త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | జాతీయ జనగణనలో బీసీలు ఏరి? 40 ప్రశ్నల్లో ఓబీసీ కాలమ్ తొలగింపుపై కేంద్రంపై మంత్రి పొన్నం ఫైర్

జాతీయ జనగణన కోసం కేంద్రం రూపొందించిన 40 ప్రశ్నల ఫామ్‌లో 'ఓబీసీ' ప్రస్తావన లేకపోవడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల పట్ల మోదీకి ఉన్నది మొసలి కన్నీరేనని విమర్శించారు.

J

Telangana | Published On Aug 16, 2026, 2.37 pm IST

Ponnam Prabhakar | జాతీయ జనగణనలో బీసీలు ఏరి? 40 ప్రశ్నల్లో ఓబీసీ కాలమ్ తొలగింపుపై కేంద్రంపై మంత్రి పొన్నం ఫైర్
Advertisement
  • గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్
  • కేంద్రం తాజాగా విడుదల చేసిన 40 జనగణన ప్రశ్నల్లో ఓబీసీ కాలమ్ లేకపోవడంపై తీవ్ర అభ్యంతరం
  • 12 ఏళ్లుగా బీసీల కోసం ప్రధాని మోదీ ఒక్క పథకమైనా తెచ్చారా అని నిలదీత
  • 50 శాతం రిజర్వేషన్ల క్యాప్ తీసేయాలంటే శాస్త్రీయమైన కులగణన తప్పనిసరి అని స్పష్టీకరణ

Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ (Hyderabad) గాంధీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. త్వరలో జరగబోయే జాతీయ జనగణన (National Census) లో ఓబీసీ (OBC) లను కేంద్రం ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ సూటిగా సమాధానం చెప్పాలి

'నేను బీసీని' అని గర్వంగా చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీ గత 12 ఏళ్లుగా ఆ వర్గాల సంక్షేమం కోసం ఏం చేశారో దేశ ప్రజలకు సూటిగా సమాధానం చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కేంద్రం ఏ ఒక్క కార్యక్రమమైనా చేపట్టిందా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

ఆ 40 ప్రశ్నల్లో ఓబీసీ ప్రస్తావన ఏదీ?

2025 ఏప్రిల్‌లో చేపట్టిన జనగణనకు సంబంధించి కేంద్రం ముందుగా 32 ప్రశ్నలతో కూడిన సర్వే ఫారమ్‌ను తీసుకొచ్చింది. అయితే అందులో 13వ కాలమ్‌లో ఎస్సీ, ఎస్టీ వివరాలు అడిగారు కానీ బీసీల ప్రస్తావన ఎక్కడా లేదు.

ఈ అన్యాయంపై గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాని మోదీని కలిసి స్వయంగా ఫిర్యాదు చేశారు.

స్పందించిన కేంద్ర పెద్దలు.. రెండో విడతలో కచ్చితంగా ఆ వివరాలు సేకరిస్తామని నమ్మబలికారు.

కానీ, ఆగస్టు 15న తాజాగా రిలీజ్ చేసిన 40 ప్రశ్నల్లో (40 questions) కూడా ఎస్సీ, ఎస్టీ ప్రస్తావన ఉంది తప్ప.. ఓబీసీ అని ఎక్కడా లేకపోవడం కేంద్రం కపటబుద్ధికి నిదర్శనమని పొన్నం మండిపడ్డారు. ఓబీసీ సెల్, కాంగ్రెస్ పార్టీ తరఫున దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

రిజర్వేషన్ల పెంపునకు కులగణన కీలకం

సుప్రీంకోర్టు విధించిన 50% రిజర్వేషన్ల సీలింగ్ (50% reservation cap) ఎత్తివేయాలంటే ప్రామాణికమైన సామాజిక లెక్కలు కోర్టుకు సమర్పించాల్సి ఉంటుందని మంత్రి గుర్తుచేశారు. "జిత్నీ ఆబాదీ.. ఉత్నా హక్" (ఎవరి జనాభా ఎంత ఉంటే వారికి అంత వాటా) అన్న రాహుల్ గాంధీ నినాదం అమలు కావాలంటే కులగణన (Caste census) జరిగి తీరాల్సిందేనన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావు వంటి రాష్ట్ర బీజేపీ నేతలకు కేవలం బీసీల ఓట్లు కావాలి కానీ, వారి హక్కులు పట్టవా అని ఆయన నిలదీశారు.

దళిత బిడ్డ పట్ల వివక్ష.. శుద్ధి చేయడం రాజ్యాంగానికి అవమానం

చండీగఢ్‌లో రాజ్యసభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరైన సమావేశం తర్వాత.. ఆ ప్రాంగణాన్ని బీజేపీ నేతలు శుద్ధి చేయడాన్ని పొన్నం తీవ్రంగా ఖండించారు. 15 సార్లు ఎన్నికల్లో గెలిచిన ఒక దళిత బిడ్డ పట్ల మనువాద భావజాలంతో వ్యవహరించడం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి జరిగిన ఘోర అవమానమని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరిచి 40 ప్రశ్నల జాబితాను సవరించాలని, బీసీల కాలమ్‌ను తక్షణమే చేర్చాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement