత్రికా దినోత్సవం (నేషనల్ ప్రెస్ డే) సందర్భంగా సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయంలో ప్రత్యేక సదస్సు జరిగింది. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ), తెలంగాణ మీడియా అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు.

National Press Day 2026 Speakers Demand Media Commission Amid Social Media Surge

ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవాలి: ప్రొఫెసర్ కోదండరాం

సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు అనుగుణంగా మీడియాలో మార్పులు అవసరమన్నారు. సోషల్ మీడియా వేగంగా దూసుకుపోతున్న తరుణంలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో కచ్చితత్వం, వాస్తవాధారంగా, వేగంగా వార్తలను అందించాల్సిన బాధ్యత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలపై ఉందని పేర్కొన్నారు. కొన్ని మీడియా యాజమాన్యాలు పాలకుల మద్దతు కోసం వార్తల స్వరూపాన్నే మార్చేస్తున్నాయని, కేవలం సంచలనాల కోసమే ఆరాటపడటం వల్ల ప్రధాన మీడియా సంస్థలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజానికి ఏది అవసరమో, ప్రజలకు ఎంతవరకు మేలు జరుగుతుందో ఆలోచించి వార్తలు అందించాలని సూచించారు.

National Press Day 2026 Speakers Demand Media Commission Amid Social Media Surge

ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉండాలి: కె. శ్రీనివాస్ రెడ్డి

1966 నవంబర్ 16న నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సూచనలతో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటైన రోజును నేషనల్ ప్రెస్ డేగా జరుపుకుంటున్నామని మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి గుర్తుచేశారు. “జర్నలిజం: పాపులిస్ట్ వర్సెస్ రెస్పాన్సిబుల్” అనే అంశంపై ఆయన మాట్లాడుతూ.. తప్పుడు సమాచారం (ఫేక్ న్యూస్) వ్యాప్తి చెందుతున్న ఈ రోజుల్లో నైతిక, కచ్చితమైన వార్తా సేకరణ ద్వారానే మీడియా తన విశ్వసనీయతను కాపాడుకోగలదన్నారు. మీడియా ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడాలని, జర్నలిస్టులు మీడియా చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

National Press Day 2026 Speakers Demand Media Commission Amid Social Media Surge

మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకుంటున్నారు: ప్రొఫెసర్ హరగోపాల్

ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలను కాపాడటంతో పాటు, మీడియాపై బెదిరింపులు వచ్చినప్పుడు రక్షించడం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బాధ్యత అన్నారు. ప్రభుత్వాలు ఎప్పుడూ మీడియాను నియంత్రించాలని చూస్తాయని, నేరుగా జర్నలిస్టులను కట్టడి చేయడం సాధ్యం కాదని గ్రహించి, ఇప్పుడు మీడియా సంస్థలనే తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. జర్నలిస్టులు వృత్తిపరమైన క్రమశిక్షణ అలవర్చుకున్నప్పుడే సమాజంలో గౌరవం దక్కుతుందన్నారు.

National Press Day 2026 Speakers Demand Media Commission Amid Social Media Surge

పోక్సో కేసుల్లో గోప్యత పాటించాలి: పద్మజ, అమీర్ అలీ ఖాన్

మరో వక్త పద్మజ మాట్లాడుతూ.. నేడు మీడియాను కేవలం ఒక ఇండస్ట్రీలా చూస్తున్నారని అన్నారు. సంచలన రాజకీయ, నేర వార్తల కంటే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రకృతి వైపరీత్యాలపై ముందస్తు హెచ్చరికలు జారీ చేసే కథనాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ముఖ్యంగా పోక్సో (POCSO) కేసుల విషయంలో చిన్నారుల గోప్యతకు భంగం కలగకుండా మీడియా బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. అనంతరం అమీర్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. జర్నలిజం వృత్తిలోకి వచ్చేది అడ్డదారుల్లో డబ్బు సంపాదించడానికి కాదని, నీతి నిజాయితీతో పనిచేసి వృత్తికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు కె. రామచంద్రమూర్తి, మల్లెపల్లి లక్ష్మయ్య, ఎన్. వేణుగోపాల్, కె. సాజయ్య, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు కె. విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె. రామ్ నారాయణ, మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement