త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US Visitor Visa Hyderabad | అమెరికా టూర్‌ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఏడాది ఆగాల్సిందే.. హైదరాబాద్‌లోనే అత్యధిక వెయిటింగ్ పీరియడ్

అమెరికా టూరిస్ట్ వీసా ఇంటర్వ్యూ స్లాట్ కోసం దాదాపు ఏడాది వేచి ఉండాల్సి వస్తోంది. దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్‌లో 12 నెలల వెయిటింగ్ పీరియడ్ నమోదైంది.

J

National | Published On Sep 28, 2026, 4.00 am IST

US Visitor Visa Hyderabad | అమెరికా టూర్‌ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఏడాది ఆగాల్సిందే.. హైదరాబాద్‌లోనే అత్యధిక వెయిటింగ్ పీరియడ్

సంక్షిప్త సారాంశం

భారతీయులకు బీ1/బీ2 (B1/B2) టూరిస్ట్, బిజినెస్ వీసా అపాయింట్‌మెంట్ల వెయిటింగ్ సమయం మళ్లీ పెరిగింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 12 నెలల నిరీక్షణ నెలకొంది. ముంబైలో 11.5 నెలలు, ఢిల్లీలో 10 నెలలు ఉండగా, కోల్‌కతా (6.5 నెలలు), చెన్నై (7.5 నెలలు) నగరాల్లో కాస్త తక్కువ సమయం పడుతోంది. స్టూడెంట్ వీసాలు (F, M, J), వర్క్ వీసాల (H-1B, L1) విషయంలో మాత్రం వెయిటింగ్ సమయం చాలా తక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం. ఫ్లైట్ టికెట్లు, హోటల్ బుకింగ్‌లకు ముందే వీసా స్లాట్‌లను చూసుకోవాలని, రెగ్యులర్‌గా పోర్టల్ చెక్ చేస్తే ముందస్తు తేదీలు దొరికే చాన్స్ ఉంటుందని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.

Advertisement

US Visitor Visa Hyderabad | త్రినేత్ర న్యూస్ : అమెరికాలో బంధువులను చూడాలన్నా లేదా హాలీడే ట్రిప్ వేద్దామన్నా భారతీయ ప్రయాణికులు ఇకపై చాలా ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్‌లోని యూఎస్ కాన్సులేట్లలో విజిటర్ వీసాల (B1/B2) ఇంటర్వ్యూ స్లాట్ దొరకాలంటే దాదాపు ఏడాది పాటు ఆగాల్సి వస్తోంది. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ తాజాగా వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం.. దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్ కాన్సులేట్ పరిధిలో తదుపరి అపాయింట్‌మెంట్ కోసం ఏకంగా 12 నెలల వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది.

నగరాల వారీగా విజిటర్ వీసా (B1/B2) వెయిటింగ్ టైమ్

హైదరాబాద్: 12 నెలలు

ముంబై: 11.5 నెలలు

న్యూఢిల్లీ: 10 నెలలు

చెన్నై: 7.5 నెలలు

కోల్‌కతా: 6.5 నెలలు

హైదరాబాద్‌లో ఆగస్టులో సగటు నిరీక్షణ సమయం 9.5 నెలలుగా ఉండగా, సెప్టెంబర్ నాటికి అది 11.5 నెలలకు చేరింది. తాజాగా స్లాట్ బుక్ చేసుకునే కొత్త దరఖాస్తుదారులకు ఏడాది తర్వాతే తేదీలు అందుబాటులోకి వస్తున్నాయి. మరోవైపు ముంబైలో గతంలో 14 నెలలు ఉన్న నిరీక్షణ సమయం ఇప్పుడు 11.5 నెలలకు తగ్గింది.

విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట

టూరిస్ట్, బిజినెస్ వీసాలకు ఇంత భారీ క్యూ ఉన్నప్పటికీ.. విద్యార్థులు, వర్క్ వీసాలపై వెళ్లేవారికి మాత్రం వేగంగానే స్లాట్లు లభిస్తున్నాయి.

స్టూడెంట్ వీసాలు (F, M, J): చెన్నైలో 15 రోజుల్లోపే స్లాట్లు లభిస్తుండగా, హైదరాబాద్‌లో కేవలం 1.5 నెలలు, కోల్‌కతా, ఢిల్లీల్లో 2 నెలలు, ముంబైలో 2.5 నెలల వెయిటింగ్ సమయం మాత్రమే ఉంది.

వర్క్ వీసాలు (H-1B, L, O, P, Q): ఉద్యోగ సంబంధిత వీసాలకు హైదరాబాద్‌లో 5.5 నెలలు పడుతుండగా, ఢిల్లీలో 3 నెలలు, చెన్నై-ముంబైలలో 1.5 నెలలు, కోల్‌కతాలో కేవలం ఒక నెల మాత్రమే సమయం పడుతోంది.

ట్రావెలర్స్ ఏం చేయాలి?

యూఎస్ ట్రిప్ కోసం కేవలం ఫ్లైట్ టికెట్లు, హోటల్ రూమ్‌లు బుక్ చేసుకుంటే సరిపోదని.. ముందస్తుగా వీసా అపాయింట్‌మెంట్ లభ్యతను దృష్టిలో ఉంచుకుని మాత్రమే షెడ్యూల్ ఖరారు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే దరఖాస్తుదారులకు ఒక చిన్న అవకాశం కూడా ఉంది. కాన్సులేట్లు ఎప్పటికప్పుడు అదనపు స్లాట్లను పోర్టల్‌లో విడుదల చేస్తుంటాయి. ఇప్పటికే తేదీని బుక్ చేసుకున్నవారు నిరంతరం పోర్టల్‌ను చెక్ చేస్తూ ఉంటే, రద్దయిన లేదా కొత్తగా విడుదల చేసిన ముందస్తు స్లాట్‌లను రీషెడ్యూల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రతి నెలా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఈ వివరాలను సమీక్షిస్తూ అప్‌డేట్ చేస్తుంది.

Advertisement
Advertisement