త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ఆరు ఆస్కార్ అవార్డులను కొల్లగొట్టిన ‘One Battle After Another’.. గ్రాఫిక్స్ లేని ఈ రియల్ యాక్షన్ థ్రిల్లర్‌లో అంత మ్యాజిక్ ఏముంది?

98వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ఏకంగా 6 అవార్డులను గెలుచుకుని సంచలనం సృష్టించిన చిత్రం 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్'. లియోనార్డో డికాప్రియో నటించిన ఈ బ్లాక్ కామెడీ యాక్షన్-థ్రిల్లర్ ఆస్కార్ జ్యూరీని ఎందుకు మెప్పించింది? దీని కథేంటి? ఒక సినీ ప్రేమికుడిగా మీరు ఈ సినిమాను ఎందుకు మిస్ అవ్వకూడదో తెలిపే ప్రత్యేక కథనం.

J

Entertainment | Published On Mar 16, 2026, 4.27 pm IST

ఆరు ఆస్కార్ అవార్డులను కొల్లగొట్టిన ‘One Battle After Another’.. గ్రాఫిక్స్ లేని ఈ రియల్ యాక్షన్ థ్రిల్లర్‌లో అంత మ్యాజిక్ ఏముంది?
Advertisement
  • ఆస్కార్ జ్యూరీని మెస్మరైజ్ చేసిన మూవీ
  • సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా నిలిచిన ఈ సినిమా కథేంటి?
  • ఎందుకు ఈ మూవీ మాస్టర్ పీస్?
  • ఆరు ఆస్కార్లు.. కళ్లు చెదిరే యాక్షన్

One Battle After Another  | త్రినేత్ర.న్యూస్ : ఆస్కార్ వేదికపై ఒక సినిమా సత్తా చాటిందంటే అందులో కచ్చితంగా ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది. తాజాగా జరిగిన 98వ అకాడమీ అవార్డ్స్‌ 2026లో పాల్ థామస్ ఆండర్సన్ దర్శకత్వం వహించిన 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' ఏకంగా ఆరు ఆస్కార్లను తన ఖాతాలో వేసుకుని చరిత్ర సృష్టించింది. ఇది కేవలం అవార్డులు గెలుచుకున్న ఒక 'క్లాసిక్' సినిమా మాత్రమే కాదు.. ప్రేక్షకుడికి సీటు అంచున కూర్చోబెట్టే ఒక అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్. అసలు ఈ సినిమా బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ తో సహా ఆరు అవార్డులు ఎందుకు గెలుచుకుంది? ఈ సినిమాలో అంత స్పెషల్ ఏముంది? మీరు దీన్ని ఎందుకు చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సినిమాలో అంత స్పెషల్ ఏంటి?

ఈ జనరేషన్‌లో వస్తున్న సినిమాల్లో ఎక్కువ భాగం గ్రీన్ మ్యాట్, సీజీఐ గ్రాఫిక్స్ మీద ఆధారపడుతున్నాయి. కానీ ఈ సినిమా అలా కాదు.

విస్టావిజన్ మ్యాజిక్ : 1960ల నాటి క్లాసిక్ సినిమాలకు (ఉదాహరణకు హిచ్‌కాక్ 'వర్టిగో') వాడిన 'విస్టావిజన్' ఫిల్మ్ కెమెరాలతో ఈ సినిమాను షూట్ చేశారు. దీనివల్ల డిజిటల్ కెమెరాలకు సాధ్యం కాని ఒక అద్భుతమైన, సహజమైన విజువల్స్ ఇందులో కనిపిస్తాయి.

ఒరిజినల్ యాక్షన్: కాలిఫోర్నియా ఎడారిలో తీసిన భారీ కార్ ఛేజింగ్ సీన్లలో ఎలాంటి గ్రాఫిక్స్ వాడలేదు. నిజమైన కార్లతో, ప్రాణాలకు తెగించి చేసిన స్టంట్స్ ఈ సినిమాకు ప్రాణం పోశాయి.

డార్క్ కామెడీ అండ్ థ్రిల్లర్: ఇదొక బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్. భయం పుట్టించే సీన్లలో కూడా ఒక రకమైన సెటైరికల్ నవ్వు పుట్టించడం దర్శకుడి పనితనానికి నిదర్శనం.

ఆస్కార్ జ్యూరీని మెప్పించింది ఏంటి?

సాధారణంగా అకాడమీ అవార్డుల జ్యూరీ చాలా విమర్శనాత్మకంగా ఉంటుంది. కానీ ఈ సినిమా వాళ్లను కూడా కట్టిపడేసింది. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ సహాయ నటుడు (సీన్ పెన్), ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్, ఉత్తమ కాస్టింగ్ విభాగాల్లో ఆరు ఆస్కార్లు వరించాయి.

ప్రస్తుత సమాజంలో జరుగుతున్న రాజకీయ మార్పులు, శ్వేతజాతీయ అహంకారం, ప్రభుత్వ అవినీతి వంటి ఎన్నో సమకాలీన అంశాలను ఈ సినిమా చాలా ధైర్యంగా, వ్యంగ్యంగా తెరపై చూపించింది. అలాగే, ఎప్పటినుంచో ఆస్కార్ డిజర్వింగ్ అని పేరున్న దర్శకుడు 'పాల్ థామస్ ఆండర్సన్' కెరీర్లోనే ఇది ఒక మాస్టర్ పీస్ కావడం మరో ప్రధాన కారణం.

అసలు కథ ఏంటి?

థామస్ పించోన్ రాసిన 'వైన్‌ల్యాండ్' అనే నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. కాలిఫోర్నియాలో 2025 నాటి పరిస్థితుల నేపథ్యంలో కథ నడుస్తుంది. బాబ్ ఫెర్గూసన్ (లియోనార్డో డికాప్రియో) ఒకప్పటి విప్లవకారుడు. గతం గురించి భయపడుతూ, డ్రగ్స్ కు బానిసై తన టీనేజ్ కూతురు విల్లా (చేజ్ ఇన్ఫినిటీ)తో కలిసి అజ్ఞాతంలో బతుకుతుంటాడు. వాళ్ల ప్రశాంత జీవితంలోకి 16 ఏళ్ల క్రితం నాటి పాత శత్రువు కల్నల్ లాక్‌జా (సీన్ పెన్) ఎంట్రీ ఇస్తాడు. లాక్‌జా ఒక పవర్‌ఫుల్ కమాండర్, పైగా విల్లా కన్న తండ్రి కూడా ఆయనే. తన పాత రహస్యాలు బయటపడకుండా ఉండేందుకు విల్లాను చంపాలని లాక్‌జా చూస్తాడు. తన కూతురిని కాపాడుకునేందుకు బాబ్ మళ్లీ తుపాకీ పట్టి, తన పాత మిత్రులను కలుసుకుని చేసే పోరాటమే ఈ సినిమా.

సినీ ప్రేమికులు ఈ సినిమాను ఎందుకు చూడాలి?

లియోనార్డో డికాప్రియో డిఫరెంట్ యాక్టింగ్: ఎప్పుడూ స్టైలిష్ గా, లేదంటే ఇంటెన్స్ రోల్స్ చేసే డికాప్రియో ఇందులో ఒక భయస్తుడైన, ఏమీ చేతకాని తండ్రిగా నటించి మెప్పించాడు.

సీన్ పెన్ విలనిజం: విలన్ కల్నల్ లాక్‌జా పాత్రలో సీన్ పెన్ నటనకు ఆస్కార్ అవార్డు ఎందుకు వచ్చిందో సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఆ పాత్ర మీలో భయాన్ని పుట్టిస్తుంది.

అడ్రినలిన్ రష్: క్లైమాక్స్‌లో వచ్చే కార్ ఛేజ్ సీక్వెన్స్ సినిమా చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ సీన్స్‌గా నిలిచిపోతుంది. యాక్షన్ ఎక్స్ పీరియన్స్ కు ఇది పర్ఫెక్ట్.

ఎక్కడ చూడొచ్చు?: ఈ మూవీ జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో స్టోర్‌లో అందుబాటులో ఉంది. హెచ్‌బీవో మ్యాక్స్‌లోనూ చూడొచ్చు. ఈ మూవీ 4కే అల్ట్రా హెచ్‌డీ బ్లూ రే డీవీడీ కూడా మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది.

"వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్" కేవలం ఒక యాక్షన్ మూవీ కాదు. ఆధునిక సమాజంపై సంధించిన ఒక వ్యంగ్యాస్త్రం. ఒక తండ్రీకూతుళ్ల ఎమోషనల్ జర్నీ. అద్భుతమైన నటన, గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్, మెదడుకు మేత వేసే కథ.. ఇవన్నీ ఒకే సినిమాలో చూడాలంటే దీన్ని మీరు కచ్చితంగా మీ వాచ్ లిస్టులో పెట్టుకోవాల్సిందే!

Advertisement
Advertisement