త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TS CPS Employees Union | రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగులకు ఉచిత వైద్యం ఇవ్వాల్సిందే.. 1.5 శాతం వసూలు అసాధ్యం: యూనియన్ నేత స్థితప్రజ్ఞ

తెలంగాణలో రిటైర్డ్ సీపీఎస్ (CPS) ఉద్యోగుల ఆరోగ్య భద్రతపై గందరగోళం నెలకొంది. పెన్షన్ నుంచి 1.5 శాతం చందా వసూలు చేయడం సాంకేతికంగా కుదరదని, ప్రభుత్వం ఉచితంగానే హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. సచివాలయంలో వారు అధికారులకు వినతిపత్రం అందజేశారు.

J

Telangana | Published On Feb 18, 2026, 10.00 pm IST

TS CPS Employees Union | రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగులకు ఉచిత వైద్యం ఇవ్వాల్సిందే.. 1.5 శాతం వసూలు అసాధ్యం: యూనియన్ నేత స్థితప్రజ్ఞ
Advertisement

TS CPS Employees Union | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని 2.5 లక్షల మంది సీపీఎస్ (CPS) ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత (EHS) విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ (TSCPSEU) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్‌లు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ఫైనాన్స్) రామకృష్ణ రావును కలిసి వినతిపత్రం సమర్పించారు.

1.5 శాతం చందా వసూలు సాధ్యం కాదు.. ఎందుకంటే?

ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) బలోపేతం కోసం ఉద్యోగులు, పెన్షనర్ల మూల వేతనం నుంచి 1.5 శాతం చందా వసూలు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదన సీపీఎస్ ఉద్యోగుల విషయంలో ఆచరణ సాధ్యం కాదని యూనియన్ నేతలు స్పష్టం చేశారు. దీనిపై స్థితప్రజ్ఞ మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.

OPS vs CPS తేడా: ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS) పెన్షనర్లకు ప్రభుత్వం నేరుగా ట్రెజరీ (IFMIS) ద్వారా పెన్షన్ చెల్లిస్తుంది. కాబట్టి వారి నుంచి 1.5 శాతం మినహాయించడం సులభం.

సాంకేతిక సమస్య: కానీ, 01.09.2004 తర్వాత చేరిన CPS ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి పెన్షన్ రాదు. వీరి పెన్షన్ (Annuity) అనేది షేర్ మార్కెట్ విలువ (NAV) ఆధారంగా PFRDA నియమించిన ప్రైవేట్ ఏజెన్సీల (ASP) నుంచి వస్తుంది. కాబట్టి, ప్రైవేట్ ఏజెన్సీలు ఇచ్చే పెన్షన్ నుంచి ప్రభుత్వం నేరుగా డబ్బులు కట్ చేయడం సాంకేతికంగా అసాధ్యం.

ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలి

రిటైర్ అయిన సీపీఎస్ ఉద్యోగులకు వచ్చేది స్థిరమైన పెన్షన్ కాదని, మార్కెట్ ఒడిదుడుకులపై ఆధారపడి వచ్చే ఆ అరకొర పెన్షన్‌తో ప్రీమియంలు కట్టలేరని యూనియన్ ఆవేదన వ్యక్తం చేసింది. వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సామాజిక భద్రత (Social Security) లేనందున, ప్రాథమిక బాధ్యతగా ప్రభుత్వమే ఉచిత ఆరోగ్య బీమా (Free Health Insurance) సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వృద్ధాప్యంలో ఆసుపత్రి ఖర్చుల కోసం వారు అప్పుల పాలవకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

యూనియన్ ప్రధాన డిమాండ్లు

రిటైర్డ్ CPS ఉద్యోగుల నుంచి 1.5 శాతం చందా వసూలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి లేదా స్పష్టమైన విధివిధానాలు ప్రకటించాలి. CPS రిటైర్డ్ ఉద్యోగులందరికీ ఉచితంగా హెల్త్ కార్డులు వర్తింపజేయాలి. ఉద్యోగికి ఆప్షన్ (Option) ఎంచుకునే అవకాశం ఇవ్వాలి. EHS ట్రస్ట్‌లో సీపీఎస్ యూనియన్ నుంచి ఒక సభ్యుడికి అవకాశం కల్పించాలి.

ఇప్పటికే రిటైర్ అయిన 2,316 మందితో పాటు, సర్వీసులో ఉన్న లక్షల మంది ఉద్యోగులు ఈ విషయంలో ఆందోళన చెందుతున్నారని, వెంటనే ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కల్వ శ్రవణ్ కుమార్, కోటకొండ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement