త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Electric Air Taxis | న్యూయార్క్‌ గగనతలంలో అద్భుతం: జేఎఫ్‌కే ఎయిర్‌పోర్ట్ నుంచి మాన్‌హట్టన్‌కు కేవలం 7 నిమిషాల్లో ‘జోబీ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ’

ప్రముఖ ఏవియేషన్ సంస్థ 'జోబీ' న్యూయార్క్‌ నగరంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ (eVTOL) ట్రయల్స్‌ను విజయవంతంగా నిర్వహించింది. జేఎఫ్‌కే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మాన్‌హట్టన్‌కు ట్రాఫిక్ లేకుండా, ఎటువంటి శబ్ద, వాయు కాలుష్యం లేకుండా కేవలం ఏడు నిమిషాల్లో ప్రయాణించే అద్భుతమైన సదుపాయాన్ని అందుబాటులోకి తేనుంది.

J

International | Published On Apr 29, 2026, 3.52 pm IST

Electric Air Taxis | న్యూయార్క్‌ గగనతలంలో అద్భుతం: జేఎఫ్‌కే ఎయిర్‌పోర్ట్ నుంచి మాన్‌హట్టన్‌కు కేవలం 7 నిమిషాల్లో ‘జోబీ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ’
Advertisement

Electric Air Taxis | త్రినేత్ర.న్యూస్ : ట్రాఫిక్‌లో గంటల తరబడి ఎదురుచూసే ప్రయాణికులకు శుభవార్త. వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం లేని సరికొత్త ప్రయాణ అనుభూతిని అందించేందుకు కాలిఫోర్నియాకు చెందిన ఎలక్ట్రిక్ ఏవియేషన్ దిగ్గజం 'జోబీ ఏవియేషన్' (Joby Aviation) సిద్ధమైంది. న్యూయార్క్ నగర చరిత్రలోనే తొలిసారిగా పాయింట్-టు-పాయింట్ ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (eVTOL) ఎయిర్ ట్యాక్సీల డెమాన్‌స్ట్రేషన్ విమానాలను సంస్థ విజయవంతంగా పూర్తి చేసింది. న్యూయార్క్‌లోని ప్రస్తుత హెలీపోర్ట్ నెట్‌వర్క్‌ల ద్వారా వారం రోజుల పాటు సాగే ఈ ప్రతిష్టాత్మక ట్రయల్స్ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది.

గంటల ప్రయాణం.. ఇక 7 నిమిషాల్లోనే..

సాధారణంగా రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే న్యూయార్క్ నగరంలోని అత్యధిక ట్రాఫిక్‌ వల్ల సమయం భారీగా వృధా అవుతుంది. ఒక అంచనా ప్రకారం, 2025లో న్యూయార్క్‌లో ఒక సాధారణ ప్రయాణికుడు ట్రాఫిక్ రద్దీ కారణంగా ఏకంగా 102 గంటల విలువైన సమయాన్ని కోల్పోయాడు. కారులో జేఎఫ్‌కే (JFK) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మాన్‌హట్టన్ చేరుకోవడానికి గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది. అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ జోబీ ఎయిర్ ట్యాక్సీల ద్వారా ఈ ప్రయాణాన్ని కేవలం 7 నిమిషాలకు తగ్గించనున్నారు.

తాజాగా జరిగిన ట్రయల్స్ ప్రదర్శనలో జోబీకి చెందిన అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్ (N545JX) జేఎఫ్‌కే ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి మాన్‌హట్టన్‌, డౌన్‌టౌన్ స్కైపోర్ట్, వెస్ట్ 30వ స్ట్రీట్, ఈస్ట్ 34వ స్ట్రీట్ తదితర హెలీపోర్ట్‌లలో విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ టైమ్‌లో ఈ తరహా సాంకేతికత అందుబాటులోకి రావడం నిజంగా రవాణా రంగంలో ఒక విప్లవాత్మక అడుగు అని నిపుణులు భావిస్తున్నారు. "మేము 2023లో ఇక్కడ తొలిసారిగా విమానాన్ని నడిపాము. ఇప్పుడు న్యూయార్క్ ప్రజలకు శబ్దం, ఉద్గారాలు లేని సరికొత్త ఎయిర్ ట్యాక్సీ సేవలను ఎలా అందించబోతున్నామో ప్రాక్టికల్ గా చూపిస్తున్నాము" అని జోబీ వ్యవస్థాపకుడు, సీఈఓ జోబెన్ బెవిర్ట్ (JoeBen Bevirt) హర్షం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ మద్దతు.. భవిష్యత్తు రవాణాకు బాటలు

అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ మద్దతుతో, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఆధ్వర్యంలో చేపట్టిన eVTOL ఇంటిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్ (eIPP) కింద న్యూయార్క్ ఎంపిక కావడాన్ని పురస్కరించుకుని ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయి. పోర్ట్ అథారిటీ ఆఫ్ న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ, న్యూయార్క్ సిటీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NYCEDC) సహకారంతో ఎయిర్ ట్యాక్సీ సర్వీసులను వాణిజ్యపరంగా ప్రారంభించేందుకు అవసరమైన ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు.

ఉబర్, డెల్టా భాగస్వామ్యంతో

డెల్టా ఎయిర్ లైన్స్, ఉబర్‌ (Uber) వంటి దిగ్గజ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్న జోబీ.. ప్రయాణికులకు ఇంటి నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు, అక్కడినుంచి గమ్యస్థానానికి ఎలాంటి అసౌకర్యం లేని (seamless) ప్రయాణ అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రూపొందించబడిన ఈ ఎయిర్ క్రాఫ్ట్, సాధారణ హెలికాప్టర్ల కంటే చాలా తక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తూ, నగర వాతావరణంలో కలిసిపోయేలా డిజైన్ చేయబడింది. వందేళ్ల అమెరికా పండుగను పురస్కరించుకుని 'ఎలక్ట్రిక్ స్కైస్ టూర్ 2026' పేరిట ఈ ఫ్లైట్ క్యాంపెయిన్ కొనసాగుతోంది. భవిష్యత్తులో ఈ ఎయిర్ ట్యాక్సీలు సామాన్యుల ప్రయాణ కష్టాలను పూర్తిగా దూరం చేయనున్నాయి.

Advertisement
Advertisement