త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samakhya Global Business Summit 2026 | ఉద్యోగాలు చేయడం కాదు.. కంపెనీలు పెట్టే స్థాయికి ఎదగాలి

తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మార్చేందుకు సీఎం రేవంత్ 'CURE, PURE, RARE' ప్లాన్ ప్రకటించారు. పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన భరోసా ఏంటో తెలుసా?

J

Telangana | Published On Oct 14, 2026, 6.20 pm IST

Samakhya Global Business Summit 2026 | ఉద్యోగాలు చేయడం కాదు.. కంపెనీలు పెట్టే స్థాయికి ఎదగాలి

సంక్షిప్త సారాంశం

హైదరాబాద్ హైటెక్స్‌లో 'సమాఖ్య గ్లోబల్ బిజినెస్ సమ్మిట్-2026'ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు రాష్ట్రాన్ని CURE, PURE, RARE అనే మూడు ఆర్థిక జోన్లుగా విభజించినట్లు వెల్లడి. హైదరాబాద్ ఓఆర్ఆర్ (ORR) లోపల ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను బయటకు తరలించేందుకు రాయితీలతో కూడిన 'హిల్ట్ (HILT) పాలసీ' అమలు. ఎన్నికలప్పుడే రాజకీయాలు తప్ప అభివృద్ధిలో కాదని స్పష్టం చేస్తూ.. యువత, మహిళా పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని హామీ.

Advertisement
  • తెలంగాణ అభివృద్ధికి సీఎం రేవంత్ 'CURE, PURE, RARE' మాస్టర్ ప్లాన్
  • ఎన్నికలప్పుడే రాజకీయాలు.. అభివృద్ధి విషయంలో కాదన్న ముఖ్యమంత్రి
  • 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణ
  • దేశ జీడీపీలో 10% వాటా లక్ష్యం
  • ఓఆర్ఆర్ బయటకు కాలుష్య పరిశ్రమలు
  • 'హిల్ట్ పాలసీ'తో పారిశ్రామికవేత్తలకు రాయితీలు
  • మహిళలకు రూ. 61 వేల కోట్ల రుణాలు
  • యువత, మహిళా ఎంటర్‌ప్రెన్యూర్లకు ప్రభుత్వ భరోసా
  • హైటెక్స్‌లో ఘనంగా 'సమాఖ్య గ్లోబల్ బిజినెస్ సమ్మిట్-2026' ప్రారంభం

Samakhya Global Business Summit 2026 | త్రినేత్ర న్యూస్ : ప్రపంచ ప్రఖ్యాత కార్పొరేట్ కంపెనీల్లో మనవాళ్లు ఉన్నత ఉద్యోగాలు చేస్తూ సర్వీస్ అందించడం వరకే పరిమితం కాకూడదని, సొంతంగా స్టార్టప్‌లు స్థాపించి గ్లోబల్ స్థాయిలో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా, తిరుగులేని 'ఇండస్ట్రీ హబ్'గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఇందుకోసం రాష్ట్రాన్ని మూడు ఆర్థిక విభాగాలుగా (CURE, PURE, RARE) విభజించి అభివృద్ధి చేస్తున్నామని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే యువతకు, మహిళలకు ప్రభుత్వం పూర్తి భరోసాగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

ఎన్నికలప్పుడే రాజకీయాలు.. వికసిత్ భారత్‌కు సహకారం

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 'సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్' ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల 'గ్లోబల్ బిజినెస్ సమ్మిట్-2026'ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలు అనేవి కేవలం ఎన్నికలప్పుడే ఉండాలని, అభివృద్ధి విషయంలో కాదని స్పష్టం చేశారు.

2047 నాటికి స్వతంత్ర భారతం వందేళ్లు పూర్తి చేసుకోబోతోందని, భారత్‌ను 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రధాని మోదీ 'వికసిత్ భారత్-2047' లక్ష్యానికి రాష్ట్రాల సహకారం ఎంతో అవసరమని అన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టమైన కార్యాచరణతో ముందుకు రావాలని కోరారు. ప్రస్తుతం దేశ జీడీపీలో (GDP) తెలంగాణ వాటా 5 శాతంగా ఉందని, దీన్ని 10 శాతానికి పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

తెలంగాణ రూపురేఖలు మార్చే 'CURE - PURE - RARE' ఫార్ములా ఇదే

రాష్ట్రాన్ని 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మార్చేందుకే 2025లో 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్ డాక్యుమెంట్‌ను తీసుకొచ్చామని సీఎం గుర్తుచేశారు. భౌగోళిక పరిస్థితులు, వనరుల ఆధారంగా రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.

CURE (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ): ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లోపల ఉన్న సుమారు 2,100 చ.కి.మీ పరిధిలోని 1.34 కోట్ల జనాభా అవసరాలకు అనుగుణంగా ఈ జోన్‌ను గుర్తించారు. ఇక్కడ కేవలం ఐటీ, సర్వీస్ సెక్టార్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. నగరంలోని కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించేందుకు రాయితీలు, అనుమతులతో కూడిన 'హిల్ట్ (HILT) పాలసీ'ని ప్రభుత్వం తీసుకొచ్చింది.

PURE (పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ): ఓఆర్ఆర్ వెలుపల 50 కి.మీ పరిధిలో 360 కి.మీ మేర రీజినల్ రింగ్ రోడ్డు (RRR) రూపుదిద్దుకుంటోంది. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్యనున్న 10,500 చ.కి.మీ ప్రాంతాన్ని 'ప్యూర్' జోన్‌గా మార్చి మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా అభివృద్ధి చేస్తారు. ఇక్కడ పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్స్, కొత్త స్టార్టప్‌ల ఏర్పాటుకు యువ పారిశ్రామికవేత్తలకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి.

RARE (రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ): రీజినల్ రింగ్ రోడ్డు నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్న సుమారు లక్ష చ.కి.మీ ప్రాంతాన్ని 'రేర్' జోన్‌గా అభివృద్ధి చేస్తారు. ఇక్కడ వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయాధారిత పరిశ్రమలు, గ్రామీణ ఉపాధికి పెద్దపీట వేస్తారు.

చార్మినార్ నుంచి హైటెక్ సిటీ వరకు..

400 ఏళ్ల క్రితమే దేశ, విదేశీ వ్యాపారులకు చార్మినార్ ఒక ల్యాండ్‌మార్క్‌గా నిలిస్తే, ఆ తర్వాత కాలంలో బిజినెస్‌కు హైటెక్ సిటీ ల్యాండ్‌మార్క్‌గా మారిందని సీఎం అన్నారు. మెరుగైన రవాణాతో హైదరాబాద్ నాలెడ్జ్ హబ్‌గా ఎదిగిందని, ప్రపంచంలోని దిగ్గజ నగరాలతో పోటీపడే స్థాయికి హైదరాబాద్‌ను తీసుకెళ్లడమే తమ ఆకాంక్ష అని తెలిపారు.

మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్దపీట

ప్రపంచవ్యాప్తంగా మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉన్న దేశాలే ఆర్థికంగా బలపడ్డాయని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణలో మహిళలకు రూ. 61 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని.. ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లకు మహిళలను ఓనర్లుగా మార్చామని చెప్పారు. యువతతో పాటు మహిళలను పారిశ్రామిక రంగంలో ప్రోత్సహించాలని సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్‌కు సూచించారు.

కాపు ప్రముఖుల సక్సెస్ స్టోరీలు భవిష్యత్ తరాలకు అందించాలి

ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కొత్త చట్టాలు, మార్పులపై యువతకు అవగాహన కల్పించడంలో సమాఖ్యలు కీలక పాత్ర పోషిస్తాయని సీఎం అభినందించారు. పారిశ్రామిక, రాజకీయ, న్యాయ, సినీ రంగాల్లో కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు సాధించిన విజయాలను, వారి సక్సెస్ స్టోరీలను రికార్డు చేసి కొత్త తరానికి స్ఫూర్తిగా అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కె. రఘురామకృష్ణరాజు, ఎంపీలు డాక్టర్ కె. లక్ష్మణ్, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, దానం నాగేందర్, మున్నూరు కాపు ఫౌండేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి, జస్టిస్ భవానీ ప్రసాద్, కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement