త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sathankulam Custodial Death Case | సత్తన్‌కుళం తండ్రీకొడుకుల కస్టోడియల్ డెత్ కేసు: 9 మంది తమిళనాడు పోలీసులకు ఉరిశిక్ష

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2020 నాటి సత్తన్‌కుళం (తమిళనాడు) తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో సంచలన తీర్పు వెలువడింది. జయరాజ్, బెన్నిక్స్‌ల దారుణ హత్యకు కారణమైన 9 మంది పోలీసులకు మధురై కోర్టు ఉరిశిక్ష విధించింది.

J

National | Published On Apr 6, 2026, 7.44 pm IST

Sathankulam Custodial Death Case | సత్తన్‌కుళం తండ్రీకొడుకుల కస్టోడియల్ డెత్ కేసు: 9 మంది తమిళనాడు పోలీసులకు ఉరిశిక్ష
Advertisement
  • సత్తన్‌కుళం లాకప్ డెత్ కేసులో 9 మంది తమిళనాడు పోలీసులకు మరణశిక్ష (ఉరిశిక్ష) విధిస్తూ మధురై కోర్టు తీర్పు
  • ఇది అత్యంత అరుదైన కేసుగా (Rarest of rare) అభివర్ణించిన న్యాయస్థానం
  • అధికారుల అధికార దుర్వినియోగం, కర్కశత్వంపై ఆగ్రహం
  • శిక్ష పడిన వారిలో ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, సబ్-ఇన్‌స్పెక్టర్లు రఘు గణేష్, బాలకృష్ణన్ సహా ఆరుగురు కానిస్టేబుళ్లు
  • మరో నిందితుడు పాల్దురై విచారణ సమయంలో కోవిడ్‌తో మృతి
  • లాక్‌డౌన్ సమయంలో షాపు తెరిచారన్న నెపంతో అరెస్ట్ చేసి, స్టేషన్‌లో రాత్రంతా నగ్నంగా కూర్చోబెట్టి కర్కశంగా కొట్టి చంపిన పోలీసులు

Sathankulam Custodial Death Case |  త్రినేత్ర.న్యూస్ : ఆరేళ్ల క్రితం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా సత్తన్‌కుళం (Sathankulam) తండ్రీకొడుకుల కస్టోడియల్ డెత్ కేసులో సోమవారం చరిత్రాత్మక తీర్పు వెలువడింది. వ్యాపారులైన తండ్రి పి. జయరాజ్ (59), కుమారుడు జె. బెన్నిక్స్ (31) లను పోలీస్ స్టేషన్‌లో దారుణంగా హింసించి హత్య చేసిన కేసులో 9 మంది పోలీసు అధికారులకు మధురై కోర్టు మరణశిక్ష (ఉరిశిక్ష) విధించింది.

"చదువుతుంటేనే గుండె తరుక్కుపోతోంది.."

తీర్పును వెలువరిస్తూ న్యాయమూర్తి జి. ముత్తుకుమారన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "తండ్రీకొడుకులను నగ్నంగా చేసి అత్యంత కిరాతకంగా దాడి చేశారు. ఆ వివరాలు చదువుతుంటేనే గుండె తరుక్కుపోతోంది" అని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఇది అధికార దుర్వినియోగం కిందకు వస్తుందని, సమాజ మనస్సాక్షిని కదిలించిన ఈ ఘాతుకాన్ని "అత్యంత అరుదైన కేసు (rarest of rare)" గా పరిగణిస్తూ ఈ అత్యున్నత శిక్షను ఖరారు చేసింది.

ఉరిశిక్ష పడిన పోలీసులు వీరే

ఇన్‌స్పెక్టర్ ఎస్. శ్రీధర్, సబ్-ఇన్‌స్పెక్టర్లు రఘు గణేష్, బాలకృష్ణన్, హెడ్ కానిస్టేబుళ్లు మురుగన్, సమదురై, కానిస్టేబుళ్లు ముత్తురాజ్, చెల్లదురై, థామస్ ఫ్రాన్సిస్, వేలుముత్తులకు కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసులో 10వ నిందితుడిగా ఉన్న స్పెషల్ సబ్-ఇన్‌స్పెక్టర్ పాల్దురై విచారణ సమయంలోనే కోవిడ్-19తో మరణించాడు.

Image

అసలేం జరిగిందంటే? (2020 జూన్ 19 నాటి చీకటి రాత్రి)

కరోనా లాక్‌డౌన్ సమయంలో అనుమతించిన సమయం కంటే ఎక్కువగా మొబైల్ యాక్సెసరీస్ షాపు తెరిచి ఉంచారనే నెపంతో జూన్ 19 రాత్రి జయరాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తండ్రిని విడిపించుకునేందుకు వెళ్లిన కుమారుడు బెన్నిక్స్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సీబీఐ (CBI) ఛార్జ్‌షీట్ ప్రకారం.. ఆ రాత్రి సత్తన్‌కుళం పోలీస్ స్టేషన్‌లో పోలీసులు రాక్షసులుగా మారారు. ఇద్దరి బట్టలు విప్పేసి, లోదుస్తులతో టేబుల్‌పై వంచి లారీలతో విపరీతంగా కొట్టారు. లాఠీలతో కొట్టడంతో వారి లుంగీలు రక్తంతో తడిచిపోయి పదే పదే మార్చాల్సి వచ్చింది. రక్తస్రావం అయిన తర్వాత, నేలపై పడిన తమ రక్తాన్ని వారితోనే తుడిపించారు. తీవ్ర గాయాలపాలైన జయరాజ్, బెన్నిక్స్ ఇద్దరూ జూన్ 22, 23 తేదీల్లో కోవిల్‌పట్టి సబ్ జైలులో ప్రాణాలు కోల్పోయారు.

9 Tamil Nadu Cops Get Death Sentence for 2020 Sathankulam Father-Son Custodial Torture and Murder

పి. జయరాజ్ (59), కుమారుడు జె. బెన్నిక్స్ (31)

సాక్ష్యాలు మాయం.. సీబీఐ విచారణ

ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మొదట సీబీ-సీఐడీ (CB-CID) దర్యాప్తు చేసిన ఈ కేసును మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ చేపట్టింది. విచారణ సమయంలో పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు చెరిపేయడం, లాఠీలు ఇవ్వకుండా అధికారులను బెదిరించడం వంటివి చేశారు. అయితే, గోడలు, టాయిలెట్లు, లాఠీలపై ఉన్న రక్తపు మరకలు (DNA), బాధితుల రిపోర్టులు ఆధారంగా సీబీఐ బలమైన సాక్ష్యాలను కోర్టుకు సమర్పించింది. సుమారు ఐదేళ్ల పాటు సాగిన ఈ విచారణలో 100 మందికి పైగా సాక్షులను విచారించిన కోర్టు చివరకు దోషులకు ఉరిశిక్షను ఖరారు చేసింది.

Advertisement
Advertisement