త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bangladesh General Elections : బంగ్లాదేశ్ ఎన్నికల్లో ‘బీజేపీ’ బోణీ: ఒక్క సీటు గెలుచుకున్న పార్టీ.. ఎవరీ ఆందలిబ్ రెహమాన్?

బంగ్లాదేశ్ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామం. అక్కడ కూడా 'బీజేపీ' (BJP) ఖాతా తెరిచింది. అయితే ఇది మన భారతీయ పార్టీ కాదు. బంగ్లాదేశ్ జాతీయ పార్టీ. భోలా-1 స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు.

J

International | Published On Feb 14, 2026, 10.00 pm IST

Bangladesh General Elections : బంగ్లాదేశ్ ఎన్నికల్లో ‘బీజేపీ’ బోణీ: ఒక్క సీటు గెలుచుకున్న పార్టీ.. ఎవరీ ఆందలిబ్ రెహమాన్?
Advertisement

Bangladesh General Elections : త్రినేత్ర.న్యూస్ : బంగ్లాదేశ్‌లో జరిగిన 13వ సాధారణ ఎన్నికల ఫలితాల్లో (Bangladesh Elections) ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్నికల ఫలితాల జాబితాలో 'బీజేపీ' (BJP) పేరు కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, ఈ బీజేపీకి మన భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఇది 'బంగ్లాదేశ్ జాతీయ పార్టీ' (Bangladesh Jatiya Party). ఈ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు.

భోలా-1లో విజయం

బంగ్లాదేశ్ జాతీయ పార్టీ (బీజేపీ) చైర్మన్ ఆందలిబ్ రెహమాన్ పార్థో (Andaleeve Rahman Partho) భోలా-1 నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ అభ్యర్థి ఎండీ నజ్రుల్ ఇస్లాంను ఓడించారు. ఆందలిబ్ రెహమాన్ పార్థో (బీజేపీ)కి 1,05,543 ఓట్లు రాగా, ఎండీ నజ్రుల్ ఇస్లాం (జమాత్) కి 75,337 ఓట్లు వచ్చాయి.

BJP Wins 1 Seat in Bangladesh General Elections Andaleeve Rahman Partho Wins Bhola-1

బీఎన్‌పీ కూటమి హవా

ఎన్నికల సంఘం (EC) ప్రకటించిన 297 స్థానాల ఫలితాల ప్రకారం, మాజీ ప్రధాని దివంగత ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. బీఎన్‌పీ (BNP) కూటమి మొత్తం 212 సీట్లు సాధించింది. ఇందులో బీఎన్‌పీ సొంతంగా 209 సీట్లు గెలుచుకుంది. మిత్రపక్షాలైన గణసంహతి ఆందోళన్, గణో అధికార పరిషత్, బీజేపీ (బంగ్లాదేశ్ జాతీయ పార్టీ) తలా ఒక సీటును గెలుచుకున్నాయి. మరోవైపు జమాతే ఇస్లామీ కూటమి 77 సీట్లను కైవసం చేసుకుంది.

ఎవరీ ఆందలిబ్ రెహమాన్ పార్థో?

ఆందలిబ్ రెహమాన్ పార్థో కేవలం రాజకీయ నాయకుడే కాదు, ఆయన ఒక విద్యావేత్త, న్యాయవాది కూడా. ఢాకాలోని 'బ్రిటిష్ స్కూల్ ఆఫ్ లా'కు ఆయన ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి, భోలా-1 మాజీ ఎంపీ నాజియుర్ రెహమాన్ మంజు కుమారుడే ఈ పార్థో. 2008లో తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన, 9వ సాధారణ ఎన్నికల్లో అవామీ లీగ్ అభ్యర్థి యూసుఫ్ హొస్సేన్‌పై గెలిచి పార్లమెంటుకు ఎంపికయ్యారు. 2009 నుంచి 2014 వరకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు.

హామీల వర్షం

ఎన్నికలకు ముందు పార్థో తన నియోజకవర్గ ప్రజలకు పలు కీలక హామీలు ఇచ్చారు. భోలా ప్రాంతాన్ని దక్షిణ బంగ్లాదేశ్‌లోనే అత్యంత ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతానని మాటిచ్చారు. బీఎన్‌పీ నేత తారిఖ్ రెహమాన్‌కు భోలా ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ ఉందని, కూటమి అధికారంలోకి వస్తే సుస్థిర అభివృద్ధి ఖాయమని పార్థో పేర్కొన్నారు.

Advertisement
Advertisement