HIPLEX 2026 | సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలి.. మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు..
HIPLEX 2026 | ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక, భౌగోళిక రాజకీయ పరిణామాలను సవాళ్లుగా కాకుండా అవకాశాలుగా మలుచుకోవాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ సాంకేతికత, నాణ్యత, ఆవిష్కరణలపై దృష్టి పెట్టే పరిశ్రమలే భవిష్యత్తులో మార్కెట్‌ను ముందుండి నడిపిస్తాయని అన్నారు.
HIPLEX 2026 | ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక, భౌగోళిక రాజకీయ పరిణామాలను సవాళ్లుగా కాకుండా అవకాశాలుగా మలుచుకోవాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ సాంకేతికత, నాణ్యత, ఆవిష్కరణలపై దృష్టి పెట్టే పరిశ్రమలే భవిష్యత్తులో మార్కెట్‌ను ముందుండి నడిపిస్తాయని అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో శుక్రవారం ప్రారంభమైన హిప్లెక్స్–2026 (Hyderabad International Plastics Expo) అంతర్జాతీయ ప్లాస్టిక్స్, పాలిమర్స్, ప్రాసెసింగ్ టెక్నాలజీ, యంత్రాల ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల ప్రదర్శనల్లో కేవలం యంత్రాలు మాత్రమే కనిపించవని, వాటి వెనుక వేలాది కుటుంబాల జీవనోపాధి, యువత భవిష్యత్తు, దేశ ఆర్థిక ప్రగతికి కృషి చేస్తున్న పారిశ్రామికవేత్తల సంకల్పం ఉంటుందని పేర్కొన్నారు.
తయారీ రంగానికి పాలిమర్ వెన్నెముక
ప్లాస్టిక్స్, పాలిమర్ పరిశ్రమ దేశ తయారీ రంగంలో కీలక పాత్ర పోషిస్తోందని శ్రీధర్‌బాబు తెలిపారు. నిర్మాణ రంగం, వ్యవసాయం, వైద్య, ఔషధ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఆహార ప్రాసెసింగ్, మౌలిక వసతుల రంగాలకు అవసరమైన ముడి పదార్థాలను ఈ రంగమే అందిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఈ రంగం ద్వారా 50 లక్షల మందికి ప్రత్యక్షంగా, కోటికి పైగా మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోందని, తెలంగాణలో దాదాపు రెండు లక్షల మంది పాలిమర్ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని వివరించారు. ఈ రంగం విస్తరిస్తే తయారీ రంగం బలోపేతమై ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని చెప్పారు.
మందగమనం తాత్కాలికమే
గత ఏడాది పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల, పాలిమర్ ధరల్లో హెచ్చుతగ్గులు, రవాణా, విద్యుత్ వ్యయాల పెరుగుదల, కార్మికుల కొరత వంటి అంశాలు పరిశ్రమపై ప్రభావం చూపాయని మంత్రి తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధికి అనుగుణంగా సాగాల్సిన పాలిమర్ రంగం గత ఏడాది 2.4 శాతం వృద్ధికే పరిమితమైందన్నారు. అయితే ప్రతికూల పరిస్థితుల్లోనూ పరిశ్రమల ఆత్మవిశ్వాసం తగ్గలేదని, హిప్లెక్స్–2026కు లభిస్తున్న స్పందనే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. సంక్షోభ సమయాల్లోనే భవిష్యత్తు అవకాశాలను అందిపుచ్చుకునే సంస్థలు ఎదుగుతాయని అన్నారు.
ప్రతిపాదనలు ఇవ్వండి
పరిశ్రమల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఏఐపీఎంఏ, టాప్మా, ఐపీఐ వంటి పారిశ్రామిక సంఘాలు విధానపరమైన అంశాలు, మౌలిక వసతుల అవసరాలు, ఇతర సమస్యలపై సమగ్ర ప్రతిపాదనలు అందిస్తే ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని తెలిపారు. పరిశ్రమలతో నిరంతర సంప్రదింపులు కొనసాగించడం ప్రభుత్వ విధానమని చెప్పారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా ఎదుగుతోందని మంత్రి పేర్కొన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, లైఫ్‌సైన్సెస్, ఫార్మా, ఏరోస్పేస్ రంగాల్లో సాధించిన విజయాలను పాలిమర్ రంగంలోనూ సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ప్రోత్సాహం ఇచ్చేందుకు హామీ
ప్లాస్టిక్ ప్రాసెసింగ్, ఇంజినీరింగ్ ప్లాస్టిక్స్, మెడికల్ ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్, రీసైక్లింగ్, సర్క్యులర్ ఎకానమీ, ఈవీ విడిభాగాలు వంటి రంగాల్లో తెలంగాణకు మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కలిపి సుమారు 13 లక్షల టన్నుల పాలిమర్ వినియోగం ఉందని, ప్రభుత్వం–పరిశ్రమలు కలిసి పనిచేస్తే 2030 నాటికి ఇది 20 లక్షల టన్నులకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్, రీసైక్లింగ్ వంటి పర్యావరణ అనుకూల విధానాలను అనుసరించే పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. హిప్లెక్స్–2026లో 550కుపైగా ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులు, ఆధునిక సాంకేతికతలను ప్రదర్శిస్తున్నారు. భారత్‌తో పాటు విదేశాల నుంచి 50 వేల మందికిపైగా వ్యాపార సందర్శకులు హాజరుకానున్నారు. గుజరాత్‌కు చెందిన 160 కంపెనీలు, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన 110 సంస్థలు, చైనాకు చెందిన సుమారు 40 కంపెనీలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. కార్యక్రమంలో టాప్మా అధ్యక్షుడు నరేంద్ర బద్వా, హిప్లెక్స్ కన్వీనర్ మీలా జయదేవ్, ఏఐపీఎంఏ ఉపాధ్యక్షుడు వెన్నం అనిల్‌రెడ్డి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన
- ●US Dollar | అమెరికా డాలర్ తన ప్రాభవాన్ని కోల్పోతుందా..? సింగపూర్ డాలర్ వైపు ఇన్వెస్టర్ల చూపులు..
- ●MLC L Ramana | అసెంబ్లీ సమావేశాలు కనీసం నెల రోజుల పాటు నిర్వహించండి
- ●Bhatti Vikramarka | ఉద్యోగులందరికీ రూ.కోటి బీమా పథకం అమలు చేస్తున్నం
- ●Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్సవానికి నేను రాను : రహదారి నిర్మాణం ఆలస్యంపై గడ్కరీ అసహనం
- ●S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు

NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన

US Dollar | అమెరికా డాలర్ తన ప్రాభవాన్ని కోల్పోతుందా..? సింగపూర్ డాలర్ వైపు ఇన్వెస్టర్ల చూపులు..

MLC L Ramana | అసెంబ్లీ సమావేశాలు కనీసం నెల రోజుల పాటు నిర్వహించండి

Bhatti Vikramarka | ఉద్యోగులందరికీ రూ.కోటి బీమా పథకం అమలు చేస్తున్నం




