త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు ప‌ర్యాయ‌ప‌దంగా తెలంగాణ : సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy | హైదరాబాద్‌లోని ఐసీసీసీలో ‘స్పందన టీమ్స్’ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు, పిల్లల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే షీ టీమ్స్‌తో పాటు ఇప్పుడు 24 గంటల స్పందన టీమ్స్ ద్వారా తక్షణ సహాయం అందించనున్నట్లు తెలిపారు. మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన, డ్రగ్స్ నియంత్రణపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని సీఎం పేర్కొన్నారు.

P

Telangana | Published On Apr 27, 2026, 6.43 pm IST

CM Revanth Reddy | మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు ప‌ర్యాయ‌ప‌దంగా తెలంగాణ : సీఎం రేవంత్‌రెడ్డి
Advertisement

CM Revanth Reddy | తెలంగాణను మహిళల భద్రతకు పర్యాయపదంగా తీర్చిదిద్దడమే త‌మ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఐసీసీసీ (ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్)లో ‘స్పందన టీమ్స్’ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌తో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ‘స్పందన’ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ప‌దవులు ఇచ్చిన ఘ‌న‌త కాంగ్రెస్‌ది..

సీఎం మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. అలాంటి దేశాల్లోనే అభివృద్ధి వేగంగా జ‌రుగుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత‌నే భార‌త్‌లో మ‌హిళ‌ల‌కు ఓటు హ‌క్కు క‌ల్పించిన‌ట్లు గుర్తు చేశారు. అమెరికాలో మహిళలకు ఆ హక్కు రావడానికి చాలా కాలం పట్టిందని పేర్కొన్నారు. మాజీ ప్రధాని నెహ్రూ మహిళలకు సమాన హక్కులు కల్పించారని, వివిధ ఉన్నత పదవుల్లో మహిళలకు అవకాశాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్‌దని సీఎం తెలిపారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, విద్యా–ఉద్యోగాల్లో అవకాశాల ద్వారా మహిళా సాధికారతకు పార్టీ కృషి చేసిందని చెప్పారు.

24గంట‌లు అందుబాటులో ఉండేలా స్పంద‌న టీమ్స్‌

రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ఇప్పటికే షీ టీమ్స్ ఏర్పాటు చేశామని, ఇప్పుడు మరింత ముందడుగుగా 24 గంటల అందుబాటులో ఉండే ‘స్పందన’ టీమ్స్ ప్రారంభించామని చెప్పారు. సమస్య వచ్చిన వెంటనే బాధిత మహిళలకు మానసిక భరోసా ఇవ్వడమే లక్ష్యమని స్పష్టం చేశారు. సమస్య వచ్చిన తర్వాత పరిష్కారం కాకుండా, అసలు సమస్యే రాకుండా చూడాల్సిన బాధ్యత సమాజంపై ఉందని సీఎం అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మహిళల పేరుతోనే ఇస్తున్నామని, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.

ట్రిలియ‌న్ డాల‌ర్ల శ‌క్తిగా..

స్వయం సహాయక సంఘాల ద్వారా 67 లక్షల మంది మహిళలకు రూ.60 వేల కోట్ల రుణాలు ఇచ్చామని, ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టామని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు రూ.10 వేల కోట్ల వరకు ఆదా అయినట్లు తెలిపారు. మహిళా సంఘాలతో బస్సుల నిర్వహణ, సోలార్ ప్రాజెక్టులు, క్యాంటీన్లు, పాఠశాల నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. హైటెక్ సిటీలో మహిళా శక్తి స్టాల్స్ ఏర్పాటు చేసి, వారి ఉత్పత్తులకు మార్కెట్ కల్పించినట్లు తెలిపారు. 2034 నాటికి రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, దానికి మహిళల భద్రత కీలకమని సీఎం పేర్కొన్నారు.

డ్ర‌గ్స్‌పై ఉక్కుపాదం..

డ్రగ్స్ సమస్యపై సీఎం తీవ్రంగా స్పందిస్తూ కఠిన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈగల్ ఫోర్స్ ద్వారా డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని, ఎంత పెద్దవారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్, గంజాయి, మద్యం వ్యసనాలపై పీస్ కమిటీల పాత్ర పెంచాలని సీఎం సూచించారు. పాఠశాలల్లో అడ్మిషన్ సమయంలో డ్రగ్స్ వినియోగించమని సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకునే ఆలోచనను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పునరావాస కేంద్రాలను పెంచుతున్నామని వెల్లడించారు.

Advertisement
Advertisement