త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad Fake Ghee Racket Busted | హైదరాబాద్‌లో భారీ కల్తీ నెయ్యి దందా గుట్టురట్టు.. బంజారాహిల్స్‌లో రూ.18 లక్షల సరుకు సీజ్!

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పరిధిలో అక్రమంగా కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ‘ప్రైడ్ డెయిరీ’పై పోలీసుల టాస్క్ ఫోర్స్, మాసబ్ ట్యాంక్ పోలీసులు సంయుక్త దాడి చేశారు. పామాయిల్, డాల్డాతో నెయ్యి తయారు చేస్తున్నట్లు గుర్తించి.. సుమారు రూ. 18 లక్షల విలువైన 460 కిలోల కల్తీ నెయ్యి, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. డెయిరీ యజమానిని అరెస్ట్ చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

J

Hyderabad | Published On Mar 4, 2026, 8.26 pm IST

Hyderabad Fake Ghee Racket Busted | హైదరాబాద్‌లో భారీ కల్తీ నెయ్యి దందా గుట్టురట్టు.. బంజారాహిల్స్‌లో రూ.18 లక్షల సరుకు సీజ్!
Advertisement

Hyderabad Fake Ghee Racket Busted | త్రినేత్ర.న్యూస్ : ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న భారీ కల్తీ నెయ్యి దందా హైదరాబాద్‌లో వెలుగుచూసింది. బంజారాహిల్స్ పరిధిలోని భోలానగర్ (రోడ్ నంబర్ 12)లో అక్రమంగా నడుస్తున్న "ప్రైడ్ డెయిరీ" (Pride Dairy) కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై సిటీ పోలీస్ కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ (గోల్కొండ టీమ్), మాసబ్ ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున కల్తీ నెయ్యి, తయారీ సామగ్రిని సీజ్ చేసి యూనిట్ యజమానిని అరెస్ట్ చేశారు.

కల్తీ నెయ్యి తయారీ ఇలా

నిందితుడు మొహమ్మద్ జునైద్ హుస్సేన్ (26) డెయిరీ వ్యాపారానికి లైసెన్స్ తీసుకుని, దానికి ముసుగుగా ఈ కల్తీ దందాకు తెరతీశాడు. తక్కువ ధరకు వచ్చే పామాయిల్, వనస్పతి (డాల్డా), ఇతర హానికరమైన పదార్థాలను ఆవు, గేదె మీగడలో కలిపి 'స్వచ్ఛమైన నెయ్యి'గా మారుస్తున్నాడు. ఇలా తయారు చేసిన కల్తీ నెయ్యిని అసలైనదిగా నమ్మిస్తూ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, సాధారణ ప్రజలకు అమ్ముతూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.

సీజ్ చేసిన వస్తువుల వివరాలు ఇవే

ఈ దాడిలో పోలీసులు మొత్తం రూ.18,26,679 విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ప్రధానంగా 460 కేజీల కల్తీ నెయ్యి, 70 కేజీల కల్తీ మిశ్రమ నెయ్యి, కల్తీకి వినియోగిస్తున్న 2090 కేజీల ఆవు మీగడ, 1170 కేజీల గేదె మీగడ, 28 డబ్బాల రుచి గోల్డ్ డాల్డా (ఒక్కో డబ్బా 15 కేజీలు), వాడిన ఆయిల్ ప్యాకెట్లు, 2 బాయిలర్లు, పుషింగ్ మిషన్, ప్యాకింగ్ మిషన్, రెండు వెయిటింగ్ మిషన్లు, 4 గ్యాస్ సిలిండర్లు, నెయ్యి నిల్వ ఉంచిన సుమారు 70 రకాల చిన్న, పెద్ద బేసన్లు, ఖాళీ డ్రమ్ములు, ప్యాకింగ్ కవర్లు ఉన్నాయి.

కేసు నమోదు.. దర్యాప్తు ముమ్మరం

ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తున్న డెయిరీ యజమాని మొహమ్మద్ జునైద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం.50/2026 కింద కేసు నమోదు చేశారు. భారత న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318(4), 274, 275 ప్రకారం దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ సిటీ అడిషనల్ డీసీపీ (టాస్క్ ఫోర్స్) అందె శ్రీనివాసరావు పర్యవేక్షణలో.. గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఆర్.వెంకటేష్, మాసబ్ ట్యాంక్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు విజయానంద్, చందన తదితరులు ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.

Advertisement
Advertisement