త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chabahar Port | ఇరాన్‌-ఇజ్రాయెల్ యుద్ధం: చాబహార్ పోర్టుపై దాడుల కలకలం.. భారత వేల కోట్ల పెట్టుబడులు సేఫేనా?

మధ్య ఆసియా దేశాలతో వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకునే వ్యూహంలో భాగంగా భారత్ ఇరాన్‌లోని చాబహార్ పోర్టులో సుమారు రూ.14,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి.

J

International | Published On Mar 4, 2026, 5.51 pm IST

Chabahar Port | ఇరాన్‌-ఇజ్రాయెల్ యుద్ధం: చాబహార్ పోర్టుపై దాడుల కలకలం.. భారత వేల కోట్ల పెట్టుబడులు సేఫేనా?

సంక్షిప్త సారాంశం

గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం భారత్‌కు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులతో దద్దరిల్లుతున్న ఇరాన్‌లో... భారత్ ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న 'చాబహార్ పోర్ట్' భద్రతపై ప్రశ్నార్థకం నెలకొంది. వేల కోట్ల రూపాయల భారతీయ పెట్టుబడులు, కీలకమైన వాణిజ్య మార్గాల భవిష్యత్తు ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో డైలమాలో పడింది. అసలు ఈ ప్రాజెక్టుల వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి? ప్రస్తుత పరిస్థితుల ప్రభావం ఎలా ఉండబోతోంది?

Advertisement

Chabahar Port | ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా జరుపుతున్న దాడులతో ఇరాన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ మరణంతో మధ్యప్రాచ్యంలో అగ్నిపర్వతం బద్దలైనట్లైంది. ఇరాన్ సైతం వెనక్కి తగ్గకుండా ప్రతిదాడులకు దిగుతుండటంతో ఈ పరిణామాలు ఇప్పుడు భారత్‌ను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఇజ్రాయెల్‌లోని అదానీకి చెందిన 'హైఫా పోర్ట్' తో పాటు, ఇరాన్‌లో భారత్ భారీగా పెట్టుబడులు పెట్టిన 'చాబహార్ పోర్ట్' కార్యకలాపాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దానికి తోడు చాబహార్ పోర్టుపై వైమానిక దాడులు జరిగినట్లు వస్తున్న వార్తలు మరింత కలకలం రేపుతున్నాయి.

ఇరాన్‌లో భారత్ భారీ పెట్టుబడులు

మధ్య ఆసియా దేశాలతో వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకునే వ్యూహంలో భాగంగా భారత్ ఇరాన్‌లోని చాబహార్ పోర్టులో సుమారు రూ.14,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా పోర్ట్ టెర్మినల్ అభివృద్ధి, సరుకు ఎగుమతి-దిగుమతుల కోసం భారీ క్రేన్ల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన కోసం సుమారు 120 మిలియన్ డాలర్లు (రూ.1100 కోట్లు) ప్రత్యక్షంగా ఖర్చు చేసింది. దీనికి అదనంగా ఇరాన్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు రవాణా మార్గాలను అభివృద్ధి చేయడానికి మరో 250 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.2100 కోట్లు) క్రెడిట్ లైన్‌ను కూడా అందించింది.

Middle East Crisis Will Iran-Israel Conflict Impact India Rs 14000 Crore Investment in Chabahar Port

చాబహార్ పోర్ట్ భారత్‌కు ఎందుకు అంత కీలకం?

ఈ పోర్ట్ భారత్‌కు కేవలం వాణిజ్యపరంగానే కాకుండా వ్యూహాత్మకంగా కూడా ఎంతో ముఖ్యం. దీని ద్వారా మూడు ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయి.

పాకిస్థాన్‌కు చెక్: భారత్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇతర మధ్య ఆసియా దేశాలకు సరుకు రవాణా చేయాలంటే పాకిస్థాన్ భూభాగం మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. చాబహార్ పోర్టుతో ఆ అవసరం తీరిపోయింది. పాకిస్థాన్‌ను బైపాస్ చేసి సరుకు రవాణా చేయవచ్చు.

ఆఫ్ఘనిస్తాన్‌తో డైరెక్ట్ ట్రేడ్: ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆఫ్ఘనిస్తాన్‌కు గోధుమలు, మందులు, నిర్మాణ సామగ్రి తదితరాలను భారత్ నేరుగా పంపగలుగుతోంది.

యూరప్‌కు షార్ట్ కట్: ఈ పోర్ట్ 'ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్' (INSTC)కి అనుసంధానమై ఉంది. దీని ద్వారా ఇరాన్, రష్యా మీదుగా యూరప్‌కు చాలా తక్కువ ఖర్చుతో, వేగంగా సరుకులను రవాణా చేసే అవకాశం ఏర్పడింది.

భారతీయులకు చేకూరే లాభాలు

చాబహార్ ప్రాజెక్ట్ అడ్డంకులు లేకుండా కొనసాగితే భారత్‌ నుంచి ఎగుమతులు భారీగా పెరుగుతాయి. కొత్త వ్యాపార అవకాశాలు పుట్టుకొస్తాయి. లాజిస్టిక్స్, పోర్ట్ రంగాల్లో వేలాది ఉద్యోగాలు లభిస్తాయి. ముఖ్యంగా దిగుమతుల వ్యయం తగ్గి, దీర్ఘకాలంలో భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది.

Middle East Crisis Will Iran-Israel Conflict Impact India Rs 14000 Crore Investment in Chabahar Port

బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయి?

2026–27 యూనియన్ బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు కొత్తగా నిధులు కేటాయించలేదు. అయితే, గతేడాది సవరించిన అంచనాల్లో మాత్రం ప్రాజెక్టు కొనసాగింపునకు మద్దతుగా సుమారు రూ.400 కోట్లు కేటాయించారు.

భవిష్యత్తుపై క్వశ్చన్ మార్క్!

ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌లో నాయకత్వ మార్పు జరిగితే, 2024లో భారత్ కుదుర్చుకున్న 10 ఏళ్ల చాబహార్ పోర్ట్ నిర్వహణ ఒప్పందంపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. కొత్త ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని ఎలా పరిగణిస్తుందనేది ఇప్పుడు కీలకంగా మారింది. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేసిన కఠిన ఆంక్షల కారణంగా ఇరాన్‌లో పెట్టుబడులు పెట్టిన దేశాలకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే భారతీయ వాణిజ్య ప్రయోజనాలకు గండిపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Middle East Crisis Will Iran-Israel Conflict Impact India Rs 14000 Crore Investment in Chabahar Port

Advertisement
Advertisement