త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Puvvada Ajay Kumar | తుమ్మ‌ల తుమ్మ మొద్దు లాంటోడు.. ఖ‌మ్మంకు ఒక్క ప‌నీ చెయ్య‌లే: పువ్వాడ అజ‌య్‌కుమార్‌

Puvvada Ajay Kumar | తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao) తుమ్మ మొద్దు లాంటోడ‌ని, ఖ‌మ్మం(Khammam) జిల్లాకు ఒక్క ప‌ని కూడా చేయ‌లేద‌ని మాజీ మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ విమ‌ర్శించారు. ఆయ‌న చెప్పే ఆవు కథలు వినడానికి ఈ తెలంగాణ సమాజం సిద్ధంగా లేద‌న్నారు.

S

News | Published On Apr 21, 2026, 2.19 pm IST

Puvvada Ajay Kumar | తుమ్మ‌ల తుమ్మ మొద్దు లాంటోడు.. ఖ‌మ్మంకు ఒక్క ప‌నీ చెయ్య‌లే: పువ్వాడ అజ‌య్‌కుమార్‌
Advertisement
  • ఆయ‌న చెప్పే ఆవు క‌థ‌లు ప్ర‌జ‌లు విన‌లేరు
  • ఏ పార్టీలో ఉన్నా మంత్రి ప‌ద‌వి కోస‌మే పాకులాడుత‌డు
  • రుణ‌మాఫీపై హ‌రీశ్‌రావు స‌వాల్ కు తోక ముడిచిండు
  • మీడియా స‌మావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ విమ‌ర్శ‌లు

Puvvada Ajay Kumar | త్రినేత్ర.న్యూస్‌: తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao) తుమ్మ మొద్దు లాంటోడ‌ని, ఖ‌మ్మం(Khammam) జిల్లాకు ఒక్క ప‌ని కూడా చేయ‌లేద‌ని మాజీ మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ విమ‌ర్శించారు. ఆయ‌న చెప్పే ఆవు కథలు వినడానికి ఈ తెలంగాణ సమాజం సిద్ధంగా లేద‌న్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. వంద శాతం రైతు రుణమాఫీపై హ‌రీశ్‌రావు (Harish Rao) స‌వాల్‌ను స్వీక‌రించ‌లేక తోక ముడిచిండ‌ని ఎద్దేవా చేశారు.

హ‌రీశ్‌రావుపై తూల‌నాడాడు..

ఖమ్మంలో గ‌త ఆదివారం హరీశ్‌రావు పర్యటన జరిగింది. వ్యవసాయ రంగంపై తుమ్ముల నాగేశ్వరావుకు హరీశ్‌రావు సవాల్ విసిరారు. ఆయ‌న‌ విసిరిన సవాల్ కు సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా హరీశ్‌రావు పై తుమ్మల తూలనాడాడు. సీతారామ ప్రాజెక్టును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రభుత్వాన్ని హరీశ్‌ ప్రశ్నించడం తప్పా. రాజకీయ పరమైన విమర్శలు ఉండాలే తప్పా, వ్యక్తిగతమైన విమర్శలు ఉండకూడదు. తుమ్మల చెప్పే ఆవు కథనే తెలంగాణ ప్రజలు ప్రతిరోజు వింటున్నారు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో మంత్రి పదవి కోసం పాకులాడే వ్యక్తి తుమ్మల. టీడీపీ (TDP), టీఆర్ఎస్ (TRS), కాంగ్రెస్ మూడు పార్టీలు మారాడు అని పువ్వాడ‌ విమ‌ర్శించారు.

హెలికాప్ట‌ర్‌ను ఎర్ర బ‌స్సును వాడిన‌ట్లు వాడుతుండ్రు..

వరద వచ్చేముందు కొట్టుకొని వచ్చే తుమ్మ మొద్దులాంటి వాడు తుమ్మల నాగేశ్వరరావు. తప్పకుండా మంత్రి తుమ్మలకు బుద్ధి చెప్తాం. ఆ తుమ్మ మొద్దు వల్ల పెద్ద నష్టమేమి ఉండదు. ఎర్ర బస్సు వాడినట్లు మంత్రులు హెలికాప్టర్ వాడుతున్నారు.. కేరళకు ప‌ర్య‌ట‌న‌ల‌కు సైతం హెలికాప్టర్ వాడారు. మంత్రిగా ఖమ్మం జిల్లాకు ఒక్కటంటే ఒక్క పని చెయ్యలేదు.

ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి ఇచ్చిన ఘనత కేసీఆర్ ది. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ వెంట ఉంటున్న వ్యక్తి హరీశ్‌ రావు. అలాంటి వ్యక్తిని విమర్శించే స్థాయి తుమ్మలకు లేదు. రుణమాఫీ వందకు వంద శాతం పూర్తి చెయ్యలేదని నాగేశ్వరరావు ఆత్మకు తెలుసు. NTR హయాం నుంచి మొదలు కేసీఆర్ హయాం వరకు తుమ్మల మంత్రి పదవిలో కొనసాగాడు. యూరియా కోసం రైతులు పడుతున్న తంటాలు ప్రభుత్వ అసమర్థత కాదా? తుమ్మల నాగేశ్వరరావు అసమర్థత కాదా? అని ప్ర‌శ్నించారు.

జీవో 59 అంద‌రి కోసం తెచ్చారు..

ఖమ్మం మున్నేరు వరదలో కొట్టుకుపోతున్న వారిని కాపాడేందుకు ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు హెలికాప్టర్ తేలేకపోయారని హరీశ్‌ ప్రశ్నించడం తప్పా. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న అరాచకం వెలుగుమట్ల ఇష్యూ చూసి సమాజం మొత్తం బాధపడింది. వక్ఫ్ బోర్డు భూమిని ఆక్రమించుకొని మంత్రి తుమ్మల ఇల్లు కట్టుకున్నాడు. వన్ ఆఫ్ 70 యాక్ట్ లో గిరిజనల భూమిని ఆక్రమించుకున్నాడు. తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు చేసే కబ్జాలు ఖమ్మంలో కనపడుతూనే ఉన్నాయి. జీవో 59 నా ఒక్కరి కోసం తేలేదు.. అందరి కోసం కేసీఆర్ తెచ్చారు. మా ఆసుపత్రిపై మంత్రి తుమ్మల విషం కక్కుతున్నాడు. ఖమ్మంలో మక్కలు, వడ్లు ఎందుకు కొనడం లేదని అడిగితే ఆయ‌న‌కు కోప‌మొస్తుంది అని పువ్వాడ అజ‌య్‌కుమార్‌ విమ‌ర్శించారు.

Advertisement
Advertisement