త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DDH Renova Cancer Hospital Hyderabad | వైద్యమా? వ్యాపారమా?: రెనోవ ఆసుపత్రిలో మహిళ మృతి.. ప్రశ్నిస్తే బౌన్సర్లతో బెదిరింపులు?

హైదరాబాద్‌లోని విద్యానగర్ DDH రెనోవ క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ యువతి.. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు.

J

Hyderabad | Published On Feb 5, 2026, 4.08 pm IST

DDH Renova Cancer Hospital Hyderabad | వైద్యమా? వ్యాపారమా?: రెనోవ ఆసుపత్రిలో మహిళ మృతి.. ప్రశ్నిస్తే బౌన్సర్లతో బెదిరింపులు?
Advertisement

DDH Renova Cancer Hospital Hyderabad | త్రినేత్ర.న్యూస్ : కార్పొరేట్ వైద్యం పేరిట సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఘటనలు నగరంలో నిత్యకృత్యమవుతున్నాయి. తాజాగా నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యానగర్‌లోని ‘DDH రెనోవ క్యాన్సర్ ఆసుపత్రి’ (DDH Renova Cancer Hospital)లో చోటుచేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది.

అసలేం జరిగింది?

నారాయణపేట జిల్లా, లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బి. ప్రియాంక (31) గత కొంతకాలంగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆమెను విద్యానగర్‌లోని రెనోవ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, ఇటీవల కీమోథెరపీలో భాగంగా వైద్యులు ఆమెకు ఒక ఖరీదైన ఇంజక్షన్ ఇచ్చారు. ఆ ఇంజక్షన్ వికటించడంతోనే ప్రియాంక పరిస్థితి విషమించి, ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యులు సమయానికి స్పందించకపోవడం వల్లే ఆమె చనిపోయిందని వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ప్రశ్నిస్తే బౌన్సర్లతో దాడులా?

తమ బిడ్డ మృతికి కారణమైన వైద్యులను నిలదీసేందుకు ప్రయత్నించిన కుటుంబ సభ్యులకు ఆసుపత్రి యాజమాన్యం నుంచి చేదు అనుభవం ఎదురైంది. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంటే.. ఆసుపత్రి వర్గాలు బౌన్సర్లను రంగంలోకి దింపి బెదిరింపులకు పాల్పడ్డారని బాధితులు వాపోతున్నారు. ఆసుపత్రి వద్ద భారీగా బౌన్సర్లను మోహరించి, తమను లోపలికి వెళ్లనీయకుండా, కనీసం ప్రశ్నించనీయకుండా అడ్డుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

డబ్బులే లక్ష్యం.. మానవత్వం శూన్యం

ఈ ఆసుపత్రిపై గతంలోనూ అనేక ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స విషయం పక్కన పెడితే, రోగులు లేదా వారి బంధువులు డాక్టర్లను కలవాలన్నా, చిన్న అనుమానం నివృత్తి చేసుకోవాలన్నా రూ.300 ఫీజు కట్టాల్సిందేనని బాధితులు చెబుతున్నారు. గతంలోనూ ఇక్కడ వైద్య నిర్లక్ష్యం కేసులు జరిగాయని, కానీ ప్రైవేట్ ఏజెన్సీలను వాడి ఆ వార్తలు బయటకు రాకుండా తొక్కిపెట్టారని ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వం స్పందించేది ఎప్పుడు?

చికిత్స పేరుతో లక్షల్లో వసూలు చేస్తూ, ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వని ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ప్రియాంక మృతిపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులైన వైద్యులపై, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక నిండు ప్రాణం పోయింది.. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా? లేక విచారణ పేరుతో కాలయాపన చేస్తారా? అనేది వేచి చూడాలి.

[video width="636" height="848" mp4="https://axdxht1orlhu.compat.objectstorage.ap-hyderabad-1.oraclecloud.com/static.trinethra/wp-content/uploads/2026/02/WhatsApp-Video-2026-02-05-at-10.50.24.mp4"][/video]

 

Advertisement
Advertisement