త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ATM Fraudster Arrest | ఏటీఎం ఘరానా మోసం: నకిలీ ‘NEFT’ మెసేజ్‌లతో నిలువునా దోచుకుంటున్న అంతర్రాష్ట్ర కేటుగాడి అరెస్ట్

ఏటీఎం కేంద్రాల వద్ద నగదు డిపాజిట్ చేయడానికి వచ్చే అమాయకులే లక్ష్యంగా చేతివాటం ప్రదర్శిస్తున్న ఓ అంతర్రాష్ట్ర నేరస్థుడిని హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏటీఎం మెషిన్ పనిచేయడం లేదని నమ్మించి, ఫేక్ యాప్ ద్వారా NEFT మెసేజ్‌లు సృష్టించి లక్షలు కొల్లగొడుతున్న ఈ కిలాడీ మోసగాడి ఆటకట్టించారు.

J

Hyderabad | Published On Apr 29, 2026, 9.30 pm IST

ATM Fraudster Arrest | ఏటీఎం ఘరానా మోసం: నకిలీ ‘NEFT’ మెసేజ్‌లతో నిలువునా దోచుకుంటున్న అంతర్రాష్ట్ర కేటుగాడి అరెస్ట్
Advertisement

ATM Fraudster Arrest | త్రినేత్ర.న్యూస్ : సాంకేతికత పెరిగే కొద్దీ సైబర్ నేరస్థులు, మోసగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. అమాయక ప్రజల అవసరాన్ని, గాబరాను ఆసరాగా చేసుకుని ఏటీఎం కేంద్రాల వద్దే నిలువునా దోచేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ సరికొత్త మోసానికి పాల్పడుతున్న ఓ ప్రమాదకరమైన అంతర్రాష్ట్ర నేరస్థుడిని హైదరాబాద్ ఖైరతాబాద్ జోన్ పరిధిలోని సుల్తాన్ బజార్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో నేరాలకు పాల్పడిన ఈ ఘరానా మోసగాడి బండారం రట్టయింది.

వాడి రూటే సపరేటు.. ఇలా బురిడీ కొట్టిస్తాడు

నిందితుడు ప్రధానంగా ఎస్‌బీఐ (SBI) ఏటీఎం క్యాష్ డిపాజిట్ మెషీన్ల వద్ద వల వేస్తాడు. డిపాజిట్ చేయడానికి వచ్చే వారితో చాలా మర్యాదగా మాట్లాడి నమ్మకం కలిగిస్తాడు. "మెషీన్‌లో సాంకేతిక సమస్య ఉంది, క్యాష్ తీసుకోదు.. మీకు అభ్యంతరం లేకపోతే మీరు నాకు ఆ క్యాష్ ఇవ్వండి, నా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మీ ఖాతాకు నేను NEFT చేస్తాను" అని నమ్మిస్తాడు. తీరా బాధితులు సరే అనగానే.. ఒక నకిలీ యాప్ ద్వారా అమౌంట్ ట్రాన్స్‌ఫర్ అయినట్లుగా క్రియేట్ చేసిన ఫేక్ మెసేజ్‌ (Fake Message) చూపిస్తాడు. "అమౌంట్ మీ ఖాతాలో పడటానికి అరగంట పడుతుంది" అని బుకాయించి, వారి చేతిలోని నగదు తీసుకుని అక్కడి నుంచి జారుకుంటాడు.

అడ్డంగా బుక్కైంది ఇలా

గత ఏప్రిల్ 22న సికింద్రాబాద్‌కు చెందిన ఏ.సునీత అనే మహిళ కోటిలోని ఎస్‌బీఐ ఏటీఎం వద్ద రూ.లక్ష డిపాజిట్ చేయడానికి వచ్చారు. సాంకేతిక కారణాలతో డిపాజిట్ కాకపోవడంతో.. అక్కడే కాపుకాసిన నిందితుడు ఆమెను మాటల్లో పెట్టి, తాను NEFT చేస్తానని చెప్పి ఫేక్ మెసేజ్ చూపించాడు. అయితే ఆమెకు అనుమానం వచ్చి నిందితుడిని తన షాపుకు తీసుకువెళ్లింది. అక్కడ అతను తన ఆధార్ కార్డు వివరాలు పంపి, కళ్లుగప్పి పరారయ్యాడు. సాయంత్రమైనా ఖాతాలో డబ్బులు రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు సుల్తాన్ బజార్ పోలీసులను ఆశ్రయించింది.

సీసీటీవీల ఆధారంగా పోలీసుల వేట

ఖైరతాబాద్ జోన్ డీసీపీ ఆదేశాలతో, సుల్తాన్ బజార్ ఏసీపీ ఎం. మత్తయ్య పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ జి.నరేష్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ పి.ధర్మారావు ఆధ్వర్యంలోని బృందం రంగంలోకి దిగింది. ఏటీఎం సెంటర్, షాపుల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పట్టి సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని గుర్తించారు. ఏప్రిల్ 28న నారాయణగూడ ఫ్లైఓవర్ సమీపంలోని ఇండియన్ బ్యాంక్ ఏటీఎం వద్ద నిందితుడు అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడి ప్రొఫైల్, నేర చరిత్ర (Criminal Record)

పేరు: ఇంటిపల్లి రామారావు (అలియాస్ శ్రీరామ్, రాము) (31)

సొంత ఊరు: డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా (ఏపీ), రాజోలు మండలం, రుద్రవారి మెరక.

ప్రస్తుత నివాసం: సికింద్రాబాద్ జేబీఎస్ వద్ద డార్మిటరీలో.

రికవరీ: నేరానికి ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లతో పాటు, నిందితుడి ఖాతాలో ఉన్న రూ.2,40,000 నగదును పోలీసులు ఫ్రీజ్ (Freeze) చేశారు.

నేరాలు: ఇతను రాజమండ్రి, మలక్‌పేట్, జీడిమెట్ల, బోయిన్‌పల్లి, కరీంనగర్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో 8 ప్రధాన మోసాలు చేశాడు. 2018 నుంచి నేటి వరకు సుమారు 73 సార్లు ప్రజల దృష్టి మళ్లించి దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. గతంలోనూ ఇతనిపై పలు పీఎస్ లలో కేసులు నమోదయ్యాయి.

ప్రజలకు హైదరాబాద్ పోలీసుల హెచ్చరికలు

ఈ ఘటన నేపథ్యంలో ఖైరతాబాద్ జోన్ డీసీపీ ప్రజలకు పలు సూచనలు చేశారు.

ఏటీఎం కేంద్రాల వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తుతెలియని వ్యక్తులకు మీ నగదు చేతికి ఇవ్వకండి.

మీ తరపున ఆన్‌లైన్‌లో నగదు బదిలీ (NEFT/UPI) చేస్తామనే అపరిచితుల మాయమాటలు నమ్మకండి.

మీ బ్యాంక్ ఖాతాలో నగదు జమ అయినట్లు.. మీ అధికారిక బ్యాంక్ యాప్ లేదా బ్యాంక్ నుండి వచ్చే అఫీషియల్ మెసేజ్ ద్వారా మాత్రమే నిర్ధారించుకోండి.

అపరిచితులతో మీ బ్యాంక్ అకౌంట్, ఓటీపీ, మొబైల్ నంబర్ వివరాలు పంచుకోవద్దు.

ఏటీఎంల వద్ద ఎవరిపైనైనా అనుమానం వస్తే వెంటనే డయల్ 100 కి కాల్ చేయండి లేదా సమీప పోలీసులను సంప్రదించండి.

Advertisement
Advertisement