త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad Snakes Study | హైదరాబాద్‌లో పాముల టెన్షన్: ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి? CCMB స్టడీలో ఆసక్తికర విషయాలు!

భాగ్యనగరంలో పాముల సంచారం కలకలం రేపుతోంది. సీసీఎంబీ (CCMB) జరిపిన పదేళ్ల అధ్యయనంలో నగరవాసులను అలర్ట్ చేసే పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

J

Hyderabad | Published On May 6, 2026, 8.00 pm IST

Hyderabad Snakes Study | హైదరాబాద్‌లో పాముల టెన్షన్: ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి? CCMB స్టడీలో ఆసక్తికర విషయాలు!
Advertisement
  • హైదరాబాద్‌లో పాముల సంచారంపై సీసీఎంబీ (CCMB), ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీల (FOS) కీలక అధ్యయనం
  • పదేళ్లలో 55 వేల పాములను పట్టుకున్న రెస్క్యూ టీమ్స్; వీటిలో 54% విషపూరితమైనవే
  • నగరంలో అత్యధికంగా కనిపిస్తున్న నాగుపాములు, జెర్రిపోతులు
  • కొత్తగా డెవలప్ అవుతున్న శివారు ప్రాంతాల్లోనే (Outskirts) పాముల బెడద ఎక్కువ

Hyderabad Snakes Study | త్రినేత్ర.న్యూస్ : వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ (Hyderabad) నగరంలో మనుషులతో పాటు పాముల సంచారం కూడా పెరుగుతోంది. ఖాళీ స్థలాలు కాంక్రీట్ జంగిల్స్‌గా మారుతుండటంతో పాములు తరచూ జనవాసాల్లోకి వచ్చేస్తున్నాయి. నగరాల్లో పాములు ఎలా బతుకుతున్నాయి? ఎప్పుడు, ఎక్కడ ఎక్కువగా కనిపిస్తాయి? అనే దానిపై హైదరాబాద్‌లోని సీసీఎంబీ (CCMB) శాస్త్రవేత్తలు, 'ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ' తో కలిసి జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

పదేళ్లలో 55 వేల పాములు పట్టివేత

2013 నుండి 2022 వరకు, ఈ పదేళ్ల కాలంలో నగరంలో పట్టుబడిన దాదాపు 55,000 పాముల డేటాను నిపుణులు విశ్లేషించారు. నగరంలో కనిపిస్తున్న పాములలో 76 శాతం కేవలం రెండు రకాలే ఉంటున్నాయి. అందులో ఒకటి అత్యంత ప్రమాదకరమైన నాగుపాము (Cobra) కాగా, రెండోది విషం లేని జెర్రిపోతు (Rat snake). ఈ రెండు జాతులు నగర వాతావరణానికి, ఇక్కడి పరిస్థితులకు బాగా అలవాటు పడిపోయాయని పరిశోధకులు గుర్తించారు.

శివారు ప్రాంతాలే హాట్‌స్పాట్స్ (Hotspots)

ఐటీ, రియల్ ఎస్టేట్ (Real estate) బూమ్ కారణంగా నగరం నలువైపులా శరవేగంగా విస్తరిస్తోంది. అందుకే సిటీ సెంటర్ కంటే.. కొత్తగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాల్లో (Outer areas) పాముల సంచారం ఎక్కువగా ఉన్నట్లు ఈ స్టడీలో తేలింది. ఏటా పాములు తారసపడే ఘటనలు 8-10% మేర పెరుగుతుండటం గమనార్హం. ముఖ్యంగా వర్షాకాలంలో (Monsoon), అందులోనూ అక్టోబర్ నెలలో ఇవి ఎక్కువగా బయటకు వస్తున్నాయి. వాతావరణం చల్లగా ఉండటం, ఇది వాటి సంతానోత్పత్తి సమయం కావడమే ఇందుకు ప్రధాన కారణం.

చంపకండి.. రెస్క్యూ టీమ్స్‌కు కాల్ చేయండి

నమోదైన ఘటనల్లో 54% విషపూరితమైన పాములే కావడంతో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, పాములను చూసిన వెంటనే భయపడి చంపేయకూడదని సూచిస్తున్నారు. పాములు ఎలుకలను తిని వాటి సంఖ్యను నియంత్రిస్తాయి. ఒకవేళ పాములు లేకపోతే నగరంలో ఎలుకల వల్ల వచ్చే ప్రాణాంతక రోగాలు పెరిగే ముప్పు ఉంది. కాబట్టి, ఇళ్లలోకి పాములు వస్తే వెంటనే 'ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్' (FOS) లాంటి రెస్క్యూ టీమ్స్ సహాయం తీసుకోవడం సురక్షితం.

Advertisement
Advertisement