త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TSUTF | ఆలు లేదు చూలు లేదు.. ముందే ఈహెచ్ఎస్ కటింగ్ మొదలు! ఆర్థిక శాఖ అత్యుత్సాహంపై టీఎస్ యుటీఎఫ్ ఫైర్

మార్గదర్శకాలు రాకుండానే, కనీసం జీవో (GO) ఇవ్వకుండానే మే నెల జీతాల్లో 1.5% ఈహెచ్ఎస్ కటింగ్ చేయడంపై టీఎస్ యుటిఎఫ్ (TS UTF) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

J

Telangana | Published On May 31, 2026, 7.57 pm IST

TSUTF | ఆలు లేదు చూలు లేదు.. ముందే ఈహెచ్ఎస్ కటింగ్ మొదలు! ఆర్థిక శాఖ అత్యుత్సాహంపై టీఎస్ యుటీఎఫ్ ఫైర్
Advertisement

TSUTF | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం (Employees Health Scheme - EHS) అమలు వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. పథకానికి సంబంధించిన ఎలాంటి విధివిధానాలు (Guidelines) ఖరారు కాకుండానే, ఆర్థిక శాఖ అత్యుత్సాహంతో మే నెల వేతనాల్లో ఏకంగా 1.5 శాతం కోత విధించడాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TS UTF) తీవ్రంగా ఖండించింది. కనీస సమాచారం, జీవో (GO) లేకుండా జీతాలు ఎలా కట్ చేస్తారని ఆర్థిక శాఖ అధికారులను సూటిగా ప్రశ్నించింది.

హాస్పిటల్స్ తో డీల్ లేదు.. డిజిటల్ కార్డుల్లేవు

ఆరోగ్య పథకం అమలుపై ఇంకా చాలా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటివరకు ఏయే హాస్పిటల్స్ తో ఒప్పందం కుదిరింది? ప్యాకేజీ రేట్లు (Package rates) ఎలా ఉండబోతున్నాయి? అనే అంశాలపై క్లారిటీ లేదు. కనీసం ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డులు (Digital Health Cards) కూడా ఇవ్వలేదు. ఈహెచ్ఎస్ కోసం జీతంలో 1.5% చందా మినహాయించేలా అధికారికంగా ఎలాంటి జీవో కూడా రాలేదు. విధివిధానాల గురించి అడిగితే ఆరోగ్య శాఖ చెబుతుందని దాటవేస్తున్న ఆర్థిక శాఖ అధికారులు.. ఆ విధివిధానాలు లేకుండానే జీతాల్లో కోత ఎలా పెడతారని టీఎస్ యుటిఎఫ్ నేతలు మండిపడ్డారు.

వెబ్‌సైట్ అప్‌డేట్స్‌లోనే గందరగోళం

ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలను ఐఎఫ్ఎంఐఎస్ (IFMIS) వెబ్‌సైట్‌లో నమోదు చేయడానికి ఈ రోజు వరకే గడువు విధించారు. కానీ, నిన్నటి వరకు ఆ సైట్‌లో మార్పులు (Modifications) చేస్తూనే ఉన్నారు. దీనివల్ల చాలా మంది వివరాలు ఇంకా పూర్తిగా నమోదు కాలేదు. పైగా పాత నిబంధనల ప్రకారం.. భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే ఎవరో ఒక్కరు చందా చెల్లిస్తే సరిపోతుంది. కానీ, ఇప్పుడు ఇద్దరి జీతాల నుంచీ కోత విధించారు. ఆధారిత కుటుంబ సభ్యుల (Dependents) విషయంలో కూడా ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.

ప్రభుత్వం అభాసుపాలు కాకముందే.. సీఎం జోక్యం చేసుకోవాలి

వాస్తవానికి ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య సంరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వైద్యం ఖరీదైన దృష్ట్యా కొంత భరించాలని ప్రభుత్వం కోరినప్పుడు సంఘాలు సానుకూలంగానే స్పందించాయి. కానీ, ఇలాంటి హడావుడి నిర్ణయాలతో 1.5% కోత విధించడం పట్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాల్సిన సమయంలో, ఇలాంటి ఏకపక్ష నిర్ణయాల వల్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి (ఆర్థిక మంత్రి) వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని వేతనాల్లో కోతలను తక్షణం నిలిపివేయాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఏ. వెంకట్ డిమాండ్ చేశారు. ఆర్థిక శాఖ తీసుకుంటున్న ఏకపక్ష, నియంతృత్వ నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందని వారు హెచ్చరించారు.

Advertisement
Advertisement