KCR | హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం గంటన్నర పాటు కొనసాగింది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7.20 గంటల వరకు కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యాన్ని, తప్పిదాలను, ప్రజలను మోసం చేస్తున్న తీరుపై కేసీఆర్ ధ్వజమెత్తారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందాలతో ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలచుకున్నారని కేసీఆర్ నిలదీశారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సాగు, తాగునీటి కష్టాలను తీరుస్తుందని, ఈ ప్రాజెక్టు విషయంలో ముందుండి పోరాడుతాం. త్వరలోనే మూడు జిల్లాల్లో బహిరంగ సభలు పెట్టి రైతులను చైతన్యవంతులను చేస్తాం అని కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ప్రజలు గోల్ మాల్ అయిపోయారు.. ఓట్లేసి గెలిపించిన ప్రజలే ఇవాళ భయంకరమైన తిట్లు తిడుతున్నారు. మళ్లీ బీఆర్ఎస్ రావాలి అని అంటున్నరు. అది దేనికి సంకేతం.. మీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు.. మీ పిచ్చి పనుల వల్ల. మీరు చేసే చర్యలు ఎట్ల ఉన్నయ్.. రియల్ ఎస్టేట్ మొత్తం బ్రోకర్ దందానే. ఫార్మా సిటీని పక్కన పెట్టి ఫ్యూచర్ సిటీ అంటున్నరు.. ఎవరికి కావాలి ఫ్యూచర్ సిటీ..? దానిపేరుతో రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేస్తున్నారంటూ కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణను తెచ్చిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా రైతులకు, ఈ రాష్ట్ర ప్రజానీకానికి అండగా ఉంటాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తోకలు కట్ చేస్తాం.. భయపడే ప్రసక్తే లేదు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది.. ప్రజలకు 420 హామీలు ఇచ్చి మోసం చేశారు. ఏ ఒక్క వర్గానికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు.. ఉన్న పథకాలను కూడా అమలు చేయడం లేదని కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ఎత్తిపోతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిద్రపోనివ్వం. మా హక్కుల పరిరక్షణకు ఒక్క డ్రాప్ తక్కువైనా కూడా పోరాడుతాం. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. అధికార పార్టీ ఏం ఒర్రినా, ఏం మొత్తుకున్నా.. తెలంగాణ ప్రజలకు అండగా ఉంటాం. ఇక నుంచి అందరికీ అందుబాటులో ఉంటాను అని కేసీఆర్ పేర్కొన్నారు.