త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Moinabad ACB Trap | ఏసీబీ మెరుపు దాడి: నిర్మాణదారుడిని బెదిరించి రూ.75 వేలు లంచం.. టీపీవో, సీనియర్ అసిస్టెంట్ అరెస్ట్

నిర్మాణాన్ని అక్రమ కట్టడంగా చూపించి కూల్చేస్తామని బెదిరింపులు.. రూ.75 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్

J

Hyderabad | Published On Sep 30, 2026, 8.08 pm IST

Moinabad ACB Trap | ఏసీబీ మెరుపు దాడి: నిర్మాణదారుడిని బెదిరించి రూ.75 వేలు లంచం.. టీపీవో, సీనియర్ అసిస్టెంట్ అరెస్ట్

సంక్షిప్త సారాంశం

మొయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (TPO) గుండు వాణి, సీనియర్ అసిస్టెంట్ ఎలమోని సుదర్శన్ ఏసీబీ వలలో చిక్కారు. బాధితుడి నిర్మాణాన్ని అక్రమ కట్టడంగా పరిగణించి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు వీరు రూ.75,000 లంచం డిమాండ్ చేశారు. బాధిత ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా సిటీ రేంజ్-2 ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదుతో పాటు ఇద్దరు నిందితులను నాంపల్లి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌‌కు తరలించారు.

Advertisement

Moinabad ACB Trap | త్రినేత్ర న్యూస్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అవినీతి అధికారుల గుట్టు రట్టయింది. అక్రమ నిర్మాణం పేరిట చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.75,000 లంచం తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణి, సీనియర్ అసిస్టెంట్ ఎలమోని సుదర్శన్‌లు బుధవారం అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

ఏసీబీ సిటీ రేంజ్-2 అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధితుడు చేపట్టిన భవన నిర్మాణాన్ని అక్రమ నిర్మాణంగా చూపిస్తూ కూల్చివేత చర్యలు తీసుకుంటామని సదరు అధికారులు బెదిరింపులకు దిగారు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండాలంటే రూ.75 వేలు ముట్టజెప్పాలని డిమాండ్ చేశారు.

వ్యూహాత్మకంగా వలపన్ని పట్టుకున్న ఏసీబీ

లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాడు. పథకం ప్రకారం రంగంలోకి దిగిన ఏసీబీ సిటీ రేంజ్-2 బృందం.. బుధవారం బాధితుడి వద్ద నుంచి సీనియర్ అసిస్టెంట్ ఎలమోని సుదర్శన్ ద్వారా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణి రూ.75,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

నిందితుడైన సుదర్శన్ వద్ద నుంచి లంచం మొత్తాన్ని అధికారులు రికవరీ చేశారు. తమ అధికార విధులను దుర్వినియోగం చేస్తూ బాధితుడిని వేధించి అనుచిత లబ్ధి పొందేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తేల్చారు.

నాంపల్లి కోర్టులో హాజరు.. జ్యుడీషియల్ రిమాండ్

అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి, నాంపల్లిలోని స్పెషల్ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఫిర్యాదుదారుడి భద్రతా కారణాల దృష్ట్యా అతని వివరాలను గోప్యంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.

ప్రభుత్వ అధికారులు ఎవరైనా పనుల కోసం లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 లేదా వాట్సప్ నెంబర్ 9440446106 ద్వారా నేరుగా సంప్రదించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లంచం అడిగే అధికారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement
Advertisement