త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nidhhi Agerwal | చేతిలో అరడజను సినిమాలు.. ఒక్క హిట్‌ కోసం నిధి వెయిటింగ్‌!

Nidhhi Agerwal | టాలీవుడ్‌లో అందం, అభినయంతో గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక నిధి అగర్వాల్‌ కెరీర్‌ ఆసక్తికరంగా సాగుతోంది. వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ.. బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోతోంది. ఇప్పటివరకు తెలుగులో ఆమె ఖాతాలో చెప్పుకోదగ్గ భారీ విజయం ఒక్కటంటే ఒక్క‌టే ఉండటం గమనార్హం.

P

Entertainment | Published On Oct 28, 2026, 8.39 pm IST

Nidhhi Agerwal | చేతిలో అరడజను సినిమాలు.. ఒక్క హిట్‌ కోసం నిధి వెయిటింగ్‌!
Advertisement

Nidhhi Agerwal | టాలీవుడ్‌లో అందం, అభినయంతో గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక నిధి అగర్వాల్‌ కెరీర్‌ ఆసక్తికరంగా సాగుతోంది. వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ.. బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోతోంది. ఇప్పటివరకు తెలుగులో ఆమె ఖాతాలో చెప్పుకోదగ్గ భారీ విజయం ఒక్కటంటే ఒక్క‌టే ఉండటం గమనార్హం. అయితే, విజయాలు అంతగా లేకపోయినా అవకాశాలు మాత్రం ఆమెను వెతుక్కుంటూ వ‌స్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను వరకు ప్రాజెక్టులు ఉన్నట్లుగా సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో రాబోయే రెండేళ్లు ఈ భామ కెరీర్‌కు కీలకం కానున్నాయి.

‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో గుర్తింపు

నిధి అగర్వాల్‌ 2018లో వచ్చిన ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2019లో రామ్‌ పోతినేని హీరోగా నటించిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటడంతో నిధికి తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఆ విజయం ఆమె కెరీర్‌కు బలమైన పునాది వేసింది. అయితే, ఆ తర్వాత అదే స్థాయిలో స‌క్సెస్‌ను అందించే మూవీ కోసం ఎదురుచూస్తూనే ఉంది. అయితే, నిధి అగర్వాల్‌ కెరీర్‌లో పెద్ద సినిమాలకు కొదవలేదు. పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘హరి హర వీరమల్లు’, ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘ది రాజా సాబ్‌’ వంటి భారీ ప్రాజెక్టుల్లో నటించే అవకాశం ఆమెకు దక్కింది. స్టార్‌ హీరోల సినిమాల్లో భాగమైనప్పటికీ.. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. దాంతో నిధికి స‌వాల్‌గా మారింది. భారీ చిత్రాల్లో అవకాశాలు రావడం ఒక ఎత్తయితే.. అది విజ‌యం సాధించి హీరోయిన్ కెరీర్‌ను మరింత బలోపేతం చేయడం మరో ఎత్తు. ఈ నేపథ్యంలో నిధి తన త‌ర్వాతి సినిమాలతో ఎలాంటి ఫలితాలు అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

చేతిలో అరడజను ప్రాజెక్టులు?

సినీ వర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. నిధి అగర్వాల్‌ ప్రస్తుతం హిందీలో మూడు సినిమాలతో పాటు తమిళంలో ఓ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. స్టోన్‌ బెంచ్‌ ప్రొడక్షన్స్‌ నిర్మాణంలో తెరకెక్కనున్న తమిళ సినిమా కూడా ఈ జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక తెలుగులో మరో రెండు సినిమాలు ఆమె చేతిలో ఉన్నట్లు సమాచారం. ఇందులో ఓ యువ కథానాయకుడి సరసన నటించే సినిమా ఉండగా.. మరోటి వుమెన్ ఒరియెంటెడ్ చిత్రం. మైథ‌లాజిక‌ల్ మూవీ షూటింగ్ ఆగ‌స్టులోనే పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైంది. వ‌రాహ్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న మూవీలో లీడ్ రోల్ పోషిస్తోంది. సునీత్ పడోల్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'తంత్ర' (Tantra) ఫేమ్ శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్ పుట్టినరోజున షూటింగ్ మొద‌లుపెట్టారు.

కెరీర్‌కు కీలకం..

సినిమాల సంఖ్య పెరగడం నిధికి కలిసొచ్చే అంశమే అయినా.. వాటిలో ఎన్ని విజయాలు సాధిస్తాయన్నదే అసలు ప్రశ్న. వరుసగా పెద్ద ప్రాజెక్టుల్లో నటించడం ద్వారా ప్రేక్షకుల్లో గుర్తింపు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ, ఆ గుర్తింపును నిలబెట్టుకోవాలంటే బాక్సాఫీస్‌ విజయాలు సైతం అవసరం. ముఖ్యంగా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తర్వాత ఆమెకు మరో బలమైన హిట్‌ దక్కకపోవడంతో త‌ర్వాతి సినిమాలపైనే న‌మ్మ‌కం పెట్టుకున్న‌ది. వ‌చ్చే సినిమాల్లో క‌నీసం రెండు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు సాధించినా నిధి కెరీర్‌కు మ‌ళ్లీ ఊపు వచ్చే అవకాశం ఉంది. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకోవడంతో పాటు కథ, పాత్రకు ఉన్న ప్రాధాన్యం ఉన్న‌సినిమాల‌నే ఎంపిక చేసుకోవ‌డం కీల‌కం కానుంది. అవకాశాలు పుష్కలంగా వ‌స్తున్న ప్రస్తుత తరుణంలో వాటిని స‌క్సెస్‌గా మలుచుకోవడంపైనే నిధి దృష్టి సారించిన‌ట్లుగా తెలుస్తోంది. మరి రాబోయే సినిమాలతో ఈ భామ మరోసారి బాక్సాఫీస్‌ వద్ద తన సత్తా చాటుతుందా? అనేది వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement