త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

November Horoscope 2026 | నవంబర్‌లో సూర్యుడి సంచారం.. 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుందంటే!

November Horoscope 2026 | నవంబర్‌ నెలలో గ్రహాల సంచారం జ్యోతిష్యపరంగా ప్రాధాన్యం సంతరించుకోనుంది. ముఖ్యంగా నవంబర్‌ 16న సూర్యుడు తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు. వేద జ్యోతిష్యం ప్రకారం సూర్యుడిని ఆత్మవిశ్వాసం, గౌరవం, నాయకత్వ లక్షణాలు, ఉద్యోగంలో అధికారానికి కారకుడిగా పరిగణిస్తారు.

P

Horoscope | Published On Nov 1, 2026, 7.51 am IST

November Horoscope 2026 | నవంబర్‌లో సూర్యుడి సంచారం.. 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుందంటే!
Advertisement

November Horoscope 2026 | నవంబర్‌ నెలలో గ్రహాల సంచారం జ్యోతిష్యపరంగా ప్రాధాన్యం సంతరించుకోనుంది. ముఖ్యంగా నవంబర్‌ 16న సూర్యుడు తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు. వేద జ్యోతిష్యం ప్రకారం సూర్యుడిని ఆత్మవిశ్వాసం, గౌరవం, నాయకత్వ లక్షణాలు, ఉద్యోగంలో అధికారానికి కారకుడిగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో సూర్యుడి సంచారం మొత్తం 12 రాశుల వారి జీవితాలపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు వ‌చ్చే అవ‌కాశాలు గోచ‌రిస్తున్నాయి. మరికొందరు ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సంబంధాలు, వ్యక్తిగత విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సిన ప‌రిస్థితులు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంది. ఈ క్రమంలో మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి నవంబర్‌ నెలలో కెరీర్‌, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, ప్రేమ, వైవాహిక జీవితం ఎలా ఉండవచ్చో తెలుసుకుందాం రండి..!

మేష రాశి (Aries)

నవంబర్‌లో మేష రాశి వారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనూహ్య మార్పులు ఎదురయ్యే అవకాశముంది. గతంలో ఎదురైన సమస్యలను పరిష్కరించుకునేందుకు మార్గాలు కనిపించవచ్చు. అయితే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు తొందరపడకుండా వ్యవహరించాలి. ముందుగా రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి. గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందే అవకాశం ఉంది. ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల్లోనూ పురోగతి కనిపించవచ్చు. మరోవైపు ఆకస్మిక ఖర్చులు పెరిగి బడ్జెట్‌పై ప్రభావం పడే సూచనలు ఉన్నాయి. పెట్టుబడులు, ఆస్తుల కొనుగోలు, పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపే ముందు ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోవాలి. పని ఒత్తిడి కారణంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. తగినంత విశ్రాంతి తీసుకోవడంతోపాటు రోజువారీ దినచర్యపై శ్రద్ధ పెట్టాలి. ఏదైనా ఆరోగ్య సమస్య వేధిస్తే వైద్యులను సంప్రదించడం మంచిది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సహకారం పెరిగే అవకాశముంది. అత్తింటి వారితో ముఖ్యమైన విషయాలపై చ‌ర్చించే అవ‌కాశం ఉంది. దాంపత్య జీవితంలో అనవసరమైన విభేదాలు తలెత్తకుండా భాగస్వామి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. పరస్పర అవగాహనతో వ్యవహరిస్తే సంబంధాలు మెరుగ‌వుతాయి.

వృషభ రాశి (Taurus)

వృషభ రాశి వారికి కొత్త వ్యాపార అవకాశాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. వ్యాపార భాగస్వామ్యాలు, కొత్త ఒప్పందాల ద్వారా పనులను విస్తరించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఏదైనా ప్రతిపాదనను అంగీకరించే ముందు దానికి సంబంధించిన షరతులు, భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను పూర్తిగా తెలుసుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం. వ్యాపార నిర్ణయాలు లాభాలను అందించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రణాళిక లేని ఖర్చులు ఇబ్బందులకు దారితీయవచ్చు. ఆదాయం, పొదుపు, ఖర్చుల మధ్య సమతుల్యత పాటించాలి. కుటుంబ బాధ్యతలు, పని ఒత్తిడి కారణంగా మానసిక అలసటకు గురయ్యే అవకాశం ఉంది. క్రమబద్ధమైన దినచర్యను అనుసరించాలి. సమతుల ఆహారం తీసుకోవడంతోపాటు తగినంత నిద్ర, విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వాలి. భాగస్వామితో చిన్నచిన్న విషయాల్లో అభిప్రాయభేదాలు తలెత్తే అవ‌కాశం ఉంది. అపార్థాలు పెరగకుండా ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. బంధంలో అనుబంధం పెరిగేలా సమయం కేటాయించడం మంచిది.

మిథున రాశి (Gemini)

మిథున రాశి వారికి ఉద్యోగంలో పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ప్రారంభించిన ప్రాజెక్టులు ముందుకు సాగే అవ‌కాశాలు గోచ‌రిస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టేవారు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. అనవసర వివాదాలకు దూరంగా ఉండటం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదాయ మార్గాల ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది. గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. అయితే, ఆర్థిక లావాదేవీల విషయంలో అవసరమైన పత్రాలు, నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించాలి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పొదుపు ప్రణాళిక రూపొందించుకోవడం మంచిది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు క్రమబద్ధమైన జీవనశైలిని అనుసరించాలి. సరైన ఆహారం, వ్యాయామం, విశ్రాంతికి సమయం కేటాయించాలి. ఇప్పటికే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుల సూచనల మేరకు చికిత్స కొనసాగించాలి. ప్రేమ సంబంధాల్లో సాన్నిహిత్యం పెరిగే అవకాశం ఉంది. భాగస్వామితో భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించవచ్చు. బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవాలని భావించేవారికి కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం రావచ్చు. సంబంధాల్లో నమ్మకం, స్పష్టతకు ప్రాధాన్యం ఇవ్వాలి.

కర్కాటక రాశి (Cancer)

కర్కాటక రాశి వారికి నవంబర్‌లో కొత్త అవకాశాలతోపాటు అదనపు బాధ్యతలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఒత్తిడి పెరగవచ్చు. ఈ పరిస్థితుల్లో సమయపాలన చాలా ముఖ్యం. సమస్యలు ఎదురైనప్పుడు సహనం కోల్పోకుండా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశాలున్నప్పటికీ, అనుకోని ఖర్చులు లేదా గతంలో తీసుకున్న ఆర్థిక బాధ్యతలు భారంగా మారవచ్చు. పెట్టుబడులు, కొనుగోళ్ల విషయంలో అవసరాలు, అందుబాటులో ఉన్న నిధులను పరిగణనలోకి తీసుకోవాలి. ఖర్చులను ముందుగానే అంచనా వేసుకోవడం మంచిది. పని ఒత్తిడి వల్ల అలసట, మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆహారం, నిద్ర, విశ్రాంతి విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఏదైనా ఆరోగ్య సమస్య ఎక్కువకాలం కొనసాగితే వైద్యులను సంప్రదించాలి. ప్రేమ సంబంధాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకోవచ్చు. మనసులోని భావాలను భాగస్వామితో పంచుకునేందుకు అనుకూల సమయం. సంబంధాన్ని త‌ర్వాతి ద‌శ‌కు తీసుకెళ్లే ఆలోచన చేయవచ్చు. అనుకోని పరిణామాలు ఎదురైనప్పుడు వెంటనే స్పందించకుండా, పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవ‌డం మంచిది.

సింహ రాశి (Leo)

సింహ రాశి వారు ఉద్యోగంలో బాధ్యతలు, వ్యక్తిగత ప్రవర్తన మధ్య సమతుల్యత పాటించాలి. కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. తమ అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడిస్తూనే ఇతరుల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇలా వ్యవహరించడం ద్వారా సహోద్యోగులతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. వాహనం, ఇల్లు, స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచన చేసే అవ‌కాశం ఉంది. పెద్ద మొత్తంలో ఖర్చు చేసే ముందు బడ్జెట్‌ను పరిశీలించాలి. ఆస్తులకు సంబంధించిన పత్రాలు, ఇతర లాంఛనాలను పూర్తిగా తనిఖీ చేయాలి. తొందరపడి నిర్ణయం తీసుకోకుండా అందుబాటులో ఉన్న అవకాశాలను పోల్చి చూసుకోవడం మంచిది. ఉద్యోగం, కుటుంబ బాధ్యతల కారణంగా మానసిక ఒత్తిడి పెరిగే అవకాశముంది. రోజువారీ దినచర్యలో విశ్రాంతి, శారీరక వ్యాయామానికి చోటు కల్పించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ఆందోళన ఉన్నప్పటికీ సొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. చిన్నచిన్న విషయాలకే భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వారి ప్రవర్తనలో మార్పు కనిపించినా వెంటనే అనుమానాలు పెంచుకోవద్దు. మాట్లాడి విషయాన్ని తెలుసుకోవాలి. పరస్పర గౌరవం, సహనం, స్పష్టమైన సంభాషణ ద్వారా బంధంలో సమతుల్యతను కాపాడుకోవ‌చ్చు.

కన్యా రాశి (Virgo)

కన్యా రాశి వారికి తమ నైపుణ్యాలను నిరూపించుకునేందుకు నవంబర్‌లో అవకాశాలు లభించవచ్చు. ఉద్యోగంలో చేసే కృషికి గుర్తింపు దక్కే సూచనలు ఉన్నాయి. సహోద్యోగులు, స్నేహితుల నుంచి సహకారం అందవచ్చు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేవారు ప్రణాళిక, ప్రాధాన్యాల విషయంలో స్పష్టతతో వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత అవసరాలు, జీవనశైలికి సంబంధించిన వస్తువుల కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు. అయితే పొదుపును విస్మరించకూడదు. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఆర్థిక సహాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అందుబాటులో ఉన్న నిధులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. క్రమబద్ధమైన దినచర్య, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వాలి. పని మధ్యలో విరామాలు తీసుకోవడంతోపాటు సమతుల ఆహారం తీసుకోవాలి. ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుల సూచనల ప్రకారం చికిత్స కొనసాగించాలి. ప్రేమ సంబంధాల్లో పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉంది. భాగస్వామితో ఎక్కువ సమయం గడిపేందుకు, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించేందుకు వీలుంటుంది. బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తే మనసులోని మాటను స్పష్టంగా చెప్పాలి. పరస్పర నమ్మకంతో వ్యవహరించడం వల్ల సంబంధం బలపడుతుంది.

తులా రాశి (Libra)

తులా రాశి వారు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించాలి. గతంలో చేపట్టిన పనులకు సంబంధించి కొన్ని అంశాలు మళ్లీ తెరపైకి రావచ్చు. భాగస్వామ్యాలు, ఒప్పందాలు కుదుర్చుకునే ముందు అవసరమైన సమాచారాన్ని ధ్రువీకరించుకోవాలి. తమ బాధ్యతలపై స్పష్టత కలిగి ఉండటం ముఖ్యం. గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి అందే అవకాశం ఉంది. పాత ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి కనిపించవచ్చు. అయితే పెట్టుబడులు పెట్టడం, అప్పులు తీసుకోవడం, ఇవ్వడం వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇచ్చే ముందు ఎదుటివారి విశ్వసనీయత, తిరిగి చెల్లించే నిబంధనలను పరిశీలించాలి. వాతావరణ మార్పులు, పని ఒత్తిడి కారణంగా ఆరోగ్యంపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తగినంత నిద్రపోవడం, సమతుల ఆహారం తీసుకోవడం అవసరం. ఏదైనా సమస్య నిరంతరం వేధిస్తే వైద్యుల సలహా తీసుకోవాలి. భాగస్వామితో సమయం గడిపే అవకాశాలు ఉన్నప్పటికీ, గతంలో జరిగిన విషయాలు మళ్లీ చర్చకు రావడంతో విభేదాలు తలెత్తవచ్చు. పాత సమస్యలను పదేపదే ప్రస్తావించకుండా ప్రస్తుత పరిస్థితిపై దృష్టి పెట్టాలి. సహనం, స్నేహపూర్వక సంభాషణతో బంధంలో నమ్మకాన్ని కాపాడుకోవచ్చు.

వృశ్చిక రాశి (Scorpio)

నవంబర్‌ 16న సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో ఈ రాశి వారికి ఈ నెల జ్యోతిష్యపరంగా ప్రాధాన్యం సంతరించుకుంది. లక్ష్యాలపై ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పురోగతి సాధించాలన్నా, పోటీ పరీక్షల్లో రాణించాలన్నా, వ్యాపారాన్ని విస్తరించాలన్నా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి. పట్టుదలతో ముందుకు సాగడం ముఖ్యం. కెరీర్‌లో కొత్త అవకాశాలు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు ప్రేరణ కలిగించవచ్చు. కీలకమైన పదవులు, ప్రాజెక్టుల కోసం ప్రయత్నిస్తున్నవారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. అయితే ఉత్సాహంతో మాత్రమే ఆర్థిక నిర్ణయాలు తీసుకోకూడదు. పెట్టుబడులు, ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగం, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత పాటించాలి. ఒత్తిడి, ఆందోళన పెరిగినప్పుడు విశ్రాంతి, వ్యాయామం, ధ్యానం వంటి అలవాట్లకు సమయం కేటాయించాలి. ఆరోగ్య సమస్యలు ఉంటే నిపుణుల సలహా తీసుకోవాలి. భాగస్వామితో సంబంధాలు సాధారణంగా సజావుగా సాగవచ్చు. చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం వల్ల ఇంట్లో ప్రశాంతత దెబ్బతినే అవకాశం ఉంది. భాగస్వామి మాటలను శ్రద్ధగా వినాలి. మనసులోని భావాలను ప్రశాంతంగా వ్యక్తపరచాలి. ఇద్దరూ కలిసి సమయం గడపడం వల్ల పరస్పర అవగాహన పెరుగుతుంది.

ధనుస్సు రాశి (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఉద్యోగం, ప్రయాణాలు, విదేశీ వ్యాపార విస్తరణకు సంబంధించి కొత్త అవకాశాలు ఎదురుకావచ్చు. బహుళజాతి సంస్థల్లో పనిచేసేవారికి లేదా విదేశీ మార్కెట్లతో సంబంధం ఉన్నవారికి కొత్త మార్గాలను పరిశీలించే అవకాశం ఉంటుంది. అయితే పని బాధ్యతలు పెరిగే కొద్దీ సమయపాలనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రాజెక్టులు, ప్రయాణాలు, ఇతర ముఖ్యమైన పనుల కోసం ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించిన ఖర్చులు అవసరమైనవే అయినప్పటికీ, అనవసర వ్యయాలను నియంత్రించాలి. న్యాయపరమైన లేదా వ్యాపారపరమైన వ్యవహారాలు పెండింగ్‌లో ఉంటే వాటికి సంబంధించిన ఆర్థిక ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. బిజీ షెడ్యూల్‌ కారణంగా నిద్ర తగ్గడం, అలసట పెరగడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. రోజువారీ దినచర్యను క్రమబద్ధంగా ఉంచుకోవాలి. కంటి సమస్యలు, పాదాలకు సంబంధించిన ఇబ్బందులు లేదా నిద్రలేమి వేధిస్తే వైద్యుల సలహా తీసుకోవాలి. మనసులోని భావాలను స్పష్టంగా వ్యక్తపరచడంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. భాగస్వామితో విషయాలను పంచుకోకపోతే అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల తమ అంచనాలు, ఆందోళనలను బహిరంగంగా చర్చించాలి. ప్రశాంతంగా మాట్లాడుకోవడం ద్వారా సంబంధంలో నమ్మకాన్ని పెంచుకోవచ్చు.

మకర రాశి (Capricorn)

మకర రాశి వారికి నవంబర్‌లో కొత్త వ్యాపార అవకాశాలు, ప్రాజెక్టులు చేపట్టే సూచనలు ఉన్నాయి. వృత్తిపరమైన పరిచయాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. అయితే టెండర్లు, వ్యాపార ప్రతిపాదనలను అంగీకరించే ముందు వాటిలోని షరతులను పూర్తిగా పరిశీలించాలి. ఆదాయ మార్గాలు మెరుగుపడటంతోపాటు వ్యాపారంలో లాభాలు పొందే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టాలని భావిస్తే అందులోని రిస్క్‌లు, అదనపు ఖర్చులను ముందుగానే అంచనా వేయాలి. ఆదాయం పెరిగినప్పటికీ పొదుపు అలవాటును కొనసాగించడం మంచిది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు క్రమబద్ధమైన దినచర్యను అనుసరించాలి. కుటుంబ సభ్యుల అవసరాల కారణంగా అదనపు బాధ్యతలు చేపట్టాల్సి రావచ్చు. అయినప్పటికీ వ్యక్తిగత ఆరోగ్యం, విశ్రాంతికి తగిన సమయం కేటాయించాలి. ప్రేమ సంబంధాల్లో సాన్నిహిత్యం పెరిగే అవకాశం ఉంది. భాగస్వామితో భవిష్యత్తు, వివాహం, కుటుంబ ప్రణాళికల గురించి చర్చించవచ్చు. ఏదైనా విషయంలో కుటుంబ సభ్యుల అంగీకారం అవసరమైతే తొందరపడకుండా అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి.

కుంభ రాశి (Aquarius)

కుంభ రాశి వారికి ఉద్యోగంలో బాధ్యతలు పెరగడంతోపాటు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు లభించవచ్చు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలోనూ పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. నిర్దేశించుకున్న లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. పని నాణ్యత విషయంలో రాజీ పడకూడదు. ఉద్యోగం, వ్యాపారం ద్వారా ఆదాయం మెరుగుపడే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న ఆదాయ మార్గాలను సమర్థంగా నిర్వహించడం వల్ల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవచ్చు. ఖర్చులు పెరిగితే పొదుపు, నిత్యావసరాల మధ్య సమతుల్యత పాటించాలి. నిరంతర పని వల్ల అలసట, మానసిక ఒత్తిడి పెరగవచ్చు. పని మధ్యలో విరామాలు తీసుకోవాలి. క్రమబద్ధమైన దినచర్యను అనుసరించాలి. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైతే వైద్యులను సంప్రదించాలి. ఉద్యోగ బాధ్యతలు పెరగడంతో భాగస్వామికి తగినంత సమయం కేటాయించలేకపోవచ్చు. దీనివల్ల బంధంలో దూరం పెరిగిన భావన కలగవచ్చు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ వ్యక్తిగత సంబంధాలకు సమయం కేటాయించాలి. తరచూ మాట్లాడుకుంటూ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవాలి.

మీన రాశి (Pisces)

మీన రాశి వారికి ప్రయాణాలు, వ్యాపారం, వృత్తిపరమైన కార్యకలాపాలకు సంబంధించి కొత్త అవకాశాలు ఎదురుకావచ్చు. వ్యాపార పరిచయాల ద్వారా ముందుకు వెళ్లేందుకు మార్గాలు కనిపించవచ్చు. కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. తమ అనుభవం, నైపుణ్యాలను సమర్థంగా వినియోగించుకోవాలి. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని అంశాలను పరిశీలించాలి. వ్యాపారం, ఆస్తులు లేదా గతంలో పెండింగ్‌లో ఉన్న వ్యవహారాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలని లేదా కొత్త ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకురావాలని భావిస్తే మార్కెట్‌ అవసరాలు, పెట్టుబడులు, ఖర్చులను అంచనా వేయాలి. ఆర్థిక విషయాల్లో ఆచరణాత్మకంగా వ్యవహరించడం మంచిది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు క్రమబద్ధమైన దినచర్య, సమతుల ఆహారం, తగినంత విశ్రాంతి అవసరం. పని ఒత్తిడి వల్ల అలసటగా అనిపిస్తే విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఏదైనా ఆరోగ్య సమస్య నిరంతరం వేధిస్తే వైద్యులను సంప్రదించాలి. ప్రేమ సంబంధాల్లో భావోద్వేగ దూరం లేదా సంభాషణ లోపం కనిపించవచ్చు. భాగస్వామిపై అనవసర అనుమానాలు పెంచుకోకుండా సమస్యలను నేరుగా చర్చించాలి. పరస్పర నమ్మకం, స్పష్టమైన సంభాషణ, సహనంతో వ్యవహరిస్తే అపార్థాలను పరిష్కరించుకోవచ్చు.

గమనించాల్సిన అంశాలు

నవంబర్‌ 16న సూర్యుడి వృశ్చిక రాశి ప్రవేశం ఈ నెలలో ప్రధాన గ్రహ సంచారంగా నిలవనుంది. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ మార్పు ఆత్మవిశ్వాసం, ఉద్యోగ బాధ్యతలు, వ్యక్తిగత సంబంధాలు, ఆర్థిక నిర్ణయాలపై ప్రభావం చూపే అవ‌కాశం ఉంది. ప్రతి రాశి వారికి ఫలితాలు భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తలు పాటించడం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం, కుటుంబ సంబంధాల్లో పరస్పర అవగాహనకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఇవి జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా రూపొందించిన సాధారణ అంచనాలు మాత్రమే. వాస్తవ జీవితంలో ఫలితాలు వ్యక్తిగత పరిస్థితులు, నిర్ణయాలు, ప్రయత్నాలపై ఆధారపడి ఉంటాయి.

ట్యాగ్స్:

AriesAstrologyCareerHoroscopeLoveMonthly HoroscopeNovember 2026PiscesSun TransitTelugu NewsZodiac Signs
Advertisement
Advertisement