త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pakistan Gobar Tax | పాకిస్థాన్‌లో వింత పన్ను: బర్రెలకు డైపర్లు కడుతున్న యజమానులు.. ఎందుకో తెలుసా?

పాకిస్థాన్ పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న ఓ వింత నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పశువుల పేడపై పన్ను (గోబర్ ట్యాక్స్) విధించడంతో, జరిమానాల నుంచి తప్పించుకోవడానికి అక్కడి యజమానులు తమ బర్రెలకు డైపర్లు వేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

J

International | Published On Apr 19, 2026, 5.09 pm IST

Pakistan Gobar Tax | పాకిస్థాన్‌లో వింత పన్ను: బర్రెలకు డైపర్లు కడుతున్న యజమానులు.. ఎందుకో తెలుసా?
Advertisement

Pakistan Gobar Tax | త్రినేత్ర.న్యూస్ : వింత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది పాకిస్థాన్. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాక్.. ఆదాయాన్ని పెంచుకునేందుకు నానా తంటాలు పడుతోంది. తాజాగా ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం తీసుకున్న ఒక వింత నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా హాస్యాస్పదంగా మారింది. అదే "గోబర్ ట్యాక్స్ (పేడ పన్ను)".

ఏమిటీ గోబర్ ట్యాక్స్?

పాకిస్థాన్ పంజాబ్ ముఖ్యమంత్రి మరియమ్ నవాజ్ నేతృత్వంలోని ప్రభుత్వం.. "సుత్రా పంజాబ్ (క్లీన్ పంజాబ్)" అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. పట్టణాల్లో పరిశుభ్రతను మెరుగుపరచడం, సేకరించిన పేడతో బయోగ్యాస్ ఉత్పత్తి చేయడమే ఈ పథకం లక్ష్యం అని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగా పంజాబ్ వ్యాప్తంగా ఉన్న 168 పశువుల (Cattle colonies) కాలనీల్లో ఈ కొత్త పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం, పశువుల యజమానులు తమ దగ్గర ఉన్న ఒక్కో ఆవు లేదా బర్రెకు రోజుకు రూ.30 (పాకిస్థాన్ కరెన్సీ) చొప్పున పన్నుగా చెల్లించాలి. ఒకవేళ రోడ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో పశువులు పేడ వేసి అపరిశుభ్రం చేస్తే ఏకంగా రూ.30 వేల వరకు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. పంజాబ్‌లో సుమారు 50 లక్షల పశువులు ఉన్నట్లు అంచనా. ఈ లెక్కన చూసుకుంటే పశువుల పేడ ద్వారా నెలకు ఏకంగా రూ.450 కోట్ల వరకు వసూలు చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

బర్రెలకు డైపర్లు ఎందుకు?

ప్రభుత్వం విధించిన ఈ కొత్త పన్నులు, భారీ జరిమానాలతో పాక్ పశువుల కాపరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒక వ్యక్తి వద్ద 10 పశువులు ఉంటే.. ఈ పన్ను కారణంగా ఏడాదికి దాదాపు రూ.11,000 (సుమారు 4 వేల భారత రూపాయలు) అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సన్నకారు పాడి రైతులకు ఇది పెను భారం. దీంతో రైతులు ఓ వినూత్న ఆలోచన చేశారు. "పేడ నేల మీద పడితేనే కదా పన్ను కట్టాలి.. అసలు కింద పడకుండా ఉంటే కట్టాల్సిన పనిలేదు" అనే లాజిక్‌ను వాడారు. ఇంకేముంది.. జరిమానాల నుంచి తప్పించుకోవడానికి తమ బర్రెలకు పెద్ద పెద్ద క్లాత్ బ్యాగులను, సంచులను 'డైపర్లు'గా కడుతున్నారు. ఈ డైపర్లు ధరించిన బర్రెల వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం డైపర్లు వేయాలని ఎక్కడా చెప్పకపోయినా.. ఫైన్ల భయంతో రైతులే ఈ ఐడియా వేశారు. కొందరైతే పశువులు తక్కువ పేడ వేసేలా ప్రత్యేకమైన "జీరో-వేస్ట్ డైట్ ప్లాన్స్" కూడా ఫాలో అవుతున్నట్లు సమాచారం!

సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ

పాక్ ప్రభుత్వ నిర్ణయంపై సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తోంది. అటు పాకిస్థానీలు, ఇటు భారతీయులు ఈ వార్తను మీమ్స్‌తో తెగ ఆడుకుంటున్నారు. "పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి పేడ మీద పన్ను వేసే స్థాయికి దిగజారిందా?" అని కొందరు ప్రశ్నిస్తుంటే.. "ఈ రోజు పశువుల పేడపై పన్ను వేశారు, రేపు మనుషులపై వేసినా ఆశ్చర్యం లేదు" అని మరికొందరు ఎగతాళి చేస్తున్నారు. "ఈ పన్నును పేడతో నిండిన రాజకీయ నాయకుల మెదడులకు కూడా విధించాలి" అని పలువురు నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు.

పర్యావరణం పేరుతో ప్రభుత్వం సామాన్యులపై ఆర్థిక భారం మోపుతోందని, ఇది కేవలం ఆదాయం రాబట్టే మార్గమే తప్ప మరొకటి కాదని పాక్ ప్రతిపక్షాలు సైతం విమర్శిస్తున్నాయి. ఏదేమైనా పాకిస్థాన్ విధించిన ఈ 'గోబర్ ట్యాక్స్' ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నవ్వుల పాలవుతోంది.

Advertisement
Advertisement