త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad to Mumbai Bullet Train | హైదరాబాద్ టు ముంబై జస్ట్ 3 గంటలే: రెడీ అయిన ‘బుల్లెట్ రైలు’ కారిడార్ డీపీఆర్

హైదరాబాద్ నుంచి ముంబై ప్రయాణం ఇక కేవలం 3 గంటలే! 300 కి.మీ వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైలు ప్రాజెక్టు సర్వే పూర్తి. తెలంగాణలో కోకాపేట, వికారాబాద్‌లలో భారీ స్టేషన్లను నిర్మించనున్నారు.

J

Hyderabad | Published On May 18, 2026, 6.06 pm IST

Hyderabad to Mumbai Bullet Train | హైదరాబాద్ టు ముంబై జస్ట్ 3 గంటలే: రెడీ అయిన ‘బుల్లెట్ రైలు’ కారిడార్ డీపీఆర్
Advertisement

Hyderabad to Mumbai Bullet Train | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ (Hyderabad) నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai) వెళ్లాలంటే ప్రస్తుతం రోడ్డు మార్గంలో దాదాపు 12 గంటలు, రైలు ప్రయాణానికి 15 గంటల సమయం పడుతోంది. కానీ, త్వరలోనే ఈ సుదీర్ఘ ప్రయాణం కేవలం మూడు గంటలకు తగ్గిపోనుంది! అవును, గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే హైదరాబాద్ - పుణె - ముంబై 'హై-స్పీడ్ రైల్ కారిడార్' (High-Speed Rail Corridor) ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే పూర్తయిందని, డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) కూడా ఖరారైందని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా సమాచారం అందించింది.

3 రాష్ట్రాలు.. 671 కిలోమీటర్లు

తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల మీదుగా సాగే ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు 671 కి.మీ. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 457 కి.మీ (68%), కర్ణాటకలో 121 కి.మీ (18%), తెలంగాణలో 93 కి.మీ (14%) ట్రాక్ ఉండనుంది. ఈ ట్రాక్ నిర్మాణం పూర్తయ్యాక, బుల్లెట్ రైలులో హైదరాబాద్ నుంచి ముంబైకి కనీసం 2 గంటల 55 నిమిషాలు, గరిష్టంగా 3 గంటల 13 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో తొమ్మిది రాష్ట్రాల్లో ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించగా, అందులో మూడు హైదరాబాద్ నుంచే ఉండటం విశేషం (చెన్నై, బెంగళూరు, ముంబై). ఇందులో ముంబై కారిడార్ DPR ఇప్పటికే పూర్తయింది.

సొరంగాలు, నదులపై భారీ బ్రిడ్జిలు

ఈ ప్రాజెక్టు ఇంజనీరింగ్ పరంగా ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించనుంది. హైదరాబాద్ మెట్రో తరహాలో పిల్లర్లపై (Elevated tracks) ఈ హై-స్పీడ్ ట్రాక్ నిర్మిస్తారు. పశ్చిమ కనుమలు (Western Ghats), కొండల గుండా వెళ్లే ఈ మార్గంలో ఏకంగా 101 బ్రిడ్జిలు (నదులపై 29 భారీ వంతెనలు) నిర్మించనున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలోని ఖండాలా ఘాట్ సెక్షన్‌లో 24 కి.మీ పొడవున 13 చోట్ల సొరంగాలు (Tunnels) తవ్వనున్నారు. ములా-ముఠా, భీమా, బోరి లాంటి ప్రధాన నదులపై భారీ వంతెనలు రాబోతున్నాయి. వికారాబాద్ సమీపంలో కూడా 4-5 కి.మీ మేర చిన్న సొరంగం నిర్మించే ప్లాన్ ఉంది.

తెలంగాణలో స్టేషన్లు ఎక్కడంటే?

ఈ మార్గంలో మొత్తం 12 స్టేషన్లు ప్రతిపాదించారు.

తెలంగాణ: వికారాబాద్, కోకాపేట

కర్ణాటక: కలబురగి.

మహారాష్ట్ర: విక్రోలి, థానే, నవీ ముంబై, లోనావాలా, పింప్రి-చించ్వాడ్, పుణె, బారామతి, పండర్‌పూర్, సోలాపూర్.

ప్రతి స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఒక్కో స్టేషన్ (Station complex), పార్కింగ్, ఇతర సౌకర్యాల కోసం సుమారు 247 ఎకరాల స్థలం అవసరమని NHSRCL అంచనా వేసింది. కోకాపేట స్టేషన్.. మెట్రో, ఔటర్ రింగ్ రోడ్డుకు (ORR) దగ్గరగా ఉండగా, శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో భారీ హబ్ రానుంది. స్థల సేకరణపై NHSRCL అధికారులు ఇప్పటికే తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతో చర్చలు జరిపారు.

ఒక్కో రైలులో 1215 మందికి ఛాన్స్

ఈ బుల్లెట్ రైలులో (Bullet train) 16 కోచ్‌లు ఉంటాయి. ఒకేసారి 1,215 మంది ప్రయాణించవచ్చు. మొదటి ఏడాది రోజూ సుమారు 63 వేల మంది ప్రయాణిస్తారని, 2061 నాటికి ఆ సంఖ్య లక్షన్నరకు చేరుతుందని అంచనా. రైళ్ల మెయింటెనెన్స్ కోసం మహారాష్ట్రలోని థానే, మన హైదరాబాద్‌లో భారీ డిపోలు (Depots) ఏర్పాటు చేయనున్నారు. ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ ముంబైలో ఉంటుంది.

దాదాపు రూ. 2 లక్షల కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించి, భూసేకరణ (Land acquisition), నిధుల మంజూరు అన్నీ సజావుగా సాగితే 2027 చివర్లో లేదా 2028లో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రాబోయే 6-8 ఏళ్లలో ఈ బుల్లెట్ రైలు పట్టాలెక్కొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్.. దక్షిణ, పశ్చిమ భారతదేశానికి ఒక ప్రధాన 'ట్రాన్సిట్ హబ్‌'గా (Transit hub) మారడం ఖాయం.

Advertisement
Advertisement