త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BrahMos Missile Export | డ్రాగన్‌కు చెక్: వియత్నాం, ఇండోనేషియాలకు భారత్ ‘బ్రహ్మోస్’ మిస్సైల్స్.. దీని స్పెషాలిటీ ఏంటంటే?

దక్షిణ చైనా సముద్రంలో చైనాకు చెక్ పెట్టేందుకు ఇండియా మాస్టర్ ప్లాన్. అత్యంత వేగవంతమైన 'బ్రహ్మోస్' క్షిపణులను వియత్నాం, ఇండోనేషియాలకు ఎగుమతి చేయనున్న భారత్.

J

International | Published On May 31, 2026, 3.53 pm IST

BrahMos Missile Export | డ్రాగన్‌కు చెక్: వియత్నాం, ఇండోనేషియాలకు భారత్ ‘బ్రహ్మోస్’ మిస్సైల్స్.. దీని స్పెషాలిటీ ఏంటంటే?
Advertisement
  • భారత్ తయారు చేసిన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ 'బ్రహ్మోస్' కొనుగోలుకు వియత్నాంతో డీల్ 
  • ఇండోనేషియాతో కూడా బ్రహ్మోస్ ఎగుమతికి సంబంధించిన ఒప్పందం దాదాపు ఫైనల్ స్టేజ్‌లో ఉన్నట్లు రక్షణ శాఖ వెల్లడి
  • 2022లో తొలిసారిగా ఫిలిప్పీన్స్ ఈ క్షిపణులను కొనుగోలు చేయగా.. ఇప్పుడు వరుసగా ఆసియా దేశాలు క్యూ 
  • శబ్దం కంటే మూడు రెట్లు వేగంగా దూసుకెళ్లే (Mach 3) ఈ క్షిపణుల రాకతో దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యానికి బ్రేక్ 

BrahMos Missile Export | త్రినేత్ర.న్యూస్ : స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ (BrahMos) సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్స్‌కు అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఏర్పడుతోంది. తాజాగా ఈ క్షిపణులను వియత్నాంకు ఎగుమతి చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకోగా, ఇండోనేషియాతో కూడా ఇలాంటి డీల్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. సింగపూర్‌లో జరిగిన షాంగ్రి-లా డైలాగ్ సెక్యూరిటీ సమ్మిట్‌లో పాల్గొన్న భారత రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ఈ కీలక విషయాలను వెల్లడించారు.

ఫైనల్ అయిన భారీ డీల్స్

వియత్నాంతో బ్రహ్మోస్ డీల్ ఇప్పటికే పూర్తయిందని, అధికారికంగా ప్రకటించాల్సి ఉందని రక్షణ కార్యదర్శి తెలిపారు. సుమారు రూ. 5,800 కోట్ల విలువైన ఈ ఒప్పందంలో కోస్టల్ డిఫెన్స్ మిస్సైల్ బ్యాటరీలు, తొలి విడత క్షిపణులు, ట్రైనింగ్, లాజిస్టిక్స్ సపోర్ట్ ఉన్నాయి. భవిష్యత్తులో గాలిలో నుంచి ప్రయోగించే బ్రహ్మోస్ వెర్షన్‌ను కూడా వియత్నాం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కాగా, 2022లో దాదాపు 375 మిలియన్ డాలర్ల డీల్‌తో బ్రహ్మోస్ మిస్సైల్ సిస్టమ్‌ను కొనుగోలు చేసిన తొలి విదేశీ కొనుగోలుదారుగా ఫిలిప్పీన్స్ రికార్డు సృష్టించింది. త్వరలో ఇండోనేషియా కూడా ఈ లిస్టులో చేరనుంది.

బ్రహ్మోస్ ఎందుకంత స్పెషల్?

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి. ఇది దాదాపు మాక్ 3 (Mach 3) వేగంతో, అంటే శబ్దం కంటే మూడు రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది. ఈ మిస్సైల్‌ను గాలి, సముద్రం లేదా భూమి మీద నుంచి ఎక్కడినుంచైనా ప్రయోగించవచ్చు. దీని అద్భుతమైన వేగం, కచ్చితత్వం శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాయి. సముద్ర భద్రత (Maritime Security)పై ఆందోళన చెందుతున్న దేశాలకు శత్రు నౌకలను లేదా కీలకమైన మిలిటరీ స్థావరాలను క్షణాల్లో ధ్వంసం చేసే బ్రహ్మోస్ ఒక బెస్ట్ ఆప్షన్‌గా మారింది.

దక్షిణ చైనా సముద్రంలో చైనాకు చెక్

దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ డీల్స్ జరగడం వ్యూహాత్మకంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ సముద్రంలోని ఎక్కువ భాగాన్ని చైనా తమదేనని వాదిస్తుండగా, వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు డ్రాగన్ ఆధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు ఆయా దేశాల చేతికి బ్రహ్మోస్ అస్త్రాలు రావడం చైనాకు గట్టి ఎదురుదెబ్బే.

2020 గాల్వాన్ వ్యాలీ ఘర్షణ తర్వాత, చైనాకు చెక్ పెడుతూ ఈ ప్రాంతంలో తన ఉనికిని, ప్రభావాన్ని పెంచుకోవాలని ఇండియా పక్కా మాస్టర్ ప్లాన్‌తో ముందుకెళ్తోంది. మలేషియా, థాయ్‌లాండ్ కూడా బ్రహ్మోస్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత డిఫెన్స్ ఎగుమతులు రికార్డ్ స్థాయికి చేరుకోగా.. 2030 నాటికి వీటిని ఏకంగా రూ. 50,000 కోట్లకు పెంచాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది.

Advertisement
Advertisement