త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Black Holes | బ్లాక్‌హోల్స్‌తోనూ గ్రహాల సృష్టి!

Black Holes | విశ్వంలో బ్లాక్‌హోల్స్‌ అంటేనే విధ్వంసక శక్తులు. తమ సమీపంలోని పదార్థాలను, చివరకు కాంతిని సైతం ఆకర్షించగల అపార గురుత్వాకర్షణ వాటి సొంతం. అయితే, ఇవి కేవలం అంతం చేసేవే కాదు.. కొత్త గ్రహాలు, నక్షత్రాల ఆవిర్భావానికీ దోహదపడవచ్చని తాజా అధ్యయనం అంచనా వేస్తోంది.

P

Science | Published On Oct 9, 2026, 7.25 pm IST

Black Holes | బ్లాక్‌హోల్స్‌తోనూ గ్రహాల సృష్టి!
Advertisement

Black Holes | విశ్వంలో బ్లాక్‌హోల్స్‌ అంటేనే విధ్వంసక శక్తులు. తమ సమీపంలోని పదార్థాలను, చివరకు కాంతిని సైతం ఆకర్షించగల అపార గురుత్వాకర్షణ వాటి సొంతం. అయితే, ఇవి కేవలం అంతం చేసేవే కాదు.. కొత్త గ్రహాలు, నక్షత్రాల ఆవిర్భావానికీ దోహదపడవచ్చని తాజా అధ్యయనం అంచనా వేస్తోంది. సూపర్‌ మాసివ్‌ బ్లాక్‌హోల్స్‌ చుట్టూ పేరుకుపోయే ధూళి, వాయువుల నుంచి గ్రహాలు ఏర్పడే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ నక్షత్రాల చుట్టూ గ్రహాలు ఏర్పడే విధానాన్ని పోలి ఉండటం విశేషం.

ధూళి, వాయువులతో డిస్క్‌..

సాధారణంగా నక్షత్రాల చుట్టూ ఉండే ధూళి, వాయువులతో కూడిన డిస్క్‌ నుంచే గ్రహాలు ఏర్పడతాయి. ఈ పదార్థాలు ఒకదానికొకటి ఢీకొంటూ, క్రమంగా కలిసిపోయి పెద్ద ఘన నిర్మాణాలుగా మారతాయి. కాలక్రమంలో ఇవే గ్రహాలుగా రూపుదిద్దుకుంటాయి. ఇలాంటి ప్రక్రియ బ్లాక్‌హోల్స్‌ చుట్టూ కూడా చోటుచేసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా తమ చుట్టూ ఉన్న వాయువులు, ధూళిని చురుగ్గా ఆకర్షించే సూపర్‌ మాసివ్‌ బ్లాక్‌హోల్స్‌పై ఈ అధ్యయనం దృష్టి సారించింది. వీటి కేంద్రాల్లోకి పదార్థం చేరే క్రమంలో చుట్టూ భారీగా వాయువులు, ధూళి పోగుపడతాయి. అవి వేగంగా పరిభ్రమిస్తూ అత్యంత వేడిగా ఉండే అక్రిషన్‌ డిస్క్‌ను ఏర్పరుస్తాయి. ఇలాంటి ప్రాంతాల్లోనూ గ్రహ నిర్మాణానికి అవసరమైన ప్రక్రియలు చోటుచేసుకునే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. యాక్టివ్‌ గెలాక్టిక్‌ న్యూక్లియై (ఏజీఎన్‌)గా పిలిచే ఈ చురుకైన కేంద్రాలు అనేక గెలాక్సీల్లో కనిపిస్తాయి. నక్షత్రాల చుట్టూ గ్రహాలు ఏర్పడటానికి కారణమయ్యే భౌతిక నియమాలే బ్లాక్‌హోల్స్‌ చుట్టూ కూడా పనిచేసే అవకాశం ఉందని ఈ అధ్యయనానికి సహ రచయితగా ఉన్న ఖగోళ భౌతిక శాస్త్రవేత్త బారీ మెక్‌కెర్నన్‌ పేర్కొన్నారు. అయితే, బ్లాక్‌హోల్స్‌ చుట్టూ గ్రహాల నిర్మాణం జరుగుతున్నట్లు ప్రత్యక్షంగా నిర్ధారణ కాలేదు. ప్రస్తుతం ఇది సైద్ధాంతిక అంచనాలు, కంప్యూటర్‌ సిమ్యులేషన్స్‌ ఆధారంగా ప్రతిపాదించిన అవకాశం మాత్రమే.

బృహస్పతి పరిమాణంలో పుట్టి..

పరిశోధకుల కంప్యూటర్‌ సిమ్యులేషన్స్‌ ప్రకారం.. బ్లాక్‌హోల్స్‌ చుట్టూ ఏర్పడే గ్రహాలు తొలుత బృహస్పతి (జూపిటర్‌) పరిమాణంలో ఉండవచ్చు. అనంతరం చుట్టుపక్కల ఉన్న పదార్థాన్ని సమీకరించుకుంటూ మరింత భారీగా పెరిగే అవకాశం ఉంది. ధూళి రేణువులు ఒకదానితో మరొకటి ఢీకొని, క్రమంగా కలిసిపోవడం ద్వారా చిన్న గ్రహాల నిర్మాణం మొదలవుతుంది. అయితే, ఈ ప్రక్రియలో ఏర్పడే అన్ని ఖగోళ వస్తువులూ గ్రహాలుగానే మిగిలిపోవు. కొన్ని గోధుమ మరుగుజ్జు నక్షత్రాలుగా (బ్రౌన్‌ డ్వార్ఫ్స్‌) మారవచ్చు. మరికొన్ని తగిన పరిస్థితుల్లో నక్షత్రాలుగా ఎదిగే అవకాశమూ ఉందని అధ్యయనం సూచిస్తోంది.

విధ్వంసం మధ్యే సృష్టి!

బ్లాక్‌హోల్స్‌ అపార గురుత్వాకర్షణ కారణంగా వాటి చుట్టూ ఏర్పడే గ్రహాలన్నీ మనుగడ సాగిస్తాయని చెప్పలేం. కొన్ని బ్లాక్‌హోల్‌ ఆకర్షణకు చిక్కి ధ్వంసమయ్యే అవకాశం ఉంది. అలా విచ్ఛిన్నమైన ఖగోళ వస్తువుల పదార్థం మళ్లీ చుట్టుపక్కల ధూళి, వాయువుల్లో కలిసిపోవచ్చు. అయినప్పటికీ, అనుకూల పరిస్థితులు కొనసాగితే ఒక బ్లాక్‌హోల్‌ చుట్టూ భారీ సంఖ్యలో గ్రహాలు ఏర్పడే అవకాశాన్ని పరిశోధకులు పరిశీలిస్తున్నారు. ఒక యాక్టివ్‌ గెలాక్టిక్‌ న్యూక్లియస్‌ చురుకుగా ఉండే దశ సాధారణంగా సుమారు 20 లక్షల సంవత్సరాల పాటు కొనసాగవచ్చని అంచనా. ఒకే బ్లాక్‌హోల్‌ తన పరిణామ క్రమంలో ఇలాంటి చురుకైన దశలను పలుమార్లు ఎదుర్కొనే అవకాశం ఉంది. దీంతో కోట్లాది సంవత్సరాల వ్యవధిలో గ్రహ నిర్మాణానికి అనేక అవకాశాలు లభించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ‘ది ఆస్ట్రోఫిజికల్‌ జర్నల్‌’లో 2026 జూన్‌ 29న ప్రచురితమైన ఈ అధ్యయనం.. బ్లాక్‌హోల్స్‌ పాత్రపై ఆసక్తికరమైన కొత్త కోణాన్ని ముందుకు తెచ్చింది. అయితే, వాటి చుట్టూ నిజంగానే గ్రహాలు ఏర్పడుతున్నాయా? ఏర్పడితే అవి ఎంతకాలం మనుగడ సాగిస్తాయి? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి మరిన్ని పరిశీలనలు, పరిశోధనలు అవసరం.

Advertisement
Advertisement