త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | SIRపై అప్రమత్తంగా ఉండండి.. 18 ఏళ్లు నిండిన ప్ర‌తి ఒక్క‌రూ ఓటు ఎన్‌రోల్ చేసుకోవాలి : కేటీఆర్

KTR | 18 సంవ‌త్స‌రాలు నిండిన ప్ర‌తి ఒక్క‌రూ ఓటు ఎన్‌రోల్‌మెంట్ చేసుకోవాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. అంబేద్క‌ర్ మ‌నంద‌రికి ఓటు హ‌క్కు క‌ల్పించార‌ని, ఓటు అనేది ప్ర‌తి ఒక్క‌రి హ‌క్కు అని ఆయ‌న పేర్కొన్నారు. SIRపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

S

Telangana | Published On May 31, 2026, 4.26 pm IST

KTR | SIRపై అప్రమత్తంగా ఉండండి.. 18 ఏళ్లు నిండిన ప్ర‌తి ఒక్క‌రూ ఓటు ఎన్‌రోల్ చేసుకోవాలి : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : 18 సంవ‌త్స‌రాలు నిండిన ప్ర‌తి ఒక్క‌రూ ఓటు ఎన్‌రోల్‌మెంట్ చేసుకోవాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. అంబేద్క‌ర్ మ‌నంద‌రికి ఓటు హ‌క్కు క‌ల్పించార‌ని, ఓటు అనేది ప్ర‌తి ఒక్క‌రి హ‌క్కు అని ఆయ‌న పేర్కొన్నారు. SIRపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 2025 ఓటరు లిస్ట్ ప్రకారం మొత్తం 3.39 కోట్ల ఓట్లు ఉన్నాయని తెలిపారు.

కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యేలు సాయన్న, లాస్య నందిత చిత్రపటాలకు నివాళులర్పించారు.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 1948-51 మధ్య అంబేద్కర్ నాయకత్వంలో రాజ్యాంగంపై కమిటీ వేశారు. ఏ వర్గమైనా మనిషికి ఒక ఓటు హక్కు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. 1951-52లో మొదటిసారి దేశంలో ఎన్నికలు జరిగాయి. జూన్ 25 నుంచి ప్రారంభమయ్యే సర్ గురించి అవగాహన కల్పించుకోవాలి. సర్ అంటే ఓటరు లిస్ట్‌ను జల్లెడ పట్టే కార్యక్రం. 18 ఏళ్లు నిండివారి ఓట్లు చేర్పించాలి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లిన వారి ఓట్లు మార్పించడం, రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఓట్లు ఉంటే ఒకటే నమోదు చేయించాలి. బూత్ లెవల్ ఆఫీసర్ 2002 ఓటరు లిస్ట్, ప్రస్తుత ఓటరు లిస్ట్‌ను పోల్చుకుంటారని తెలిపారు.

ఎన్నికలు ఇప్పుడు జరిగినా వాటికి సిద్ధంగా ఉండాలి..

18 ఏళ్లు నిండిన వారి పేర్లను విధిగా నమోదు చేయించాలి. ఎవరైనా చనిపోతే వారి ఓటును తొలగించాల్సి ఉంటుంది. ముసాయిదాలో అబ్జెక్షన్లను నమోదు చేసి, ఫైనల్ ఓటరు లిస్ట్‌ను ప్రకటిస్తారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ఒకటే ఓటరు లిస్ట్ ఉంటుంది. డిఫెన్స్ ల్యాండ్‌లో ఉన్న 35 వేల మందికి ఓటు కల్పించే బాధ్యత తీసుకోవాలి. అధికారులు వినకపోతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వద్దకు వెళ్లి పోరాడుదాం. ఎన్నికలు ఇప్పుడు జరిగినా వాటికి సిద్ధంగా ఉండాలి. గులాబీ కండువా కప్పుకున్న సైనికులు ఎన్నికల నాటికి హైరానా పడకుండా చూసుకోవాలన్నారు.

ఓటరు లిస్ట్‌ను కరెక్టుగా జల్లెడ పడితే..

ఓటరు లిస్ట్‌ను కరెక్టుగా జల్లెడ పడితే హైరానా పడాల్సిన అవసరం ఉండదు. జూన్ 25వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు ఇంటింటి వెరిఫికేషన్ జరుగుతుంది. వారం తర్వాత డ్రాఫ్ట్ ఓటరు లిస్ట్ ప్రకటిస్తారు. జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. నెల రోజుల పాటు వచ్చిన అభ్యంతరాలను స్క్రూట్నీ చేసి ఫైనల్ లిస్ట్‌ను ప్రకటిస్తారు. 2026 అక్టోబర్ 1వ తేదీన ఫైనల్ లిస్ట్‌ను ప్రకటిస్తారని తెలిపారు.

అందుకే జాగ్రత్తగా ఉండాలి..

పోలింగ్ బూత్‌కు ఇద్దరి చొప్పున బూత్ లెవల్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాం. బీఎల్‌వో వెంట ఇంటింటికీ వెళ్లి ఓట్లను పరిశీలించాలి. సరిగ్గా ఫామ్ నింపుతున్నారా లేదా పరిశీలించాలి. తప్పుడు ఓట్లను తొలగించాలని.. అర్హుల ఓట్లను నమోదు చేయించాలి. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలకు ముందు 95 లక్షల ఓట్లు తొలగించారు. బెంగాల్‌లో 25 లక్షల మంది కోర్టులో కొట్లాడుతున్నారు. బిహార్‌లో 65లక్షల ఓట్లు తొలగించారు. గెలుపు, ఓటములకు ఈ ఓట్లే కారణం కావచ్చు.. అందుకే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

మైనార్టీల ఒక్క ఓటు కూడా పోకుండా చూడాలి..

మైనార్టీల్లో ఓట్లు పోతాయేమోనన్న భయం ఉంది. అర్హులైన మైనార్టీల ఒక్క ఓటు కూడా పోకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఏపీ, తెలంగాణలో రెండు వేర్వేరు ఓట్లు ఉండొచ్చు. డూప్లికేట్ ఓటర్ల లిస్ట్‌ను మీకు అప్పగిస్తాం.. వాటిని గుర్తుపెట్టుకోవాలి. జూబ్లీహిల్స్‌లో దొంగ ఓట్లు నమోదు చేయించుకోవడం వల్లనే ఓడిపోయాం. మనిషికి ఒకే ఓటు ఉండేలా అప్రమత్తతగా ఉంటూ ఏజెంట్లు పనిచేయాలి. ప్రతి ఓటు విలువైనదే అని.. బూత్‌లోని ఓటు రక్షించుకోవడం బాధ్యత. కేసీఆర్ సీఎం కావాలనే బలమైన అంకితభావం ఉంటే.. గెలుపును ఎవరూ ఆపలేరు. ప్రతి బూత్ పరిధిలో అర్హులైన వారి ఓట్లు కాపాడుకోవాలి. 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం తథ్యం. నిఖార్సయిన కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకెళ్దామని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement