త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IndiGo CEO Pieter Elbers Resigns | సంక్షోభం తర్వాత ఊహించని పరిణామం: ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ రాజీనామా

ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo) సీఈవో పీటర్ ఎల్బర్స్ తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేశారు. డిసెంబర్‌లో సంస్థ ఎదుర్కొన్న అతిపెద్ద విమాన అంతరాయాల సంక్షోభం తర్వాత సరిగ్గా మూడు నెలలకే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం విమానయాన రంగంలో సంచలనంగా మారింది.

J

National | Published On Mar 10, 2026, 8.09 pm IST

IndiGo CEO Pieter Elbers Resigns | సంక్షోభం తర్వాత ఊహించని పరిణామం: ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ రాజీనామా
Advertisement

IndiGo CEO Pieter Elbers Resigns | త్రినేత్ర.న్యూస్ : దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ 'ఇండిగో (IndiGo)'లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పీటర్ ఎల్బర్స్ తన పదవికి రాజీనామా చేశారు. మార్చి 10, 2026న ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఇండిగో వెల్లడించింది. కొత్త సీఈవో నియామకం జరిగే వరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా తాత్కాలికంగా సంస్థ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటారని స్పష్టం చేసింది.

రాహుల్ భాటియాకు రాసిన రాజీనామా లేఖలో.. పీటర్ ఎల్బర్స్ తన నిష్క్రమణకు వ్యక్తిగత కారణాలను ఉదహరించారు. అలాగే తన నోటీస్ పీరియడ్‌ను మినహాయించాలని కోరారు. "గత కొన్నేళ్లుగా ఇండిగో సీఈవోగా సేవ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అద్భుతమైన ప్రయాణంలో నేను భాగమైనందుకు సంతోషిస్తున్నాను" అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

రాజీనామా వెనుక అసలు కారణం అదేనా?

డిసెంబర్ 2025 ప్రారంభంలో ఇండిగో విమానయాన సంస్థ తన చరిత్రలోనే అత్యంత దారుణమైన నిర్వహణ సంక్షోభాన్ని ఎదుర్కొంది. డిసెంబర్ 3 నుంచి 5 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పైలట్ల ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనల అమలులో సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తింది. ఆ మూడు రోజుల్లో 2507 విమానాలు రద్దు కాగా 1852 విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విమానాల రద్దుతో సంస్థకు దాదాపు రూ. 2,000 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లినట్లు అంచనా.

డీజీసీఏ (DGCA) కొరడా

ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA).. ఇండిగో సంస్థపై కఠిన చర్యలు తీసుకుంది. జనవరి 17న సంస్థకు ఏకంగా రూ.22.20 కోట్ల భారీ జరిమానా విధించింది. ఫిబ్రవరి 10 వరకు ఇండిగో శీతాకాలపు షెడ్యూల్‌ను 10 శాతం మేర తగ్గించింది. సంస్థలో వ్యవస్థాగత మార్పులు తీసుకురావాలని ఆదేశిస్తూ, రూ.50 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని సమర్పించాలని కోరింది. అలాగే, విమాన కార్యకలాపాలు, సంక్షోభ నిర్వహణలో పర్యవేక్షణ లోపించినందుకు సీఈవో పీటర్ ఎల్బర్స్‌తో పాటు మరో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు డీజీసీఏ గట్టి హెచ్చరికలు జారీ చేసింది.

పీటర్ ఎల్బర్స్ ప్రస్థానం.. సాధించిన విజయాలు

సుమారు 30 ఏళ్ల పాటు విమానయాన రంగంలో (ముఖ్యంగా KLM ఎయిర్‌లైన్స్‌లో) అపార అనుభవం ఉన్న పీటర్ ఎల్బర్స్, సెప్టెంబర్ 2022లో ఇండిగో సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలో సంస్థ ఎన్నో మైలురాళ్లను అందుకుంది. సంస్థ ఆదాయం 10 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. విమానాల సంఖ్య 440కి పైగా పెరిగింది. విమానయాన చరిత్రలోనే అత్యంత భారీగా.. ఒకేసారి 500 ఎయిర్‌బస్ A320 విమానాలకు ఆర్డర్ ఇవ్వడం ఆయన నాయకత్వంలోనే జరిగింది. అయినప్పటికీ, డిసెంబర్ సంక్షోభం ఆయన పదవీకాలంపై తీవ్ర మచ్చ మిగిల్చింది. జనవరిలో హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. "ఆ మూడు రోజులు వినియోగదారులను మేము నిరాశపరిచాము. కానీ ఆ మూడు రోజులు, 20 ఏళ్ల ఇండిగో వారసత్వాన్ని నిర్ణయించలేవు" అని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement