త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramachander Rao | రియ‌ల్ ఎస్టేట్ కోస‌మే ‘గాంధీ స‌రోవ‌ర్‌’.. బీజేపీ చీఫ్ రామ‌చంద‌ర్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Ramachander Rao | రియ‌ల్ ఎస్టేట్ కోస‌మే గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టును కాంగ్రెస్ స‌ర్కార్ చేప‌ట్టిన‌ట్టు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు ఆరోపించారు. ఈ ప్రాజెక్టుతో కేంద్ర ప్ర‌భుత్వానికి ఎలాంటి సంబంధం లేద‌ని ఆయ‌న తేల్చిచెప్పారు.

S

Hyderabad | Published On Feb 26, 2026, 4.23 pm IST

Ramachander Rao | రియ‌ల్ ఎస్టేట్ కోస‌మే ‘గాంధీ స‌రోవ‌ర్‌’.. బీజేపీ చీఫ్ రామ‌చంద‌ర్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

ఈ ప్రాజెక్టుతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు..
పేద‌ల ఇండ్లు కూల్చుతామంటే బీజేపీ ఊరుకోదు..
సైనికుల కుటుంబాల‌పై కాంగ్రెస్ భ‌క్తి ఇదేనా..?
సీఎం రేవంత్ స‌ర్కార్‌పై బీజేపీ చీఫ్ రామ‌చంద‌ర్ రావు ఫైర్‌

Ramachander Rao | త్రినేత్ర‌.న్యూస్ : రియ‌ల్ ఎస్టేట్ కోస‌మే గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టును కాంగ్రెస్ స‌ర్కార్ చేప‌ట్టిన‌ట్టు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు ఆరోపించారు. ఈ ప్రాజెక్టుతో కేంద్ర ప్ర‌భుత్వానికి ఎలాంటి సంబంధం లేద‌ని ఆయ‌న తేల్చిచెప్పారు. మూసీ గోస - బీజేపీ భ‌రోసా కార్య‌క్ర‌మంలో భాగంగా బీజేపీ నేత‌ల‌తో క‌లిసి రామ‌చంద‌ర్ రావు మ‌ధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసుల‌తో గురువారం స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా అపార్ట్‌మెంట్ వాసుల‌ను ఉద్దేశించి బీజేపీ అధ్య‌క్షుడు ప్ర‌సంగించారు.

కాంగ్రెస ప్ర‌భుత్వం గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు కోసం ఆసియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంకు నుంచి రూ. 4 వేల కోట్లు అప్పు తీసుకుని నిర్మిస్తున్నారు. పిల్ల‌ల‌కు చెల్లించేందుకు ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ డ‌బ్బుల్లేవు కానీ.. ఈ ప్రాజెక్టు కోసం రూ. 4 వేల కోట్లు తీసుకుంటుంది. గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు కేవ‌లం రియ‌ల్ ఎస్టేట్ కోస‌మే నిర్మిస్తున్నారు. ప్ర‌జ‌ల సంక్షేమం కోసం చేయ‌ట్లేదు. మూసీ ప్ర‌క్షాళ‌న చేయండి.. దానికి మేం సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తాం. మూసీ బ‌ఫ‌ర్ జోన్ పేరు మీద మ‌ధ్య త‌ర‌గ‌తి, పేద‌ల‌ ఇండ్ల‌ను కూల‌గొట్ట‌డాన్ని ఒప్పుకోం అని రామ‌చంద‌ర్ రావు తేల్చిచెప్పారు.

రైతుల భూములు కూడా గుంజుకుంటున్నారు..

గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం వ‌ద్ద డీపీఆర్ లేదు. ఈ ప్రాజెక్టును ఇప్ప‌టి వ‌ర‌కు ప‌బ్లిక్ డొమైన్‌లో ఉంచ‌లేదు.. కానీ ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నారు. మీ ప‌క్క‌నే ఉన్న భూములు ఎక‌రం రూ. 150 కోట్ల విలువ చేస్తుంది. మ‌రి మీకు ఎంత న‌ష్ట ప‌రిహారం చెల్లిస్తారు..? మీకు రూ. 20 కోట్లు ఇస్తారా అంటే ఇవ్వ‌రు. స్థానికంగా కూర‌గాయలు పండించే రైతుల నుంచి కూడా రూ. కోట్ల విలువ చేసే భూముల‌ను గుంజుకుంటున్నారు. కానీ న‌ష్ట ప‌రిహారం మాత్రం ల‌క్ష‌ల్లో ఇస్తారు. మూసీ సుంద‌రీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకం కాదు. కానీ దీని పేరిట పేద‌ల ఇండ్లు కూల‌గొడుతాం.. రైతుల భూములు గుంజుకుంటామంటే బీజేపీ ఊరుకోదు అని ఆయ‌న హెచ్చ‌రించారు.

గాంధీ విగ్ర‌హం కోసం పేద‌ల ఇండ్లు కూల‌గొడితే ఊరుకోం..

హైడ్రా పేరుతో పేద‌ల ఇండ్ల‌ను కూల‌గొడుతుంది. హిల్ట్ పేరిట ప‌రిశ్ర‌మ‌ల‌ను బ‌య‌ట‌కు త‌ర‌లిస్తున్నారు. మూసీ ప్రాజెక్టు పేరిట మ‌ధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ను కూల‌గొడుతుంది. ఈ అపార్ట్‌మెంట్‌లో దేశం కోసం ప్రాణాల‌ర్పించిన సైనికుల కుటుంబాలు ఉన్నాయి. అలాంటి వారి ఇండ్ల‌ను కూల‌గొడుతుందంటే.. ఈ ప్ర‌భుత్వానికి సైనికుల‌న్నా.. వారి కుటుంబాల‌న్నా ఎంత భ‌క్తి ఉందో అర్థ‌మ‌వుతుంది. దేశం కోసం ప్రాణాల‌ర్పించిన వారికి స‌హాయం అందించాల్సింది పోయి వారిని రోడ్డుమీద ప‌డేసేందుకు సిద్ధ‌మవుతుంది. ఈ కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి సిగ్గుంటే ఈ ప్రాజెక్టును విర‌మించుకోవాలి. గాంధీ విగ్ర‌హం పెడుతామంటే అభ్యంత‌రం లేదు. గాంధీ విగ్ర‌హం కోసం మా పేద‌ల ఇండ్ల‌ను కూల‌గొడుతామంటే ఊరుకోం అని హెచ్చ‌రించారు.

కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు..

గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది కేంద్రం ప‌రిధిలో లేని స‌బ్జెక్టు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా విడుద‌ల చేయ‌డం లేదు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఆసియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంకు నుంచి రూ. 4 వేల కోట్ల రుణం తీసుకుంటుంది. ఈ ప్రాజెక్టు శంకుస్థాప‌న‌కు కేంద్ర మంత్రులు ఎవ‌రూ రారు. బీజేపీ నేతలు వ‌స్తున్నార‌ని, కేంద్రం నిధులు విడుద‌ల చేస్తుంద‌ని కాంగ్రెస్ చేస్తున్న త‌ప్పుడు ప్ర‌చారాన్ని న‌మ్మొద్దు అని బీజేపీ చీఫ్ రామ‌చంద‌ర్ రావు స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement