త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tahir Hussain Convicted | ఢిల్లీ అల్లర్లు : ఐబీ అధికారి హత్య కేసులో దోషిగా ఆప్ మాజీ నేత తాహిర్ హుస్సేన్

2020 ఢిల్లీ అల్లర్ల సమయంలో ఐబీ అధికారి అంకిత్ శర్మ దారుణ హత్య కేసులో ఆప్ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌తో పాటు మరో నలుగురిని కోర్టు దోషులుగా తేల్చింది.

J

National | Published On Jul 13, 2026, 8.49 pm IST

Tahir Hussain Convicted | ఢిల్లీ అల్లర్లు : ఐబీ అధికారి హత్య కేసులో దోషిగా ఆప్ మాజీ నేత తాహిర్ హుస్సేన్
Advertisement
  • 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసులో తీర్పు వెలువరించిన ఢిల్లీ కర్కర్‌డూమా కోర్టు
  • ఐబీ అధికారి అంకిత్ శర్మ దారుణ హత్య కేసులో ఆప్ మాజీ నేత తాహిర్ హుస్సేన్‌, మరో నలుగురు దోషులుగా నిర్ధారణ
  • సాక్ష్యాధారాలు లేకపోవడంతో మరో ఆరుగురిని నిర్దోషులుగా విడుదల చేసిన న్యాయస్థానం
  • తీర్పు వినగానే కోర్టు హాలులోనే కన్నీళ్లు పెట్టుకున్న తాహిర్ హుస్సేన్‌

Tahir Hussain Convicted | త్రినేత్ర.న్యూస్ : 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్ల (2020 northeast Delhi riots) కేసులో ఢిల్లీ కర్కర్‌డూమా కోర్టు (Karkardooma Court) సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అధికారి అంకిత్ శర్మ దారుణ హత్య కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌తో పాటు మరో నలుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది.

కోర్టు తీర్పు.. దోషులు ఎవరంటే?

ఈ కేసును విచారించిన అడిషనల్ సెషన్స్ జడ్జి ప్రవీణ్ సింగ్ ఈ తీర్పును వెలువరించారు. తాహిర్ హుస్సేన్‌తో పాటు నజీమ్, ఖాసిమ్, జావేద్, అనాస్ అనే మరో నలుగురు నిందితులను హత్య, అల్లర్లు సృష్టించడం, శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, దాడి చేయడం వంటి అభియోగాల కింద దోషులుగా తేల్చారు. అయితే, తాహిర్ పై ఉన్న నేరం చేసేందుకు కుట్ర పన్నినట్టుగా ఉన్న (criminal conspiracy) చార్జీని మాత్రం కోర్టు కొట్టివేసింది. తగిన ఆధారాలు లేకపోవడంతో మిగతా ఆరుగురిని నిర్దోషులుగా విడుదల చేసింది. కాగా, ఈ తీర్పు వినగానే తాహిర్ హుస్సేన్ కోర్టు హాలులోనే కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. ఈ తీర్పుపై తాము అప్పీల్‌కు వెళ్తామని ఆయన తరఫు న్యాయవాది అబ్దుల్ గఫ్ఫార్ తెలిపారు. దోషులకు శిక్షలు ఖరారు చేసే తేదీని కోర్టు త్వరలో వెల్లడించనుంది.

అసలేం జరిగింది?

2020 ఫిబ్రవరిలో సీఏఏ (CAA) కు వ్యతిరేకంగా, మద్దతుగా జరిగిన ఆందోళనల మధ్య ఈశాన్య ఢిల్లీలో తీవ్ర మతకల్లోలాలు చెలరేగాయి. ఈ అల్లర్లలో సుమారు 53 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఫిబ్రవరి 25న డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన 26 ఏళ్ల ఐబీ అధికారి అంకిత్ శర్మ, సాయంత్రం 5 గంటల సమయంలో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆయన తండ్రి రవీందర్ కుమార్ మరుసటి రోజు ఉదయం దయాల్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో (Dayalpur police station) మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

ఆ తర్వాత చాంద్ బాగ్ పులియా సమీపంలోని ఓ మసీదు వెనుక ఉన్న ఖజూరీ ఖాస్ నాలాలో (Khajuri Khas drain) అంకిత్ మృతదేహం లభ్యమైంది. గుర్తుపట్టకుండా ఉండేందుకు అతని ముఖం.. ఇతర శరీర భాగాలపై యాసిడ్ పోసి కాల్చేశారు. అప్పటి ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ తన ఆఫీసు వద్ద అల్లరిమూకలను పోగేసి ఈ దారుణ హత్యకు పాల్పడ్డారని అంకిత్ తండ్రి రవీందర్ కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

విచారణలో వెలుగుచూసిన నిజాలు

అల్లర్లు జరిగిన సమయంలో ముస్తఫాబాద్ (Mustafabad) అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వార్డ్ నంబర్ 59కి తాహిర్ హుస్సేన్ కౌన్సిలర్‌గా ఉన్నారు. 2017లో గెలిచిన ఈయన సుమారు రూ.16 కోట్ల ఆస్తులతో ఆ వార్డులోనే అత్యంత ధనవంతుడైన అభ్యర్థిగా నిలిచారు. అయితే, ఈ కేసులో ఆయన పేరు బయటకు రావడంతో ఆప్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పోలీసుల విచారణలో తాహిర్ సంచలన విషయాలు అంగీకరించారు. అల్లర్ల సమయంలో పెట్రోల్, యాసిడ్, గాజు సీసాలు, రాళ్లను సేకరించడమే తన పని అని ఆయన విచారణలో పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

Advertisement
Advertisement