త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Digital Arrest Scam Hyderabad | డిజిటల్ అరెస్ట్ దడ: హైదరాబాద్ వృద్ధుడి నుంచి రూ.1.07 కోట్లు లూటీ – ఢిల్లీలో సూత్రధారి అరెస్ట్

"మీ ఆధార్ కార్డుతో మనీ లాండరింగ్ జరిగింది.. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం" అంటూ వీడియో కాల్ చేసి ఓ వృద్ధుడి నుంచి ఏకంగా రూ. 1.07 కోట్లు కాజేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ భారీ మోసం వెనుక ఉన్న ఢిల్లీ లింక్‌ను పోలీసులు ఎలా ఛేదించారు? అసలేంటి ఈ డిజిటల్ అరెస్ట్?

J

Hyderabad | Published On Feb 4, 2026, 6.25 pm IST

Digital Arrest Scam Hyderabad | డిజిటల్ అరెస్ట్ దడ: హైదరాబాద్ వృద్ధుడి నుంచి రూ.1.07 కోట్లు లూటీ – ఢిల్లీలో సూత్రధారి అరెస్ట్
Advertisement

Digital Arrest Scam Hyderabad | త్రినేత్ర.న్యూస్ : సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో రెచ్చిపోతున్నారు. సామాన్యులే కాదు, విద్యావంతులను సైతం 'డిజిటల్ అరెస్ట్' పేరుతో బెంబేలెత్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ వృద్ధుడిని భయభ్రాంతులకు గురిచేసి ఏకంగా రూ. 1 కోటి 7 లక్షలు కాజేసిన అంతర్రాష్ట్ర ముఠా గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు.

అసలేం జరిగింది?

గత ఏడాది అక్టోబర్‌లో హైదరాబాద్‌కు చెందిన 62 ఏళ్ల వ్యక్తికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తులు తాము "ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులం" అని పరిచయం చేసుకున్నారు. "మీ ఆధార్ కార్డు ఉపయోగించి భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది. ఈ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం," అని బెదిరించారు.

అంతటితో ఆగకుండా, బాధితుడిని వీడియో కాల్ (Skype/WhatsApp) ద్వారా కనెక్ట్ అయి ఉండాలని ఆదేశించారు. దీన్నే 'డిజిటల్ అరెస్ట్'గా నమ్మించారు. ఆ వృద్ధుడు ఇంట్లో నుంచి కదలకూడదని, ఎవరితోనూ మాట్లాడకూడదని హుకూం జారీ చేశారు. అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే తమ అకౌంట్‌లో డబ్బు డిపాజిట్ చేయాలని ఒత్తిడి చేశారు. భయపడిపోయిన బాధితుడు విడతల వారీగా రూ. 1,07,00,000 (కోటి ఏడు లక్షలు) వారు చెప్పిన ఖాతాలకు బదిలీ చేశారు. చివరకు మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.

ఢిల్లీలో కదిలిన డొంక

బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. ఈ డబ్బు ఢిల్లీకి చెందిన ఖాతాల్లోకి మళ్లినట్లు గుర్తించారు. డీసీపీ వి. అరవింద్ బాబు ఆదేశాల మేరకు, ఏసీపీ ఆర్.జి. శివ మారుతి పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ కె. ప్రసాదరావు బృందం ఢిల్లీకి వెళ్లి ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు గురుదీప్ సింగ్ అలియాస్ లక్కీ నారంగ్ (42) ను అరెస్ట్ చేశారు.

నిందితుడి నేపథ్యం ఇదే..

గురుదీప్ సింగ్ ఢిల్లీలో ట్రావెల్స్, మనీ ఎక్స్ఛేంజ్ వ్యాపారం చేస్తుంటాడు. ఇతడు ప్రధాన నేరగాళ్లకు (Kingpins) సహకరిస్తూ, అమాయకుల పేర్లతో బ్యాంక్ ఖాతాలను (Mule Accounts) తెరిపించి, మోసపూరిత డబ్బును అందులో వేయించి కమీషన్ తీసుకుంటుంటాడు. ఈ కేసులో ఇప్పటికే దీపక్ గెహ్లావత్, ప్రశాంత్ కుమార్ అనే మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రజలకు పోలీసుల హెచ్చరిక (Alert)

డిజిటల్ అరెస్ట్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ అరవింద్ బాబు సూచించారు.

అరెస్టులు వీడియో కాల్‌లో ఉండవు: ఏ దర్యాప్తు సంస్థ (CBI, ED, Police) అయినా వీడియో కాల్ ద్వారా విచారణ జరపదు లేదా అరెస్ట్ చేయదు.

డబ్బు అడగరు: కేసు మాఫీ చేస్తామని పోలీసులు ఎప్పుడూ డబ్బులు అడగరు.

ఆధార్ బెదిరింపులు: మీ ఆధార్‌తో నేరాలు జరిగాయని వచ్చే కాల్స్‌ను నమ్మవద్దు.

హెల్ప్‌లైన్: ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.

Advertisement
Advertisement