త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Donkey Farming | గాడిదలను పెంచుతారా?.. కేంద్రమే 50 లక్షల వరకు సబ్సిడీ ఇస్తోంది..!

గాడిదల పెంపకం ద్వారా లక్షల్లో సంపాదించాలనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ కింద రూ. 50 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తోంది. అర్హతలు, దరఖాస్తు విధానం ఏంటో తెలుసుకోండి.

J

National | Published On Mar 7, 2026, 4.55 pm IST

Donkey Farming | గాడిదలను పెంచుతారా?.. కేంద్రమే 50 లక్షల వరకు సబ్సిడీ ఇస్తోంది..!
Advertisement

ఏం చేతకాకపోతే గాడిదలు మేపుకోమనే రోజులు ఇక పోయాయి

ఇప్పుడు గాడిదల పెంపకమే ఒక 'బిజినెస్'

Donkey Farming | త్రినేత్ర.న్యూస్ : గతంలో ఎవరైనా సరిగ్గా చదవకపోయినా, బాధ్యత లేకుండా తిరిగినా.. "వెళ్లి గాడిదలు మేపుకో" అని తిట్టడం మనం వినే ఉంటాం. కానీ ఇప్పుడు అదే గాడిదల పెంపకం ఒక లాభదాయకమైన వ్యాపారంగా మారుతోంది. గాడిదలకు ఉన్న డిమాండ్, వాటి పాలలోని ఔషధ గుణాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది.

Donkey Farming | రూ.50 లక్షల వరకు ఆర్థిక సాయం

నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ (National Livestock Mission - NLM) కింద గాడిదల బ్రీడింగ్ ఫామ్ ఏర్పాటు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం 50 శాతం వరకు క్యాపిటల్ సబ్సిడీ అందిస్తోంది. ఈ పథకం కింద గరిష్టంగా రూ.50 లక్షల వరకు రాయితీ పొందే అవకాశం ఉంది.

పథకం ముఖ్య వివరాలు

ఎవరు అర్హులు?: వ్యక్తిగత రైతులు, స్వయం సహాయక సంఘాలు (SHGs), రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOs), సహకార సంఘాలు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు (JLGs).

యూనిట్ పరిమాణం: ఈ పథకం కింద సబ్సిడీ పొందాలంటే కనీసం 50 ఆడ గాడిదలు, 5 మగ గాడిదలు కలిగి ఉండాలి.

జాతి: కేవలం మన దేశానికి చెందిన స్థానిక జాతి (Indigenous Breeds) గాడిదల పెంపకానికి మాత్రమే ఈ సబ్సిడీ వర్తిస్తుంది.

సబ్సిడీ ఎలా ఇస్తారు?

ప్రభుత్వం ఈ రాయితీని రెండు విడతల్లో విడుదల చేస్తుంది.

మొదటి విడత: ప్రాజెక్టుకు సంబంధించి బ్యాంకు రుణం మంజూరైన వెంటనే విడుదల చేస్తారు.

రెండో విడత: ఫామ్ నిర్మాణం పూర్తయి, అధికారులు తనిఖీ చేసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని అందజేస్తారు.

గాడిదలకు ఎందుకింత డిమాండ్?

భారతదేశంలో 2012 నుంచి 2019 నాటికి గాడిదల సంఖ్య దాదాపు 60 శాతం తగ్గిపోయింది. 1.23 లక్షల గాడిదలు మాత్రమే మిగిలాయని పశుగణన గణంకాలు చెబుతున్నాయి.

గాడిద పాలు: అంతర్జాతీయ మార్కెట్‌లో గాడిద పాలకు భారీ డిమాండ్ ఉంది. వీటిని ఆయుర్వేద మందులలో, ఖరీదైన సౌందర్య సాధనాల (Cosmetics) తయారీలో ఉపయోగిస్తారు. వీటి పాల ధర లీటరుకు వేలల్లో పలుకుతుంది.

ఎగుమతులు: చైనా వంటి దేశాల్లో గాడిద చర్మం నుంచి తీసే జిలాటిన్ (Ejiao) కు మంచి డిమాండ్ ఉంది. దీనిని సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఆసక్తి ఉన్న రైతులు, పారిశ్రామికవేత్తలు కేంద్ర పశుసంవర్ధక శాఖకు చెందిన అధికారిక NLM పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా మీ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

గాడిదలు అంటే కేవలం బరువులు మోయడానికే కాదు, వాటి పెంపకం ఇప్పుడు ఒక నైపుణ్యం కలిగిన వ్యాపారం. ప్రభుత్వం ఇస్తున్న ఈ భారీ సబ్సిడీని ఉపయోగించుకుని గ్రామీణ యువత కొత్త ఉపాధి మార్గాలను వెతుక్కోవచ్చు.

Advertisement
Advertisement