త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Super-Duper El Nino | సూపర్-డూపర్‌ ఎల్‌నినో.. భూమంతా ఎరుపెక్కుతోంది!

Super-Duper El Nino | భూగోళం మునుపెన్నడూ విధంగా వేడెక్కుతోంది. పసిఫిక్‌ మహాసముద్రంలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఎల్‌నినో మరింత బలపడుతోంది. ఇప్పుడ‌ది సూపర్‌-డూపర్ స్థాయికి చేరుకుంటోంది. ఇది గతంలో నమోదైన రికార్డులను బద్దలు కొట్టే స్థాయికి చేరుతోందని ప్రపంచ వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

P

National | Published On Oct 8, 2026, 6.13 pm IST

Super-Duper El Nino | సూపర్-డూపర్‌ ఎల్‌నినో.. భూమంతా ఎరుపెక్కుతోంది!
Advertisement
  • రికార్డు స్థాయికి చేరుతున్న ఉష్ణోగ్రతలు..
  • మ‌రో 3.7 డిగ్రీల వ‌ర‌కు పెరిగే అవకాశం
  • 2027 ఫిబ్రవరి వరకు కొనసాగొచ్చన్న డబ్ల్యూఎంవో అంచనా
  • వాతావరణ మార్పుల ప్రభావాన్ని మరింత తీవ్రం చేస్తుందని హెచ్చరిక
  • సాధార‌ణం కంటే 4.51 లక్షల మరణాలు పెరిగే అవ‌కాశం

Super-Duper El Nino | భూగోళం మునుపెన్నడూ విధంగా వేడెక్కుతోంది. పసిఫిక్‌ మహాసముద్రంలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఎల్‌నినో మరింత బలపడుతోంది. ఇప్పుడ‌ది సూపర్‌-డూపర్ స్థాయికి చేరుకుంటోంది. ఇది గతంలో నమోదైన రికార్డులను బద్దలు కొట్టే స్థాయికి చేరుతోందని ప్రపంచ వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2026 చివరి నాటికి ప్రపంచంలోని విస్తృత ప్రాంతాల్లో అసాధారణ వేడి పరిస్థితులు నెలకొనడంతోపాటు.. ఈ ప్రభావం 2027 ఫిబ్రవరి వరకు కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు. పసిఫిక్‌ మహాసముద్ర జ‌లాలు వేడుక్కుతుండ‌డంతో ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. ఈ ఏడాది ఎల్‌నినో కనీసం 1950 తర్వాత నమోదైన అత్యంత బలమైన ఎల్‌నినోల్లో ఒకటిగా మారొచ్చని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ డబ్ల్యూఎంవో (WMO) అంచనా వేసింది.

భూమంతా ఎరుపే..

వాతావరణ శాస్త్రవేత్త ర్యాన్‌ మౌయి ప్రపంచ ఉష్ణోగ్రతలను సూచించే మ్యాప్‌ను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. భూమి దాదాపు మొత్తం ఎరుపు రంగులో కనిపిస్తోందని పేర్కొన్నారు. శీతాకాలం వరకు ఎల్‌నినో ‘మ్యాక్సిమమ్‌ పవర్‌’తో కొనసాగుతుందని, అమెరికా మినహా ప్రపంచవ్యాప్తంగా వేడిమి తీవ్రత పెరుగుతుందని వ్యాఖ్యానించారు. ఎల్‌నినో 2027 ఫిబ్రవరి వరకు కొనసాగే అవకాశముందని డబ్ల్యూఎంవో అంచనాతో ఆయన ఏకీభవించారు. క్లైమేట్‌ శాస్త్రవేత్త జీక్‌ హౌస్‌ఫాదర్‌ ప్రకారం.. ఈ ఏడాది ఎల్‌నినో ‘అన్‌చార్టెడ్‌ వాటర్స్‌’లోకి వెళ్తోంది. ఎల్‌నినోను కొలిచే నినో 3.4 ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3.4 డిగ్రీల సెల్సియ‌స్ వ‌ర‌కు అధికంగా నమోదవుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకు నమోదైన ఏ ఎల్‌నినోతో పోల్చినా ఇది అత్యధిక స్థాయి అని పేర్కొన్నారు. మరో వాతావరణ నిపుణుడు లియోన్‌ సిమన్స్‌ ఈ వాతావరణ పరిస్థితిని ‘సూపర్‌-డూపర్‌ ఎల్‌నినో’గా అభివర్ణించారు.

సాధార‌ణం కంటే ఎక్కువ‌గానే..

2026 చివరి నెలల్లో ప్రపంచంలోని విస్తృత ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని డబ్ల్యూఎంవో తెలిపింది. ఎల్‌నినోకు కేంద్రంగా ఉండే ఉష్ణమండల పసిఫిక్‌లోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో అక్టోబర్‌–డిసెంబర్‌ మధ్య సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3.7 (6.7°F) డిగ్రీల సెల్సియ‌స్ వ‌ర‌కు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. సహజంగా ఏర్పడే ఎల్‌నినో–సదరన్‌ ఆసిలేషన్‌ (ENSO) చక్రంలో వేడి దశే ఎల్‌నినో. ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా ప్రతి రెండు నుంచి ఏడేళ్లకోసారి సంభవించే ఎల్‌నినో.. ప్రపంచ ఉష్ణోగ్రతలను పెంచడంతోపాటు వర్షపాత నమూనాలను కూడా మార్చేస్తుంటుంది. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉంటుంది.

4.51 లక్షల వరకు అదనపు మరణాలు..

ఎల్‌నినో ప్రభావం మానవ ప్రేరిత వాతావరణ మార్పుల తీవ్రతను మరింత పెంచుతుందని డబ్ల్యూఎంవో హెచ్చరించింది. ఇదే సమయంలో చికాగో యూనివర్సిటీకి చెందిన క్లైమేట్‌ ఇంపాక్ట్‌ ల్యాబ్‌ పరిశోధకులు గత నెలలో చేసిన అంచనాల ప్రకారం.. ఈ ఏడాది ‘సూపర్‌ ఎల్‌నినో’ కారణంగా 2026 జూన్‌ నుంచి 2027 ఫిబ్రవరి మధ్య ప్రపంచవ్యాప్తంగా 4.51 లక్షల వరకు అదనపు మరణాలు సంభవించే అవకాశం ఉంది.

Advertisement
Advertisement