కన్నడ టీవీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీరియల్ నటి నందిని సీఏం ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులో తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది. నందిని హఠాన్మరణంతో కన్నడ, తమిళ టెలివిజన్ ఇండస్ట్రీ వర్గాలు షాక్ గురయ్యాయి. తెలుగు నటి అయిన నందిని కన్నడ, తమిళంలోనే ఎక్కువగా సీరియల్స్ చేసింది. కన్నడంలో జీవహూవగిడే, సంఘర్ష, నీనందే నా సీరియల్స్ నందినికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. గౌరి సీరియల్... ప్రస్తుతం తమిళంలో గౌరి అనే సీరియల్లో నటిస్తోంది నందిని. ఇందులో కనక, దుర్గ అనే రెండు పాత్రలు చేస్తోంది. ఈ సీరియల్లో కనక అనే పాత్ర ఆత్మహత్య చేసుకున్నట్లు ఇటీవల మేకర్స్ చూపించారు. విషం తాగి కనక పాత్ర చనిపోయినట్లుగా ఈ సీన్‌ను షూట్ చేశారట. ఈ సీన్ చిత్రీకరించిన కొద్ది రోజుల తర్వాత రియల్లైఫ్లోనూ నందిని సూసైడ్ చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ పాత్ర ప్రభావం నందిని రియల్లైఫ్పై పడినట్లు వస్తోన్న వార్తలను సీరియల్ మేకర్స్ ఖండించారు. మానసిక సమస్యలతో... గత కొద్దిరోజులుగా నందిని మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. పెళ్లి చేసుకొని యాక్టింగ్‌కు దూరంగా ఉండమంటూ కుటుంబ సభ్యులు నందినిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా సమాచారం. కానీ సీరియల్స్‌లోనే కొనసాగాలని నందిని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ గొడవల కారణంగా మానసికంగా ఇబ్బందులకు లోనైన నందిని ఆతహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. సూసైడ్ నోట్ కూడా లభ్యమైనట్లు తెలిసింది. నందిని మరణం పట్ల పలువురు కన్నడ, తమిళ టీవీ యాక్టర్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గౌరి సీరియల్ యూనిట్‌తో పాటు కలైంజర్ టీవీ ఛానెల్ కూడా నందిని మరణం తమను దిగ్భాంతికి గురిచేసిందంటూ ఓ పోస్ట్ పెట్టింది.