త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | కేసీఆర్‌ను, జగదీశ్ రెడ్డిని గుంజబాతి కొట్టినా తప్పులేదు

Revanth Reddy | కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, జగదీశ్ రెడ్డిని దామరచర్ల దగ్గర గుంజబాతి కొట్టినా తప్పులేదని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యానించారు.

S

Telangana | Published On Oct 23, 2026, 10.06 pm IST

Revanth Reddy | కేసీఆర్‌ను, జగదీశ్ రెడ్డిని గుంజబాతి కొట్టినా తప్పులేదు
Advertisement
  • కేసీఆర్‌కు అన్నీ ఉన్నాయ్‌.. కానీ మతి పని చేస్త‌లే
  • నీళ్లు ఫామ్‌హౌస్‌కు, నిధులు బీఆర్ఎస్ ఖాతాకు వెళ్లాయి
  • యాదాద్రిలో లక్ష కోట్ల అవినీతికి కేసీఆర్ డిజైన్ చేశారు
  • ప్ర‌జాభ‌వ‌న్ స‌మావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి విమ‌ర్శ‌లు

Revanth Reddy | త్రినేత్ర న్యూస్: కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, జగదీశ్ రెడ్డిని దామరచర్ల దగ్గర గుంజబాతి కొట్టినా తప్పులేదని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు అన్నీ ఉన్నా మతి మాత్రం పని చేయడం లేదని ఎద్దేవా చేశారు. కరువు రావాలని క్షుద్రపూజలు చేసినవారి మాటలను నమ్మవద్దని.. చేతినిండా పని, కడుపు నిండా భోజనం.. ఇదే మన కార్యాచరణ అన్నారు. సంక్రాంతి తర్వాత మే వరకు నాలుగు నెలల పాటు ప్రత్యేక పథకాన్ని తీసుకువస్తామ‌న్నారు. రైతులను ఉత్తేజపరచడానికి కళాజాతాలను సిద్ధం చేయాలని సూచించారు. గాంధీభవన్‌లో ఎంపీ చామల కిరణ్ నేతృత్వంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్ర‌జాభ‌వ‌న్‌లో శుక్ర‌వారం ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

టోల్ ఫ్రీ నంబ‌ర్ ఇవ్వాలి

తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలి. క్యాబినెట్ సబ్‌కమిటీతో పాటు అన్ని స్థాయుల్లో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేసి తాగునీటిని అందించాలి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ కూడా ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలి. విద్యుత్‌ను ఎంత ఖర్చు పెట్టి అయినా కొనడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మార్కెట్‌లో అందుబాటులో లేదు. బ్యాంకుల్లో అప్పులు తెచ్చి విద్యుత్ కొనడానికి ప్రయత్నించినా దొరకడం లేదు. అవసరం లేకుండా విద్యుత్ వాడొద్దు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాలి.

కొండారెడ్డిపల్లిలో గ్రామస్తులు సోలార్ విద్యుత్‌ను అమ్మడం ద్వారా లబ్ధి పొందారు. మహిళా సంఘాలను ఇందులో భాగస్వామ్యం చేయాలి. రా మెటీరియల్ ఉన్న దగ్గరే ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తారు. నాలుగు రూపాయల నుంచి ఐదు రూపాయల లోపే సింగరేణి ప్రాంతంలోని విద్యుత్ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ లభిస్తోంది. 4 వేల మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్‌కు రూ.8 వేల కోట్లు అదనంగా ఖర్చు అయింది. యూనిట్ విద్యుత్ ఉత్పత్తి ఖర్చు రూ.6కు పైగా పెరిగింది. సింగరేణిలో లభ్యం కాని జీ-9 బొగ్గుతో యాదాద్రిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తామని చెప్పారు.
విదేశాల నుంచి కృష్ణపట్నం పోర్టు ద్వారా బొగ్గును దిగుమతి చేసుకుని యాదాద్రిలో విద్యుత్ ఉత్పత్తి చేయాలని చూశారు.

యాదాద్రికి బొగ్గు తెస్తున్నం

రామగుండం, కొత్తగూడెం, మంచిర్యాల లాంటి ప్రాంతాల్లో యాదాద్రిని నిర్మిస్తే రూ.28 వేల కోట్లతో 2019 నాటికి పూర్తి అయ్యేది. ప్రతి ఏడాది రూ.2 వేల కోట్ల బొగ్గు రవాణా భారం తగ్గేది. యాదాద్రిని దామరచర్లలో కట్టడం వల్ల 10 ఏళ్లు ఆలస్యం అయింది. నైని ప్రాంతానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లి స్థానికులతో మాట్లాడి బొగ్గు తీసుకువస్తున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడి మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచి యాదాద్రికి బొగ్గు తీసుకువస్తున్నాం. యాదాద్రిలో ఒక్కొక్క యూనిట్‌ను పట్టాలెక్కిస్తున్నాం.

తెర వెనుక ప్రతిమా శ్రీనివాసరావు

నోరు తెరిస్తే బీఆర్ఎస్ నాయకులు అబద్ధాలు చెబుతున్నారు. జీ-9 బొగ్గు అందుబాటులో లేకపోవడం వల్ల ఇతర రకాల బొగ్గును తీసుకువచ్చి యాదాద్రిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. ప్రతిమా శ్రీనివాసరావు తెర వెనుక ఉన్నారు. ఆయనకు యాభై ఏళ్లలో లక్ష కోట్ల లాభం వచ్చేలా కేసీఆర్ ప్రయత్నం చేశారు. కృష్ణపట్నం, మచిలీపట్నం పోర్టులు మిర్యాలగూడకు దగ్గరగా ఉంటాయన్న ఉద్దేశంతోనే యాదాద్రిని అక్కడ నిర్మించారు. లక్ష కోట్ల అవినీతికి కేసీఆర్ డిజైన్ చేశారు. నీళ్లు, ఇసుక, బొగ్గు, డ్రగ్స్, గంజాయి, పాలు.. ఇలా ఏదీ వదలలేదు.

నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ కేసీఆర్ కుటుంబానికే పోయాయి. నేను, నా కుటుంబం అన్నట్లుగా వాళ్ల తీరు ఉంది. నీళ్లు ఫామ్‌హౌస్‌కు, నిధులు బీఆర్ఎస్ ఖాతాకు వెళ్లాయి. బీఆర్ఎస్ ఖాతాల్లో రూ.1,500 కోట్లు ఉన్నాయి. ఎన్ని ఏళ్లు అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ నిధుల కోసం ప్రతి నెలా వెతుక్కుంటోంది. సింగరేణిలో ఒక్క టెండర్ కూడా వేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంది. అసెంబ్లీలో ఎదురుగా కూర్చోబెట్టి చెప్పాలని అనుకున్నాను. భూముల విషయం బయటపెడితే తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయారు. పాలు కూడా వదలలేదు. ప్రైవేట్ ఆస్పత్రులు, విద్యాసంస్థలకు హరీశ్ రావు పాలు అమ్మారు. సంతోష్ రావుకు టానిక్ ద్వారా విదేశాల నుంచి నేరుగా మద్యం దిగుమతి చేసుకుని అమ్ముకునే అవకాశం ఉంది.

మనం మౌనంగా ఉంటే అర్థాంగీకారంగా భావిస్తున్నారు. విద్యుత్ విషయంలో ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది. రైతులకు విద్యుత్ ఇవ్వడంలో అద్భుతమైన విజయం సాధించాం. మోదీ ఎన్ని పేర్లు మార్చినా అది ఎప్పటికీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకమే. సంక్రాంతి తర్వాత మే వరకు నాలుగు నెలల పాటు ప్రత్యేక పథకాన్ని తీసుకువస్తాం. రైతులను ఉత్తేజపరచడానికి కళాజాతాలను సిద్ధం చేయాలి. గాంధీభవన్‌లో ఎంపీ చామల కిరణ్ నేతృత్వంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఈ పథకం కోసం ఖర్చు పెట్టబోతోంది.

ప్ర‌త్యేక యాప్‌తో ప‌ర్య‌వేక్ష‌ణ‌

ప్రతి ప్రజాప్రతినిధి గ్రామాలకు వెళ్లాల్సిందే. అందరి ఫోన్లలో ప్రత్యేక యాప్ పెట్టి పర్యవేక్షణ చేస్తాం. వ్యవసాయ పొలాలకు వెళ్లే దారులు, కాలువలు, చెరువులు, కుంటలను పునరుద్ధరించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి. ప్రతి మనిషికి పని కల్పించాలి.. ప్రతి ఒక్కరికీ అన్నం పెట్టాలి. పకడ్బందీగా ఈ పథకాన్ని రూపొందించి అమలు చేయాలి. ప్రజలను భాగస్వామ్యం చేయాల్సిందే.. ప్రజలను కప్పిపుచ్చవద్దు.
హరీశ్ రావు అసూయ, ద్వేషంతో ఏ మాటలు మాట్లాడినా పట్టించుకోవద్దు.

కర్ణాటక, తమిళనాడుకు హరీశ్ రావు వెళ్లి కరువు రావాలని క్షుద్రపూజలు చేశారని అద్దంకి దయాకర్ గతంలో చెప్పారు. విద్యుత్ ఇచ్చిన బోర్లలో నీళ్లు లేవు. పెట్టుబడి కూడా పోతుంది. వచ్చే వానాకాలంలో బ్రహ్మాండమైన పంటలు పండించుకోవచ్చు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అందరూ అప్రమత్తంగా ఉండాలి.

పట్టభద్రుల ఎన్నికల్లో ప్రతిసారీ ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గాల్లో గతంతో పోల్చితే ఇప్పటివరకు 36 శాతం ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. ఇంకా 64 శాతం ఓట్లు నమోదు కావాలి. ప్రతి హక్కు ఉన్న ఓటరు నమోదయ్యేలా చూడాలి. ప్రతి ఒక్కరినీ కలవాలి. అభ్యర్థుల ఎంపికపై పార్టీ నిర్ణయమే ఫైనల్. యువకులు సామా రామ్మోహన్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని పార్టీ ఎంపిక చేసింది. వచ్చే 30 ఏళ్ల పాటు పార్టీ కోసం పనిచేస్తారు. బెస్ట్ క్యాండిడేట్స్‌ను పార్టీ ఎంపిక చేసింది. అందరం కలిసి గెలిపించుకోవాలి.

బీఆర్ఎస్, బీజేపీ దొంగదెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నాయి. వెనుక అలాయ్ బలాయ్ చేసుకుంటున్నాయి. సర్పంచ్‌ల్లో 66 శాతం పార్టీ పేరు మీద గెలిచాం. మున్సిపల్ ఎన్నికల్లో 85 శాతంతో పార్టీ సింబల్‌పై గెలిచాం. ప్రతి ఎన్నికలో కార్యకర్తలు, నాయకులు ప్రత్యేక దృష్టి సారించడంతో గెలిచాం. ఎమ్మెల్సీ ఎన్నికలు అభ్యర్థులకు మాత్రమే సంబంధించినవి కావు.. పార్టీకి కూడా సంబంధించినవి. గెలిపించి తీరాలి. ఎన్నికలు లేని జిల్లాలకు చెందిన నాయకులకు బాధ్యతలు అప్పగించాలి అని రేవంత్ సూచించారు.

Advertisement
Advertisement