త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cyberabad Police 24th Formation Day | సైబరాబాద్ 24వ ఆవిర్భావ దినోత్సవం: ‘కమ్యూనిటీ పోలీసింగ్’ ద్వారా ప్రజలకు మరింత చేరువగా – సీపీ ఎం.రమేష్

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీపీ డాక్టర్ ఎం. రమేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. గత 23 ఏళ్ల ప్రస్థానంలో సైబరాబాద్ అభివృద్ధిలో పోలీసుల పాత్ర, రోడ్డు భద్రత, టెక్నాలజీ వినియోగంపై సీపీ కీలక వ్యాఖ్యలు చేశారు. కమిషనరేట్ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు జరిగాయి.

J

Hyderabad | Published On Feb 12, 2026, 10.00 pm IST

Cyberabad Police 24th Formation Day | సైబరాబాద్ 24వ ఆవిర్భావ దినోత్సవం: ‘కమ్యూనిటీ పోలీసింగ్’ ద్వారా ప్రజలకు మరింత చేరువగా – సీపీ ఎం.రమేష్
Advertisement

Cyberabad Police 24th Formation Day | త్రినేత్ర.న్యూస్ : వేగంగా విస్తరిస్తున్న ఐటీ, ఫార్మా కారిడార్లకు రక్షణ కవచంలా నిలుస్తున్న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ (CP) డాక్టర్ ఎం.రమేష్ కమిషనరేట్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.

అభివృద్ధికి అండగా.. భద్రతకు భరోసాగా

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. 2003లో మెట్రోపాలిటన్ చట్టం ప్రకారం ఏర్పడిన సైబరాబాద్ కమిషనరేట్, నేడు దేశంలోనే ప్రముఖ అర్బన్ పోలీసింగ్ వ్యవస్థగా ఎదిగిందని గుర్తుచేశారు. తొలి కమిషనర్ ఎం. మహేందర్ రెడ్డి నుంచి నేటి వరకు ఈ 23 ఏళ్ల ప్రస్థానంలో.. ఇక్కడ వెలసిన ప్రతి కట్టడంలో, జరిగిన ప్రతి అభివృద్ధిలో పోలీసుల కష్టం, స్వేదం, త్యాగం దాగి ఉన్నాయని ఆయన భావోద్వేగంతో పేర్కొన్నారు.

Cyberabad Police 24th Formation Day CP Ramesh Highlights Community Policing and Safety

టెక్నాలజీతో ఆధునిక పోలీసింగ్

ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడంలో సైబరాబాద్ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారని సీపీ తెలిపారు. జనాభా, విస్తీర్ణం ఆధారంగా ‘కోర్ అర్బన్ రీజన్ (CURE)’ని మూడు జోన్లుగా విభజించామని, మున్సిపల్ వార్డులు, సర్కిళ్లకు అనుగుణంగా పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తున్నామని వెల్లడించారు. ఐటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, బయోటెక్నాలజీ రంగాల వృద్ధికి పోలీసులు కల్పించే భద్రతే పునాది అని స్పష్టం చేశారు.

యుద్ధాల కంటే రోడ్డు ప్రమాదాలే పెద్ద ముప్పు

ప్రస్తుత సవాళ్లపై స్పందిస్తూ.. సైబర్ నేరాలతో పాటు రోడ్డు ప్రమాదాలు ఆందోళనకరంగా ఉన్నాయని సీపీ అన్నారు. "యుద్ధాల్లో కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, వలస కార్మికుల భద్రత, సంక్షేమం కూడా పోలీసుల బాధ్యతేనని, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Cyberabad Police 24th Formation Day CP Ramesh Highlights Community Policing and Safety

ఘనంగా వేడుకలు - వినూత్న కార్యక్రమాలు

ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కమిషనరేట్ పరిధిలో పలు ఆసక్తికర కార్యక్రమాలు జరిగాయి.

పోలీస్ డాగ్స్ సెల్యూట్: ధీర, వీర, ధృవ, భీమ, రాఖీ, తేజ, మౌని, లైకా అనే పోలీస్ జాగిలాలు సీపీకి గౌరవ వందనం సమర్పించడం విశేషం.

రక్తదానం, సైక్లింగ్: సీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పోలీసులు రక్తదానం చేయగా, నార్సింగి సైకిల్ ట్రాక్ పై ప్రజలతో కలిసి పోలీసులు సైక్లింగ్ చేశారు.

ట్రాఫిక్ పోలీసుల 'గాంధీగిరి': మియాపూర్, రామచంద్రాపురం ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించిన వాహనదారులకు గులాబీ పూలు, చాక్లెట్లు ఇచ్చి అభినందించారు.

సేవే లక్ష్యం: బాచుపల్లిలో విద్యార్థులతో కేక్ కట్ చేయగా, రాయదుర్గం పోలీసులు 500 మంది విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. జీడిమెట్ల పోలీసులు ఆసుపత్రుల్లో పండ్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్, శేరిలింగంపల్లి డీసీపీ సి.హెచ్. శ్రీనివాస్, ఇతర డీసీపీలు, ఏసీపీలు, సిబ్బంది పాల్గొని వేడుకలను జయప్రదం చేశారు.

Advertisement
Advertisement