త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NIMS | చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు

NIMS | పుట్టుకతోనే గుండె జబ్బులతో బాధపడుతున్న 19 మంది చిన్నారులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించిన నిమ్స్ వైద్య బృందాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం అభినందించారు.

P

Hyderabad | Published On Sep 13, 2026, 4.07 pm IST

NIMS | చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు
Advertisement
  • నిమ్స్ వైద్య బృందాన్ని అభినందించిన సీఎం రేవంత్‌రెడ్డి

NIMS | పుట్టుకతోనే గుండె జబ్బులతో బాధపడుతున్న 19 మంది చిన్నారులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించిన నిమ్స్ వైద్య బృందాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం అభినందించారు. నిమ్స్ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 12 వరకు నిర్వహించిన పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ క్యాంప్ విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ డీ రమణ ధన్నపునేని, డాక్టర్ ఎం అమరేష్‌రావు సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. క్యాంప్‌లో పుట్టుకతో వచ్చిన వివిధ రకాల గుండె జబ్బులతో బాధపడుతున్న 19 మంది చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేశారు. ఇందులో కేవలం 2 కిలోల బరువున్న రెండు నెలల పసికందుకు సైతం విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించడం విశేషం. చిన్న వయసు, తక్కువ బరువు కారణంగా క్లిష్టంగా ఉన్నప్పటికీ వైద్య బృందం అత్యంత నైపుణ్యంతో ఆపరేషన్ పూర్తి చేసింది.

క్యాంప్ ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన చిన్నారులకు గుండె సంబంధిత వ్యాధులకు సకాలంలో చికిత్స అందించే అవకాశం లభించింది. క్లిష్టమైన కేసులను సైతం విజయవంతంగా నిర్వహించిన నిమ్స్ వైద్యుల సేవలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ప్రశంసించారు. ముఖ్యంగా రెండు నెలల వయసున్న పసికందుకు, కేవలం 2 కిలోల బరువుతో ఉన్నప్పటికీ శస్త్రచికిత్స విజయవంతం చేయడంపై వైద్యులను అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. చిన్నారులకు గుండె సంబంధిత సమస్యలకు మెరుగైన చికిత్స అందించడంలో నిమ్స్ వైద్య బృందం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు పీ సుదర్శన్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement