త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cognizant Layoffs 2026 | కాగ్నిజెంట్ సంచలన నిర్ణయం: 4 వేల మంది ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం.. కారణం ఏంటంటే?

ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ (Cognizant) దాదాపు 4,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. కృత్రిమ మేధ (AI) వినియోగం, 'ప్రాజెక్ట్ లీప్' అమలు నేపథ్యంలో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

J

Technology | Published On May 2, 2026, 7.43 pm IST

Cognizant Layoffs 2026 | కాగ్నిజెంట్ సంచలన నిర్ణయం: 4 వేల మంది ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం.. కారణం ఏంటంటే?

సంక్షిప్త సారాంశం

ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ భారీ లేఆఫ్స్‌కు తెరతీసింది. మందగించిన డిమాండ్, ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు (AI) వైపు అడుగులు వేస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4,000 మంది (1 శాతం) ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. అదే సమయంలో ఈ ఏడాది 20 వేల మంది ఫ్రెషర్స్‌ను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. 'ప్రాజెక్ట్ లీప్' పేరుతో కొత్త విధానాన్ని అమలు చేస్తూ ఏఐ పై భారీ పెట్టుబడులు పెడుతున్న కాగ్నిజెంట్.. ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది.

Advertisement

Cognizant Layoffs 2026 | త్రినేత్ర.న్యూస్ : ఐటీ రంగంలో లేఆఫ్స్ (Layoffs) పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (Cognizant Technology Solutions) తమ ఉద్యోగులకు గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. 'ప్రాజెక్ట్ లీప్' (Project Leap), ఏఐ (AI) టెక్నాలజీ వినియోగం పెరగడం, డిమాండ్ నెమ్మదించడం వంటి కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 4,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. ఈ సంఖ్య సంస్థ మొత్తం గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో సుమారు 1 శాతానికి సమానం.

ఏంటి ఈ 'ప్రాజెక్ట్ లీప్' (Project Leap)?

కాగ్నిజెంట్ ఇటీవల 'ప్రాజెక్ట్ లీప్' పేరుతో ఒక Transformation Programme ప్రకటించింది. దీని ప్రధాన ఉద్దేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లో పెట్టుబడులు పెంచడం, సంస్థ డిజిటల్ సామర్థ్యాలను బలోపేతం చేయడం, ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచడం (Reskilling).

ఈ ప్రాజెక్ట్ కోసం సంస్థ $230 మిలియన్ల నుంచి $320 మిలియన్ల వరకు (సుమారు రూ.2,680 కోట్లు) ఖర్చు చేయనుంది. ఇందులో ప్యాకేజీలు, ఉద్యోగుల తొలగింపు నష్టపరిహారం కింద 200–270 మిలియన్ డాలర్లు వెచ్చించనుంది. అయితే, ఈ ప్రాజెక్ట్ అమలు ద్వారా ఈ ఏడాది ఏకంగా $300 మిలియన్ల మేర ఆదా అవుతుందని కంపెనీ అంచనా వేస్తోంది.

మిడ్-లెవల్ ఉద్యోగులకే ఎసరు.. ఫ్రెషర్స్‌కు బంపరాఫర్

లేఆఫ్స్ సంఖ్యను కంపెనీ అధికారికంగా ధృవీకరించనప్పటికీ.. ఈ ఏడాది 20,000 మందికి పైగా ఫ్రెషర్స్‌ను (కొత్తవారిని) తీసుకోనున్నట్లు ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా మేనేజ్‌మెంట్ తెలిపింది. దీనిని బట్టి చూస్తే, ఆటోమేషన్, ఏఐ వినియోగం పెరుగుతున్నందున, ఎక్కువ జీతాలు తీసుకునే మిడ్-లెవల్ (Mid-level) ఉద్యోగుల అవసరాన్ని తగ్గించుకుని, ఆ స్థానంలో తక్కువ వేతనంతో పనిచేసే ఫ్రెషర్స్‌ను నియమించుకోవాలని కాగ్నిజెంట్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

మార్చి 2026 నాటికి కాగ్నిజెంట్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,57,600 గా ఉంది. ఆ త్రైమాసికంలో కొత్తగా 6,000 మంది ఉద్యోగులు చేరారు.

సీఈవో రవికుమార్ హయాంలో ఇది రెండోసారి

జనవరి 2023లో కాగ్నిజెంట్ సీఈవోగా ఎస్. రవికుమార్ బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆధ్వర్యంలో లేఆఫ్స్ ప్రకటించడం ఇది రెండోసారి. 2023 మొదట్లో నాన్-బిల్లేబుల్ రోల్స్‌లో ఉన్న దాదాపు 3,500 మంది ఉద్యోగులను కంపెనీ తొలగించింది.

తాజా ఆర్థిక ఫలితాలు

ఇటీవల విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల్లో కాగ్నిజెంట్ $5.41 బిలియన్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది గత త్రైమాసికంతో పోలిస్తే 1.5 శాతం, గత ఏడాదితో పోలిస్తే 5.8 శాతం ఎక్కువ. నికర లాభం $662 మిలియన్లుగా నమోదైంది.

కేవలం కాగ్నిజెంట్ మాత్రమే కాకుండా.. ఇటీవలి కాలంలో ఒరాకిల్ కార్పొరేషన్ (Oracle), టీసీఎస్ (TCS) వంటి ఇతర టెక్ దిగ్గజాలు కూడా తమ వర్క్‌ఫోర్స్‌లో కోతలు విధించిన విషయం తెలిసిందే. ఏఐ రాకతో భవిష్యత్తులో ఐటీ రంగంలో మున్ముందు ఇంకెన్ని మార్పులు వస్తాయో వేచి చూడాలి.

Advertisement
Advertisement