త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Yusuf Pathan | పార్టీ మార‌గానే.. యూస‌ఫ్ ప‌ఠాన్‌కు బీజేపీ ప్ర‌భుత్వం భారీ గిఫ్ట్‌

Yusuf Pathan | టీఎంసీని వీడిన (TMC exit) నెల‌ల వ్య‌వ‌ధిలోనే మాజీ క్రికెట‌ర్‌, లోక్‌స‌భ ఎంపీ యూస‌ఫ్ ప‌ఠాన్ (Yusuf Pathan)కు గుజ‌రాత్ ప్ర‌భుత్వం భారీ బ‌హుమ‌తి ఇచ్చింది. 14 ఏళ్లుగా వివాదంలో ఉన్న భూమిని ఆయ‌న‌కు కేటాయించేలా ఆదేశాలు జారీ చేసింది. దీంతో పార్టీ మార‌గానే గుజ‌రాత్ (Gujarat) ప్ర‌భుత్వం యూస‌ఫ్‌కు వ‌డోద‌రా ప్లాట్‌ను (Vadodara plot) బ‌హుమ‌తిగా ఇచ్చిందంటూ రాజ‌కీయ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.

D

National | Published On Oct 20, 2026, 1.07 pm IST

Yusuf Pathan | పార్టీ మార‌గానే.. యూస‌ఫ్ ప‌ఠాన్‌కు బీజేపీ ప్ర‌భుత్వం భారీ గిఫ్ట్‌
Advertisement

Yusuf Pathan | త్రినేత్ర న్యూస్ : తృణమూల్ కాంగ్రెస్‌ను వీడి (TMC exit), ఎన్‌డీఏ ప‌క్షాన‌ చేరిన మాజీ క్రికెట‌ర్‌, లోక్‌స‌భ ఎంపీ యూస‌ఫ్ ప‌ఠాన్ (Yusuf Pathan)కు గుజ‌రాత్ ప్ర‌భుత్వం భారీ బ‌హుమ‌తి ఇచ్చింది. ఎన్నో ఏళ్ల నుంచి వివాదాస్పదంగా ఉన్న ఒక స్థలాన్ని ఆయ‌న‌కు కేటాయించేలా ప్ర‌భుత్వం (BJP government) ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు నగర పాలక సంస్థకు తగిన ఆదేశాలు జారీ చేసింది.

వడోదరలోని తందల్జా ప్రాంతంలో తన బంగ్లా పక్కనే ఉన్న 978 చదరపు మీటర్ల స్థ‌లాన్ని త‌న‌కు కేటాయించాల‌ని కోరుతూ యూస‌ఫ్ ప‌ఠాన్‌.. వడోదర మున్సిపల్ కార్పొరేషన్‌కు 2012లో లేఖ రాశారు. ఆ ఏడాది మార్చి 30, జూన్ 8 తేదీల్లో జరిగిన సమావేశాల్లో మున్సిప‌ల్ అధికారులు దీనిపై చర్చించారు. ఆ తర్వాత పబ్లిక్ ఆక్షన్ లేకుండా 99 సంవత్సరాల లీజు ప్రాతిపదికన ఆ భూమిని యూస‌ఫ్‌కు కేటాయించే ప్రక్రియను మున్సిపల్ కార్పొరేషన్ ప్రారంభించింది. అయితే, పబ్లిక్ ఆక్షన్ లేకుండా ఆ భూమిని కేటాయించే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం 2014లో తిరస్కరించింది.

టీఎంసీ ఎంపీగా గెల‌వ‌గానే..

ఇక 2024లో తృణ‌మూల్ త‌ర‌ఫున లోక్‌స‌భ ఎంపీగా యూస‌ఫ్ గెల‌వ‌గానే.. ప్ర‌భుత్వం వివాదాస్ప‌ద స్థ‌లం స్వాధీనానికి చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఆ స్థ‌లంలో ఉన్న ఆక్ర‌మ‌ణ‌లు వెంట‌నే తొల‌గించాల‌ని మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ యూస‌ఫ్ ప‌ఠాన్ గుజ‌రాత్ హైకోర్టును ఆశ్ర‌యించారు. అయితే, ప‌ఠాన్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను హైకోర్టు కొట్టివేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ పఠాన్ డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ దాఖలు చేశారు. అక్క‌డ కూడా ఆయ‌న‌కు చుక్కెదురైంది. ప్రభుత్వ ప్లాట్‌ను చట్టబద్ధమైన కేటాయింపులు లేదా ఎటువంటి చెల్లింపులు జరపకుండా ఎలా ఆక్రమించుకున్నారంటూ ప్ర‌శ్నించింది. దీంతో త‌న అప్పీల్‌ను యూస‌ఫ్ ప‌ఠాన్ 2026లో వెన‌క్కి తీసుకున్నారు.

పార్టీ మారిన నెల‌ల వ్య‌వ‌ధిలోనే..

అయితే, ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత దాదాపు 20 మంది రెబ‌ల్ ఎంపీలు టీఎంసీని వీడి నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI)లో చేరిన విష‌యం తెలిసిందే. తిరుగుబాటు ఎంపీల్లో యూస‌ఫ్ ప‌ఠాన్ కూడా ఉన్నారు. యూస‌ఫ్ టీఎంసీని వీడిన నెల‌ల వ్య‌వ‌ధిలోనే దాదాపు 14 ఏళ్లుగా వివాదంలో ఉన్న భూమి ఆయ‌న సొంతం కావ‌డం గ‌మ‌నార్హం. పార్టీ మార‌గానే గుజ‌రాత్ ప్ర‌భుత్వం యూస‌ఫ్‌కు వ‌డోద‌రా ప్లాట్‌ను (Vadodara plot) బ‌హుమ‌తిగా ఇచ్చిందంటూ రాజ‌కీయ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.

మొత్తం స్థ‌లం విలువ రూ.20 కోట్ల‌కు పైమాటే..

ఈ 978 చదరపు మీటర్ల స్థలం విలువ సుమారు రూ. 20.53 కోట్లుగా ఉంటుంద‌ని అంచ‌నా. మొత్తం ఆస్తిలో సగాన్ని యూసుఫ్‌కు బహుమతి రూపంలో అంద‌నుండ‌గా.. మిగతా సగాన్ని ఆయన నిర్ణీత ధరకు కొనుగోలు చేస్తారని అధికార వ‌ర్గాల ద్వారా తెలిసింది. పఠాన్‌కు ఈ స్థలాన్ని కేటాయించే ప్రతిపాదనను ప్ర‌భుత్వ ఆమోదం ల‌భించ‌డంతో.. దీన్ని స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ముందు ఉంచనున్నారు. కమిటీ ఆమోదం లభించిన తర్వాత పూర్తి ప్రక్రియ ముగుస్తుంద‌ని వడోదర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణ్ వెల్ల‌డించారు.

Also Read..

ఉగ్ర‌వాదుల చేతుల్లోకి సున్నితమైన సాంకేతిక ప‌రిజ్ఞానం.. ఐరాస వేదిక‌గా భార‌త్ తీవ్ర ఆందోళ‌న‌

నా అత్తమామలు సౌత్ ఇండియన్సే, వారిని ప్రేమిస్తాను కానీ..!

జియో ఐపీఓకు భారీ స్పందన.. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.8,110 కోట్లు..

Advertisement
Advertisement