Babu Mohan | టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బాబు మోహన్‌కు (Babu Mohan) చేదు అనుభవం ఎదురైంది. ఎన్టీఆర్ అభిమానుల నుంచి నిరసన సెగ తగిలింది దివంగత నటుడు , మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ (Ntr) వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు బాబుమోహన్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చారు. బాబుమోహన్‌ను ఎన్టీఆర్ అభిమానులు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు బాబుమోహన్ వెళ్లకుండా గేట్లు మూసేశారు. ఆయనతో వాగ్వాదానికి దిగారు. దాంతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద కొద్ది సేపు గందరగోళం నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకొని సర్ధిచెప్పడంతో అభిమానులు శాంతించారు. గొడవ సర్ధుమణిగిన తర్వాత ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళులు అర్పించి బాబుమోహన్ వెళ్లిపోయారు. కామెంట్లు కారణమా? బాబుమోహన్‌ను ఎన్టీఆర్ అభిమానులు అడ్డుకోవడం ఆసక్తికరంగా మారింది. గతంలో సీనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి బాబుమోహన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే అందుకు కారణమని అంటున్నారు. ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంతో పాటు ఆయన రాజకీయ నిర్ణయాలపై గతంలో బాబుమోహన్ విమర్శించారు. ఎన్టీఆర్ ఒక వర్గానికి, ఓ ప్రాంతానికి మాత్రమే ప్రాధాన్యమిచ్చారని బాబుమోహన్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. పతనానికి కారణం... ఎన్టీఆర్ రాజకీయ పతనానికి ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులే కారణమని, ఎన్టీఆర్ తెలుగు వారి ఆరాధ్య దైవం కాదని, కేవలం మనిషిగానే ఆయన్ని తాను చూస్తానంటూ బాబు మోహన్ అన్నారు. అప్పటి వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొనే ఆదివారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన్ని అభిమానులు అడ్డుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ పెట్టిన భిక్షవల్లే రాజకీయాల్లోకి వచ్చిన బాబుమోహన్ ఆయనపైనే అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు నెటిజన్లు మాత్రం బాబుమోహన్ దళితుడు కావడం వల్లనే ఆయన్ని అడ్డుకున్నట్లుగా చెబుతోన్నారు. గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీ పార్టీతో బాబుమోహన్ రాజకీయ జీవితం మొదలైంది. 1999 నుంచి 2004 మధ్యకాలంలో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం బీఆర్ఎస్ లో చేశారు. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతోన్నారు.