త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | అధికారుల‌ను కాదు.. సీఎంను స‌స్పెండ్ చేయాలి

Harish Rao | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువే. సస్పెండ్ చేయాల్సింది అధికారులను కాదు.. ముఖ్యమంత్రిని, విద్యుత్ శాఖ మంత్రిని అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు( Harish Rao ) ధ్వ‌జ‌మెత్తారు.

S

Telangana | Published On Oct 22, 2026, 4.02 pm IST

Harish Rao | అధికారుల‌ను కాదు.. సీఎంను స‌స్పెండ్ చేయాలి
Advertisement

ఇది కాలం తెచ్చిన క‌రువు కాదు
ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన క‌రువే
పంట‌లు ఎండిపోయి రైతులు క‌న్నీరు పెడుతుంటే
రేవంత్ మాత్రం మొద్దు నిద్ర పోతున్నారు
కరోనా విప‌త్తులో కేసీఆర్ ర‌క్ష‌ణ క‌వ‌చంలా నిల‌బ‌డితే
ఎల్ నినో ఎఫెక్టులో రేవంత్ రైతుల‌ను శిక్షిస్తున్నారు
కాంగ్రెస్ స‌ర్కార్‌పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీశ్‌రావు

Harish Rao | త్రినేత్ర న్యూస్ : ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువే. సస్పెండ్ చేయాల్సింది అధికారులను కాదు.. ముఖ్యమంత్రిని, విద్యుత్ శాఖ మంత్రిని అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు( Harish Rao ) ధ్వ‌జ‌మెత్తారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు.. రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు కన్నీరు పెడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొద్దునిద్ర పోతున్నారు అని ఆయ‌న నిప్పులు చెరిగారు.

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బూరుగుపల్లి గ్రామంలో సాగునీరు, కరెంటు అందక ఎండిపోయిన వరి పంట పొలాలను హరీశ్ రావు గురువారం సందర్శించి పరిశీలించారు. చేతికొచ్చే దశలో ఎండిపోయిన పొలాలను చూపుతూ కన్నీరుమున్నీరైన బాధిత రైతులను ఆయన ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం రైతులతో కలిసి మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఘోర వైఫల్యం వల్ల వానాకాలంలోనే దాదాపు 12 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులంతా తీవ్ర ఆందోళనలో ఉంటే, ఈ ప్రభుత్వం మాత్రం మొద్దునిద్ర పోతోంది. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువే. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడతాయని 10 నెలల క్రితమే శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు హెచ్చరించినా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కరువు పరిస్థితులతో ఆదిలాబాద్, నల్లగొండ, మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఖమ్మం తదితర జిల్లాల్లో పత్తి రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాక కుదేలయ్యారు. ఎకరాకు 10 క్వింటాళ్లు రావాల్సిన పత్తి దిగుబడి నేడు 2, 3 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అని ధ్వ‌జ‌మెత్తారు.

ఈ పని ముందే చేసి ఉంటే పంటలు ఎండేవి కావు

పొరుగున ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం రైతులకు తక్షణ సాయంగా ఎకరాకు రూ. 5,000 విడుదల చేసింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. మరికొన్ని రాష్ట్రాలు తాగునీటి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం కలెక్టర్లకు నిధులు ఇచ్చాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు కరువు మండలాలు ప్రకటించలేదు, పైసా సాయం చేయలేదు. ఎల్‌నినో హెచ్చరికలు రాగానే ఇతర రాష్ట్రాలు 10 నెలల ముందే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుని, థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు సమకూర్చుకున్నాయి. కానీ రేవంత్ రెడ్డి 9 నెలల పాటు నిద్రపోయి, సమీక్షలు చేయకుండా, కోల్ ఇండియాతో మాట్లాడి బొగ్గు తేకుండా ఇప్పుడు రైతులు రోడ్డెక్కి సబ్ స్టేషన్లను ముట్టడిస్తుంటే కొందామన్నా కరెంటు దొరకడం లేదని బీద అరుపులు అరుస్తున్నారు. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అధికారులను సస్పెండ్ చేస్తానని ముఖ్యమంత్రి చిందులు వేస్తున్నారు. సకాలంలో ఆదేశాలు ఇవ్వని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న ఉపముఖ్యమంత్రిని ముందుగా సస్పెండ్ చేయాలి. సమస్య నెత్తిమీదకు వచ్చాక నిన్న యాదాద్రి ఐదో యూనిట్‌ను సింక్రనైజ్ చేశారు, ఈ పని ముందే చేసి ఉంటే పంటలు ఎండేవి కావు అని హ‌రీశ్‌రావు తెలిపారు.

ఉచిత డైలాగులు కొడుతూ ఎల్‌నినో పేరిట క్రాప్ హాలిడే

నాడు కరోనా విపత్తు వచ్చినప్పుడు కేసీఆర్ ప్రజలకు రక్షణ కవచంలా నిలబడితే.. నేడు ఎల్‌నినో వస్తే రేవంత్ రెడ్డి ప్రజలను శిక్షిస్తున్నారు. కరోనా సమయంలో కేసీఆర్ భయపడకుండా స్వయంగా గాంధీ ఆసుపత్రికి వెళ్లి పేషెంట్లను పరామర్శించి ధైర్యం చెప్పారు. యుద్ధ విమానాల్లో ఆక్సిజన్ తెప్పించారు. రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు సమకూర్చారు. లాక్‌డౌన్‌లో ప్రజలు ఇబ్బంది పడకూడదని కేసీఆర్ 87 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులకు రూ. 1,500 చొప్పున నగదు, మనిషికి 10 కిలోల ఉచిత బియ్యం, ప్రైవేట్ స్కూల్ టీచర్లకు రూ. 2,000 ఆర్థిక సాయం అందించారు. ప్రాణాలకు తెగించి పనిచేసిన డాక్టర్లు, పోలీసులకు 10 శాతం వేతనం, మున్సిపల్, గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు రూ. 1,000 జీతం పెంచి ప్రోత్సహించారు. కరోనా కష్టకాలంలోనూ రైతులకు నిరంతర కరెంటు, సాగునీరు ఇచ్చి, విశాఖపట్నం పోర్టులో స్పెషల్ ఆఫీసర్లను పెట్టి యూరియా తెప్పించి, బీహార్ నుంచి ప్రత్యేక రైళ్లలో హమాలీలను రప్పించి కేసీఆర్ కోటి టన్నుల పంట పండించారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం "పైసలు పెడితే నీళ్లు దొరుకుతాయా?" అంటూ ఉచిత డైలాగులు కొడుతూ ఎల్‌నినో పేరిట క్రాప్ హాలిడే ప్రకటించారు అని మండిప‌డ్డారు.

మళ్లీ పాత రోజులు తెచ్చి జనరేటర్లకు గిరాకీ పెంచారు

బూరుగుపల్లి గ్రామంలో అరవింద్ రెడ్డి అనే యువ రైతు తన 3 ఎకరాల పొలాన్ని కాపాడుకోవడానికి కరెంటు లేక రోజుకు రూ. 4,000 జనరేటర్ కిరాయి, రూ. 3,000 డీజిల్ కలిపి రోజుకు రూ. 7,000 చొప్పున మూడు రోజుల్లో రూ. 21,000 ఖర్చు పెట్టాడు. అయినా కరెంటు రాకపోవడంతో పెట్టుబడి తడిసిమోపెడవుతుందని పంటను వదిలేస్తే 2.5 ఎకరాలు ఎండిపోయి కేవలం అర ఎకరం మాత్రమే మిగిలింది. కేసీఆర్ పాలనలో దుకాణాల్లో ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, బావుల దగ్గర ఆయిల్ ఇంజన్లు, జనరేటర్లు మాయమైపోతే.. కాంగ్రెస్ మార్పు పాలనలో మళ్లీ పాత రోజులు తెచ్చి జనరేటర్లకు గిరాకీ పెంచారు. ఇదే బూరుగుపల్లిలో స్వామి అనే రైతు 3 ఎకరాలు నాటేస్తే 2 ఎకరాల 30 గుంటలు ఎండిపోయి 10 గుంటలే మిగిలింది. దయ్యాల యాదగిరి అనే రైతు 10 ఎకరాలు వేస్తే 9 ఎకరాలకు పైగా ఎండిపోయిందని కన్నీరు పెట్టుకున్నాడు. నరసింహులు అనే రైతు వేసిన ఒక్క ఎకరం పూర్తిగా ఎండిపోయింది. సత్యనారాయణ అనే మరో రైతు 6 ఎకరాలు నాటేస్తే 3 ఎకరాలు ఎండిపోయింది. లో-వోల్టేజీ, టూ ఫేజ్ కరెంటు వల్ల స్టార్టర్లలో పత్తులు కొట్టుకుంటూ రెండుసార్లు మోటార్లు, ఒకసారి ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయి రూ. 10 వేల చొప్పున నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడని మాజీ మంత్రి తెలిపారు.

రాజకీయ కక్షతోనే పంటలను ఎండబెడుతున్నారు

నాడు కేసీఆర్ హయాంలో హైదరాబాద్ హైటెక్ సిటీలో ఎంత నాణ్యమైన కరెంటు ఉండేదో, రైతుల బోర్ల దగ్గర కూడా అంతే నాణ్యమైన కరెంటు ఉండేది. బూరుగుపల్లి పరిసరాల్లోనే వందలాది ఎకరాలు పొట్ట దశకు వచ్చి, మరో 20 రోజుల్లో కోతకు వచ్చే సమయంలో నీళ్లు లేక కరెంటు లేక నోటికాడి బుక్క మట్టిపాలవుతోంది. కేసీఆర్ ఉన్న ఐదేళ్లలో యాసంగి, వానాకాలాల్లో బంగారంలా పంటలు పండాయని, వానాకాలంలో నీళ్లు లేకపోవడం ఇదే మొదటిసారని రైతులు వాపోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మోటార్లు ఆన్ చేసి నీళ్లు నింపుకోవచ్చని, తమకు సంబంధం లేదని ఎన్డీఎస్ఏ హైకోర్టులో స్పష్టంగా అఫిడవిట్ వేసింది. కానీ కన్నెపల్లి పంపులు ఆన్ చేసి మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ నింపితే కేసీఆర్‌కు పేరు వస్తుందని, తమ అబద్ధాలు బయటపడతాయనే రాజకీయ కక్షతోనే రేవంత్ రెడ్డి నీళ్లు ఎత్తకుండా గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట, మెదక్, రామాయంపేట, భువనగిరి, యాదాద్రి ప్రాంతాల్లో పంటలను ఎండబెడుతున్నారు అని పేర్కొన్నారు.

ఉన్న నీళ్లను ఎత్తడం కూడా ఈ దద్దమ్మ ప్రభుత్వానికి చేతకావడం లేదు

కాళేశ్వరం రెండో టీఎంసీ పనులను మూడేళ్లుగా ఆపేశారు. ఆ పనులు పూర్తి చేసి ఉంటే మల్లన్న సాగర్‌లోకి రోజుకు 2 టీఎంసీల నీళ్లు వచ్చేవి, హైదరాబాద్ తాగునీటికి, మూసీకి కూడా నీళ్లు అందేవి. దేవాదుల ప్రాజెక్టు వద్ద కేసీఆర్ కట్టిన సమ్మక్క బ్యారేజీలో గోదావరి నీళ్లు అందుబాటులో ఉన్నా.. 10 మోటార్లకు గాను 7, 8 మోటార్లను మాత్రమే నడుపుతూ, 24 గంటలకు బదులు 8 గంటలే నడిపి 16 గంటలు బంద్ పెడుతూ వరంగల్ జిల్లాలో కృత్రిమ కరువు సృష్టించారు. నీళ్ల కోసం ముఖాన్ని మొగులుకు పెట్టి చూడాల్సిన పనిలేదు, కట్కొత్తుతే చాలు రెండు పంటలు పండాలి అని కేసీఆర్ ప్రాజెక్టులు కడితే, ఉన్న నీళ్లను ఎత్తడం కూడా ఈ దద్దమ్మ ప్రభుత్వానికి చేతకావడం లేదు. ముఖ్యమంత్రి సొంత జిల్లా పాలమూరులో కల్వకుర్తి కింద శ్రీశైలంలో నీళ్లు ఉన్నా, 24 గంటలు మోటార్లు నడిపి 35 టీఎంసీలు ఎత్తాల్సిన చోట కేవలం 8 గంటలే నడిపి 13 టీఎంసీలు మాత్రమే ఎత్తారు. నాడు 30 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో 13 వేల ఎకరాలకే నీళ్లిస్తే, కేసీఆర్ వేల కోట్లు ఖర్చుపెట్టి 7 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చారు. నేడు పాలమూరు కరువుకు ఎల్‌నినో కారణం కాదు, రేవంత్ రెడ్డి పరిపాలనా వైఫల్యమే కారణం అని దుయ్య‌బ‌ట్టారు.

ఆర్టీసీలో భార్యకు ఫ్రీ అని భర్తకు డబుల్ టికెట్

రేవంత్ రెడ్డి గోదావరిలో, కృష్ణాలో నీళ్లు ఎత్తకుండా వదిలేస్తే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం ఒడిసిపట్టుకుని నీళ్లను తరలించుకుపోయారు. అందుకే ఏపీలో పంటలు ఎండలేదు, రేవంత్ రెడ్డి వైఫల్యం ఏపీకి వరంగా మారింది. కరోనా కష్టకాలంలో ప్రజలపై భారం పడకూడదని కేసీఆర్ కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలు పెంచే ప్రతిపాదనలను తిరస్కరించారు. కానీ రేవంత్ రెడ్డి ఈ కరువు కాలంలో పేద, మధ్యతరగతి ప్రజలపై రూ. 5,420 కోట్ల కరెంటు చార్జీల భారం మోపారు, ఆర్టీసీలో భార్యకు ఫ్రీ అని భర్తకు డబుల్ టికెట్ కొడుతూ చార్జీలు పెంచేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. మంచినూనె రూ. 220, పప్పులు రూ. 160, ఉల్లిగడ్డ రూ. 70, ఎల్లిగడ్డ రూ. 200కి చేరింది. దేశానికే ధాన్యాగారమైన తెలంగాణలో బ్లాక్ మార్కెట్‌ను అరికట్టలేక, గోదాముల్లోని నిల్వలను బయటకు తేలేక బియ్యం ధరను కిలో రూ. 90 కి పెంచిన ఘనత ఈ ప్రభుత్వానిదే అని హ‌రీశ్‌రావు అన్నారు.

12 లక్షల ఎకరాల పంటలకు నష్టపరిహారం అందించాలి

పంటలు ఎండిపోయి పని దొరకక అల్లాడుతున్న దళిత, గిరిజన, బలహీన వర్గాల వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ. 12,000 ఇస్తామని రెండు బడ్జెట్లలో పెట్టి, అసెంబ్లీలో ఆమోదించినా ఇంతవరకు ఒక్క రూపాయి విడుదల చేయలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఈ 20-30 రోజుల పాటు మల్లన్న సాగర్ నుంచి నీళ్లు వదిలి, 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తే రాష్ట్రంలో మిగిలిన 10 నుంచి 20 లక్షల ఎకరాల పంటనైనా కాపాడుకోవచ్చు. కన్నెపల్లి, దేవాదుల, కల్వకుర్తి మోటార్లను తక్షణమే 24 గంటలూ నడిపించాలి. రాష్ట్రంలో తక్షణమే కరువు మండలాలను ప్రకటించి, ఎండిపోయిన 12 లక్షల ఎకరాల పంటలకు నష్టపరిహారం అందించాలి. రైతు కూలీలకు వెంటనే రూ. 12,000 విడుదల చేయాలి. తాగునీటి ఎద్దడి నివారణకు కలెక్టర్లకు నిధులు ఇచ్చి ఎమ్మెల్యేలు, సర్పంచులు, కౌన్సిలర్లను భాగస్వాములను చేయాలి. ప్రజలపై మోపిన రూ. 5,420 కోట్ల విద్యుత్ భారాన్ని, పెంచిన బస్సు చార్జీలను తక్షణమే ఉపసంహరించుకుని, నిత్యావసరాల ధరలను నియంత్రించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామ‌ని హ‌రీశ్‌రావు తెలిపారు.

Advertisement
Advertisement