త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi SC Petition SIR | సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్: ఎన్నికల సంఘంపై కోరిన ఆ 10 కీలక డిమాండ్లు ఇవే!

ఓటర్ల జాబితా సవరణ (SIR)పై తక్షణ స్టే, ఈవీఎం ఆడిట్ సహా ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌లోని టాప్ 10 డిమాండ్లు ఇవే!

J

National | Published On Oct 12, 2026, 11.00 pm IST

Rahul Gandhi SC Petition SIR | సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్: ఎన్నికల సంఘంపై కోరిన ఆ 10 కీలక డిమాండ్లు ఇవే!
Advertisement
  • వివాదాస్పద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను అన్ని రాష్ట్రాల్లో వెంటనే నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో ఇండియా కూటమి పిటిషన్
  • రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి ఓటర్ల తొలగింపు, ఈవీఎం (EVM) ప్రోటోకాల్స్‌పై పూర్తి ఆడిట్ చేయాలని డిమాండ్
  • నోటీసులు, విచారణ లేకుండా ఎవరి ఓటూ తీసేయకూడదని, తొలగించిన ఓటర్ల వివరాలను కారణాలతో సహా బూత్‌ల వారీగా పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని విజ్ఞప్తి
  • ఈసీఐ నిర్ణయాలు, ఈసీఐనెట్ (ECINET), ఈఆర్‌ఓనెట్ (ERONET) యాక్సెస్ లాగ్ రికార్డులన్నింటినీ కోర్టు ముందు ఉంచాలని వినతి

Rahul Gandhi SC Petition SIR | త్రినేత్ర న్యూస్ : కేంద్ర ఎన్నికల సంఘం (ECI), చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుంటూ విపక్ష ఇండియా (INDIA) కూటమి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) పేరిట భారీగా ఓట్లను తొలగించారని ఆరోపిస్తూ, ‘రాహుల్ గాంధీ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ పేరిట దాఖలైన ఈ పిటిషన్‌లో 10 ప్రధాన అంశాలపై అత్యున్నత న్యాయస్థానం జోక్యాన్ని కోరారు.

నిర్దేశిత సాయంత్రం 4:30 గంటల డెడ్‌లైన్ లోపు భారీ ర్యాలీ కారణంగా రాహుల్ నేరుగా కోర్టుకు చేరుకోలేకపోవడంతో న్యాయవాది ఎస్. ప్రసన్న ద్వారా ఈ పిటిషన్‌ను రిజిస్ట్రీలో అధికారికంగా దాఖలు చేశారు.

సుప్రీంకోర్టు ముందు ఉంచిన 10 కీలక డిమాండ్లు ఇవే

1. SIR రికార్డులన్నీ కోర్టుకు సమర్పించాలి

2025 జూన్ 24న ఎస్ఐఆర్ ప్రారంభించేందుకు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఫైల్స్, మీటింగ్ మినట్స్, అభ్యంతరాల పత్రాలతో పాటు ECINET, ERONET యాక్సెస్ లాగ్ వివరాలన్నింటినీ ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ముందు ఉంచేలా ఆదేశించాలి.

2. రాజ్యాంగబద్ధతపై సమీక్ష

ఎస్ఐఆర్ విషయంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 324కు, 2023 నాటి ఈసీ చట్టానికి, చారిత్రక టీఎన్ శేషన్ కేసు తీర్పునకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది తేల్చాలి. చట్టబద్ధత లేని నిర్ణయాలను రద్దు చేయాలి.

3. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై చర్యలు

ఓటర్ల జాబితా తయారీలో నిబంధనలను ఉల్లంఘించిన బాధ్యులైన ఎన్నికల అధికారులపై పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ సెక్షన్ 32 కింద కఠిన చర్యలు తీసుకోవాలి.

4. 2023 చట్టం ప్రకారం పారదర్శకత

ఈ పిటిషన్‌పై ఈసీ తగిన నిర్ణయం తీసుకునేలా, భవిష్యత్తులో ఎస్ఐఆర్ విషయంలో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని రికార్డు చేసేలా ఆదేశించాలి.

5. ఆన్‌లైన్ ఫామ్-6లో నిబంధనల మార్పులు రద్దు

ఆన్‌లైన్ ఫామ్-6 అనేది 1960 నాటి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్‌కు లోబడి ఉండాలని, ముందస్తు ప్రక్రియ లేకుండా అందులో ఏకపక్ష మార్పులు చేయకూడదు.

6. రిటైర్డ్ సుప్రీం జడ్జితో స్వతంత్ర కమిటీ ఆడిట్

సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో టెక్నికల్ నిపుణులతో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లపై, ECINET/ERONET డేటాబేస్‌పై విచారణ జరపడంతో పాటు ఈవీఎంల (EVMs) సాంకేతిక రూపకల్పన, డిప్లాయ్‌మెంట్ విధానాలపై పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహించాలి.

7. తొలగించిన ఓటర్ల వివరాలు బహిర్గతం చేయాలి

ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎవరెవరి ఓట్లు తొలగించారో ఆ వివరాలను బూత్‌ల వారీగా, తొలగించడానికి గల కారణాలతో సహా అధికారికంగా వెల్లడించాలి. అర్హులైన ఓటర్లను తిరిగి చేర్చేందుకు స్పష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.

8. నోటీసు ఇవ్వకుండా ఓటు తొలగించకూడదు

సహేతుకమైన కారణం చూపకుండా, ముందస్తు నోటీసు ఇచ్చి వాదనలు వినకుండా ఏ ఒక్క ఓటరు పేరునూ జాబితా నుంచి తొలగించరాదు. త్వరలో ఎన్నికలు జరగనున్న పంజాబ్ వంటి రాష్ట్రాల్లో చివరి తేదీ వరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించాలి.

9. ఎస్ఐఆర్ ప్రక్రియపై తక్షణ మధ్యంతర స్టే

ప్రస్తుతం దాఖలు చేసిన పిటిషన్‌పై తుది తీర్పు వచ్చేంతవరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను తక్షణమే నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి.

10. న్యాయస్థానం విచక్షణాధికారాలు

రాజ్యాంగ విలువలు, పౌరుల ఓటు హక్కుల పరిరక్షణకు పరిస్థితులకు అనుగుణంగా కోర్టు భావించే ఇతర తగిన ఆదేశాలను జారీ చేయాలని విపక్షాలు పిటిషన్‌లో అభ్యర్థించాయి.

Advertisement
Advertisement