త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | మందు గ‌మ‌నం మాత్ర‌మే జోరుమీదున్న‌ది.. మిగ‌తాదంతా మంద‌గ‌మ‌న‌మే: కేటీఆర్

KTR | రాష్ట్రంలో మందు గ‌మ‌నం మాత్ర‌మే జోరుమీదున్న‌దని.. మిగ‌తాదంతా మంద‌గ‌మ‌న‌మేన‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమ‌ర్శించారు. రెండున్న‌రేండ్ల కాంగ్రెస్ పాల‌న‌లో ఎక్సైజ్ శాఖ మిన‌హా.. అన్ని రంగాల్లో ఆదాయం ప‌డిపోయింద‌న్నారు.

G

Telangana | Published On Jun 3, 2026, 1.36 pm IST

KTR | మందు గ‌మ‌నం మాత్ర‌మే జోరుమీదున్న‌ది.. మిగ‌తాదంతా మంద‌గ‌మ‌న‌మే: కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో మందు గ‌మ‌నం మాత్ర‌మే జోరుమీదున్న‌దని.. మిగ‌తాదంతా మంద‌గ‌మ‌న‌మేన‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమ‌ర్శించారు. రెండున్న‌రేండ్ల కాంగ్రెస్ పాల‌న‌లో ఎక్సైజ్ శాఖ మిన‌హా.. అన్ని రంగాల్లో ఆదాయం ప‌డిపోయింద‌న్నారు. క‌ష్ట‌ప‌డి సాధించుకున్న రాష్ట్రానికి ఒక తెలంగాణ ద్రోహి ముఖ్య‌మంత్రింగా ఉన్నారని మండిప‌డ్డారు. నూరు రోజులు.. ఆరు గ్యారంటీలు అని ప‌నికిమాలిన ప్ర‌చారాలు చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. అల‌విగాని హామీల‌తో అడ్డ‌మైన మాట‌ల‌తో, దుష్ప్ర‌చారాలతో అధికారంలోకి వ‌చ్చారని విమ‌ర్శించారు. ముఖ్య‌మంత్రికి కేసీఆర్ నామ‌స్మ‌ర‌ణ త‌ప్ప‌ ప‌రిపాల‌న చేత‌గాదని మండిప‌డ్డారు. ధాన్యం సంచులు కొనే తెలివి లేదు కానీ. ఢిల్లీకి ధ‌నం సంచులు మోసేది తెలుసని దుయ్య‌బ‌ట్టారు. ఈ రెండున్న‌రేండ్లలో మొత్తం తిరోగ‌మ‌ణమే త‌ప్ప పురోగ‌మ‌ణం ఎక్క‌డిదని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వ నినాద‌మేమో రైజింగ్‌.. విధానం మాత్రం ఫాలింగ్ అని ఎద్దేవా చేశారు.

మ‌మ‌కారంతో ప‌నిచేసుకుంటూ పోతే..

కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ ఏం చేసిందో ఒక్క మాట‌లో చెప్పాలంటే.. స‌మ‌గ్ర‌, స‌మీకృత‌, స‌మ‌తుల్య అప్రోచ్‌తో అన్ని వ‌ర్గాల‌ను క‌లిపి న‌డిపింది. విద్యార్థులు, నిరుద్యోలు, ఉద్యోగులు, మ‌హిళ‌లు, కార్మికులు, క‌ర్ష‌కులు, ప్ర‌తి వ‌ర్గానికి మేలు చేశాం. ఉద్యోగుల‌కు అత్య‌ధిక ఫిట్‌మెంట్ ఇచ్చింది దేశంలోనే కేసీఆర్ ప్ర‌భుత్వం. 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన ప్ర‌భుత్వం భార‌త‌దేశంలో ఎక్క‌డాలేదు. మేము మ‌మ‌కారంతో ప‌నిచేసుకుంటూ పోతే అహంకార‌మ‌ని మాపై ముద్రవేశారు. కేసీఆర్ కుటుంబం మాత్ర‌మే బాగుప‌డిందని ప్ర‌చారం చేశారు. మొత్తం 4 కోట్ల మంది ప్ర‌జ‌లు నా కుటుంబ‌మ‌ని చెప్పి కేసీఆర్ భావిస్తే.. ఆ న‌లుగురి కోస‌మే తెలంగాణ వ‌చ్చిందా అని విష ప్ర‌చారం చేశారు. అధికారం ఎవ‌రికీ శాశ్వ‌తం కాదు. శాశ్వ‌తంగా అధికారంలో ఉంటామ‌ని ఎవ‌రైనా అనుకుంటే వారు మూర్ఖులు. అధికారం పోయింద‌నే బాధ మాకు ఏమాత్రం లేదు. ఇంత క‌ష్ట‌ప‌డి సాధించిన రాష్ట్రం, ఇన్ని త్యాగాల‌తో ఏర్ప‌డిన రాష్ట్రానికి ఇవాళ ఒక తెలంగాణ ద్రోహి ముఖ్య‌మంత్రింగా ఉన్నారు. తెలంగాణ వాదుల‌పైకి తుపాకీ తీసుకెళ్లిన ఒక వ్య‌క్తిని కాంగ్రెస్ మ‌న నెత్తిన రుద్దింది. కాంగ్రెస్ క‌ల్చ‌రే సీల్డ్ క‌వ‌ర్ సీఎం. ఎవ‌రు ఎక్కువ డ‌బ్బులు ఇస్తే వారికి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి వ‌స్తుందనేది అంద‌రికీ తెలిసిందే.

30 నెల‌లైనా పిల్ల‌లు పుట్ట‌క‌పోతే మిమ్మ‌ల్ని ఏమ‌నాలి?

ఒక సినిమా హిట్టా ఫ‌ట్టా అనేది ట్రెయిల‌ర్ చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్క‌డ‌ ఇంట్ర‌వెల్ కూడా అయిపోయింది. రెండున్న‌రేండ్లు అయిపోయింది. ఫ‌స్ట్ హాఫ్ డిజాస్ట‌ర్‌. రెండో స‌గం కూడా ప‌క్కా డిజాస్ట‌ర్‌. పెద్ద‌గా చూడ‌టానికి కూడా ఏం లేదు. అన్నం ఉడికిందా లేదో తెసుకోవ‌డానికి ఒక్క మెతుకు ముట్టుకుంటే చాలు కదా!. రెండున్న‌ర సంవ‌త్స‌రాలు అయింది. ముఖ్య‌మంత్రి అప‌స‌వ్య మాటలు వింటుంటే న‌వ్వాలో ఏడ్వాలో తెలియడం లేదు. నూరు రోజులు.. ఆరు గ్యారంటీలు అని ప‌నికిమాలిన ప్ర‌చారాలు చేసిందే మీరు. ఆర్థిక ప‌రిస్థితి ఏంటి అంటే మా కాంగ్రెస్‌కు అపార‌మైన అనుభ‌వం ఉంది. మాత‌త‌లు నేతులు తాగారు. మా మూతుల వాస‌న చూడండి. చాలాకాలం నిర్విగ్నంగా ప్ర‌భుత్వాల‌ను న‌డిపాం. మాకున్న అమోఘ‌మైన ఆర్థిక ప‌రిజ్ఞానంతో అద్భుతాలు సృష్టిస్తాం. ఇదేముంది నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అనాస‌యంగా ఇస్తామ‌న్నారు. ఇప్పుడు ఎంత కండ‌లు తిరిగిన ప‌హిల్మాన్ అయినా మూడు నెల‌ల్లో పిల్ల‌లు పుట్టిస్త‌డా అని ముఖ్య‌మంత్రి అంటున్నారు. మూడు నెల‌ల్లో పిల్ల‌లు పుట్ట‌ర‌ని మాకు తెలుసు. కానీ 30 నెల‌లో పుట్ట‌క‌పోతే ఏమ‌నాలి మిమ్మ‌ల్ని?. ఏమ‌ని పిల‌వాలి?. న‌పుంశ‌కులు అనాలా? ఏమ‌నాలి?.

ఎప్పుడో అట‌కెక్కించారు..

వ‌డ్డించిన విస్త‌రిలాగా బంగారు ప‌ళ్లెంలో పెట్టి రాష్ట్రాన్ని అప్ప‌జెప్పాం. కేసీఆర్ హ‌యాంలో క‌రోనా వ‌చ్చినా రైతు బంధు ఆగ‌లేదు. క‌ల్యాణ ల‌క్ష్మి ఆగ‌లేదు. కేసీఆర్ కిట్‌, ఆస‌రా పెన్ష‌న్లు, ఉద్యోగుల జీతాలు ఏవీ ఆగ‌లేదు. ఇప్పుడు మీ పాల‌న‌లో ఏ ఒక్క ప‌థ‌కం కొత్త‌గా పెట్ట‌లేదు. ఆరు గ్యారంటీలు ఎప్పుడో అట‌కెక్కించారు. అల‌విగాని హామీల‌తో అడ్డ‌మైన మాట‌ల‌తో, దుష్ప్ర‌చారాలు, విష ప్ర‌చారాలతో అధికారంలోకి వ‌చ్చారు.

అది త‌ప్ప.. నువ్వు చేసిందేంది..

ప‌రిపాల‌న చేత‌గాదు. క‌ప్పం క‌ట్టడం ఒక‌టి మాత్రం తెలుసు. ధాన్యం సంచులు కొనే తెలివి లేదు. ధ‌నం సంచులు ఢిల్లీకి మోసేది తెలుసు. ఏం చేస్తున్నాడు? ఏమీలేదు. తెల్లారి లేస్తే కేసీఆర్ నామ స్మ‌ర‌ణ త‌ప్ప‌. తుఝే క్యా కియా అంటే..`తేరా నామ్ లియా, తుఝె యాద్ కియా` అని.. రెండున్న‌రేండ్ల నుంచి ఎక్క‌డ పోయినా అదే. బాల‌ల దినోత్స‌వానికి పోయినా, స్వాతంత్య్ర దినోత్స‌వానికిపోయినా కేసీఆర్ నామ‌స్మ‌ర‌ణే. అది త‌ప్ప నువ్వు చేసిందేంది రెండున్న‌రేండ్లు. మొత్తం తిరోగ‌మ‌న‌మే త‌ప్ప పురోగ‌మ‌నం ఎక్క‌డిది.

నినాదం రైజింగ్‌.. విధానం ఫాలింగ్‌..

స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ప‌డిపోయింది. రెజిస్ట్రేష‌న్ రెవెన్యూ త‌గ్గింది. జీఎస్టీ గ్రోత్ రేడ్ డౌన్‌. వెహికిల్ సేల్స్ రెవెన్యూ డౌన్‌. ఒక‌టే ఒక్క డిపార్ట్‌మెంట్ బాగా ప‌నిచేస్తున్న‌ది. అదే ఎక్సైజ్‌. మందు గ‌మ‌న‌మొక్క‌టే జోరుమీదున్న‌ది. మిగ‌తాదంతా మంద‌గ‌మ‌న‌మే. ఇలా ప్ర‌భుత్వ‌మేమో హాండ్స్ అంటే.. నినాద‌మేమో రైజింగ్‌. మ‌ళ్లీ ఇప్పుడిప్పుడే కాదు. నిన్ను గెలిపించేది 2028 వ‌ర‌కు. కానీ నువ్వేమో 2047 ముచ్చ‌ట్లు చెబుతున్న‌వ్‌. నినాదం రైజింగ్‌.. విధానం ఫాలింగ్‌.

నినాదం మాత్రం రైజింగ్‌.. చూస్తే లెక్క‌లు మొత్తం ఫాలింగ్‌. వ‌రుగా రెండేండ్లు రెవెన్యూ లోటు. 2024-25లో రెవెన్యూ లోటు రూ.9,420 కోట్లు. 2025-26లో రూ.9235 కోట్లు. మాద‌గ్గ‌ర పైస‌ల్లేవు. ఏమీ చేయ‌లేం. దివాళా తీశామ‌ని భ‌ట్టి విక్ర‌మార్క చెప్పారు. ఇంకా ముఖ్య‌మంత్రి తొక్కుకుంటూ వ‌చ్చా అని డైలాగులు కొడుతున్నారు. నిజ‌మే.. తెలంగాణ‌ను పాతాళానికి తొక్కేశావ్‌. నువ్వు వ‌చ్చిన త‌ర్వాత ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను చిదిమేశావ్‌. క‌రోనా కాలంలో కంటే కాంగ్రెస్ కాలంలోనే రాష్ట్రం ఆర్థికంగా ప్ర‌మాదంలో ఉంది. క‌రోనా కంటే కాంగ్రెస్ డేంజ‌ర్ అని ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంది.

స్వ‌యం పోషితంగా ఎదిగిన తెలంగాణ‌

స్వ‌యం పాల‌న‌లో తెలంగాణ స్వ‌యం పోషితంగా ఎదిగింది. 84 శాతం స్టేట్ ఓన్ ట్యాక్ రెవెన్యూతో (SOTR) దేశంలోనే అత్య‌ధిక ఎస్‌వోటీఆర్ క‌లిగిన రాష్ట్రం తెలంగాణ‌. కేంద్ర దిక్కు చూడాల్సిన అవ‌స‌రం లేకుండా తీర్చిదిద్దారు కేసీఆర్‌. తెలంగాణ త‌న కాళ్ల‌పై తాను నిల‌బ‌డేలా చేశారు. మేము సెల్ఫ్ డ‌బ్బాలు కొట్టుకోలే.. సెల్ఫ్ రిల‌యంట్‌గా ఎదిగాం. ప‌దేండ్లు ఎస్‌వోటీఆర్‌లో రాష్ట్రం అగ్ర‌స్థానంలో ఉంది. మ‌రి ఇప్పుడు రెండున్నారేండ్ల‌లో ఏంజ‌రిగింది. 2023లో రూ.ల‌క్షా 11 వేల 798 కోట్లుగా ఉంది. సాధార‌ణంగా మరుస‌టి స‌వంత్స‌రం పెర‌గాలి. కానీ 2024లో రూ.ల‌క్షా 9 వేల కోట్లకు త‌గ్గింది. 2026లో ఎలా ఉంటుందో చూడాలి. జీఎస్టీలో కూడా ఇదే ప‌రిస్థితి. అన్ని రంగాల్లో డౌన్ త‌ప్ప పైకి లేదు.` అని కేటీఆర్ విమ‌ర్శించారు.

అప్పుల‌పై త‌ప్పుడు లెక్క‌లు..

బీఆర్‌ఎస్‌ చేసిన అప్పులు తీరుస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నవి కాకి లెక్కలే. ఏడాది కాలంలో రూ.29 వేల కోట్లు మాత్రమే అప్పులు తీర్చారు. నెలకు రూ.6 వేల కోట్లు అప్పు తీరుస్తున్నామనేది అబద్ధం. నెలకు రూ.2వేల కోట్లే చెల్లిస్తున్నారు. తాము పదేండ్ల‌లో రూ.2.80 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేశాం. రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాం. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేశాం. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్‌ ప్లాంట్లు నిర్మించాం. బీఆర్ఎస్ అప్పుల‌పై మంత్రుల‌కే స‌యోధ్య లేదు. ఒక్కొక్క‌రు ఒక్కో లెక్క చెబుతారు.` అని కేటీఆర్ విమ‌ర్శించారు.

ఆ నగదును ఏం చేస్తున్నారు..

రేవంత్‌రెడ్డి సర్కారు రెండున్నరేళ్లలోనే రూ.4.50 లక్షల కోట్ల అప్పు చేసిందని, ఆ డబ్బంతా ఎక్కడికి పోయిందని కేటీఆర్​ ప్రశ్నించారు. భూముల వేలం ద్వారా వేల కోట్లు వస్తున్నాయన్న ఆయన ఆ నగదును ఏం చేస్తున్నారు? అని అడిగారు. తెలంగాణకు మళ్లీ ముప్పు పొంచి ఉందని, మోటార్లకు మీటర్లు పెడితేనే నిధులు ఇస్తామని మోదీ అన్నారని ఆరోపించారు. నిధులు రాకపోయినా సరే రైతుల మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని తాము అధికారంలో ఉన్నప్పుడు చెప్పామని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి మాత్రం మోదీ చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌డీఎస్‌ఎస్‌ పథకంలో చేరి రైతుల మోటార్లకు మీటర్లు పెడుతున్నారన్నారు. తెలంగాణలో అవసరం లేకపోయినా రైతు డిస్కమ్ ఏర్పాటు చేశారని ఆక్షేపించారు.

Advertisement
Advertisement