Vinayaka chavithi 2026 | వినాయకుడి వైభవం చూడాల్సిందే.. ఏపీ, తెలంగాణలోని ప్రముఖ క్షేత్రాలు ఇవే..!
Vinayaka chavithi 2026 | విఘ్నాలను తొలగించే దైవంగా గణపతికి హిందూ సంప్రదాయంలో అగ్రస్థానం. ‘వక్రతుండ మహాకాయ.. సూర్యకోటి సమప్రభ..’ అంటూ గణనాథుడిని స్మరిస్తూ ఏ పని ప్రారంభించినా అది నిర్విఘ్నంగా సాగాలని భక్తులు కోరుకుంటారు. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో అలాంటి విశ్వాసానికి ప్రతీకలుగా నిలిచే వినాయక క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని స్వయంభూ క్షేత్రాలైతే.. మరికొన్ని శతాబ్దాల చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయి. ఇంకొన్ని అపురూపమైన శిల్పకళతో ఆకట్టుకుంటాయి. ఆ క్షేత్రాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం రండి..!
Devotional | Published On Sep 14, 2026, 9.30 am IST
Vinayaka chavithi 2026 | విఘ్నాలను తొలగించే దైవంగా గణపతికి హిందూ సంప్రదాయంలో అగ్రస్థానం. ‘వక్రతుండ మహాకాయ.. సూర్యకోటి సమప్రభ..’ అంటూ గణనాథుడిని స్మరిస్తూ ఏ పని ప్రారంభించినా అది నిర్విఘ్నంగా సాగాలని భక్తులు కోరుకుంటారు. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో అలాంటి విశ్వాసానికి ప్రతీకలుగా నిలిచే వినాయక క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని స్వయంభూ క్షేత్రాలైతే.. మరికొన్ని శతాబ్దాల చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయి. ఇంకొన్ని అపురూపమైన శిల్పకళతో ఆకట్టుకుంటాయి. ఆ క్షేత్రాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం రండి..!
కాణిపాకం.. స్వయంభూ వరసిద్ధి

చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వినాయక క్షేత్రం అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని విహారపురిగా వ్యవహరించేవారని చెబుతారు. 11వ శతాబ్దంలో కుళోత్తుంగ చోళుడి కాలంలో ఆలయ నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయని పేర్కొంటారు. విజయనగర రాజుల కాలంలోనూ ఆలయం అభివృద్ధి చెందింది. బాహుదా నది తీరాన ఉన్న ఈ ఆలయ సింహద్వారం వద్ద చోళరాజు శిలా ప్రతిమ దర్శనమిస్తుంది. స్వామివారు బావిలో స్వయంభువుగా వెలసినట్లు స్థలపురాణం. వినాయక చవితి నుంచి 21 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలు ఇక్కడి ప్రధాన వేడుకలు. ఉత్సవాల ముగింపున తెప్పోత్సవం నిర్వహిస్తారు.
అయినవిల్లి.. దక్షిణాభిముఖ సిద్ధి వినాయకుడు

అమలాపురానికి సమీపంలోని అయినవిల్లి సిద్ధి వినాయక క్షేత్రానికి పురాణ ప్రాశస్త్యం ఉంది. కృతయుగం నుంచే ఇక్కడ గణపతి కొలువై ఉన్నాడని స్థలపురాణం చెబుతుంది. దక్షయజ్ఞానికి వెళ్లే ముందు దక్ష ప్రజాపతి ఇక్కడి వినాయకుడిని పూజించాడని.. వ్యాస మహర్షి దక్షిణ యాత్రకు ముందు స్వామిని ప్రతిష్ఠించాడని మరో విశ్వాసం. దక్షిణాభిముఖంగా ఉన్న స్వామివారికి అభిషేక సేవ విశేషమైనది. వైశాఖంలో ఐదు రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. భాద్రపద శుద్ధ చవితి నుంచి తొమ్మిది రోజులపాటు వినాయక నవరాత్రులు నిర్వహిస్తారు. మాఘమాసంలో జరిగే చదువుల పండుగ ప్రత్యేక ఆకర్షణ. లక్ష కలాలను స్వామి పాదాల వద్ద ఉంచి, లక్ష దూర్వాలతో పూజించి.. అనంతరం వాటిని విద్యార్థులకు అందజేస్తారు.
బిక్కవోలు.. చాళుక్యుల కాలపు జాడ

తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోలు గణపతి ఆలయానికి తూర్పు చాళుక్యుల కాలం నాటి చారిత్రక నేపథ్యం ఉందని ఆధారాలు సూచిస్తున్నాయి. మూడో విజయాదిత్యుడి పాలనతో ఈ ప్రాంతానికి అనుబంధం ఉంది. విజయేశ్వరాలయాల నిర్మాణం చేపట్టిన చాళుక్యుల కాలంలోనే ఈ గణపతి ఆలయం రూపుదిద్దుకున్నట్లు చారిత్రక కథనాలు ఉన్నాయి. తదనంతరం పలు రాజవంశాలు, పెద్దాపురం సంస్థానాధీశులు ఆలయ అభివృద్ధికి సహకరించినట్లు తెలుస్తోంది. స్వామిని దర్శిస్తే కష్టాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం.
కొలనుపాక.. చాళుక్య శిల్ప వైభవం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొలనుపాక చారిత్రక, శైవ క్షేత్రంగా పేరొందింది. ఇక్కడి సోమేశ్వరాలయ ప్రాంగణంలో గణపతి విగ్రహం ఉంది. పశ్చిమ చాళుక్యుల కాలానికి చెందినదిగా భావించే ఈ విగ్రహం నాటి శిల్పకళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. చతుర్భుజాలతో పీఠంపై ఆసీనుడైన స్వామి.. అంకుశం, మోదకం తదితరాలను ధరించి దర్శనమిస్తాడు. సర్ప ఉదరబంధం, ఆభరణాలు, మేఖల, కిరీటం వంటి అలంకరణలు శిల్పానికి ప్రత్యేక అందాన్నిస్తాయి. భక్తులు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడి ఆచారం.
చోడవరం.. నీటి ఊటలో వినాయకుడు

అనకాపల్లి జిల్లాలోని చోడవరం వినాయక ఆలయం మిగతా క్షేత్రాలకు భిన్నమైనది. సుమారు 600 ఏళ్ల క్రితం మత్స్యవంశ రాజుల కాలంలో ఆలయం నిర్మితమైనట్లు స్థానిక కథనాలు చెబుతున్నాయి. గర్భగుడి ద్వారం వద్ద చేప చిహ్నాలు ఉండటంతో స్వామిని ‘మత్స్య గణపతి’గా పిలుస్తారు. ఇక్కడి నల్లరాతి స్వయంభూ విగ్రహం చిన్న నీటి ఊటలో ఛాతి వరకు మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన భాగం భూమిలోనే ఉందని భక్తుల నమ్మకం. తొండం చివరి భాగం సైతం కనిపించకపోవడం ఈ స్వామి ప్రత్యేకత.
రాయదుర్గం.. దశభుజ మహాగణపతి

అనంతపురం జిల్లా రాయదుర్గంలోని దశభుజ గణపతి భారీ శిలా రూపంతో ఆకట్టుకుంటాడు. కోట కొండకు వెళ్లే మార్గంలో ఉన్న ఈ విగ్రహం సుమారు 15 అడుగుల ఎత్తుతో పది చేతులతో దర్శనమిస్తుంది. కుడివైపు తిరిగిన తొండం, ఎడమ తొడపై అమ్మవారి రూపం ఈ విగ్రహంలోని ప్రత్యేకతలు. పది చేతుల్లో వివిధ ఆయుధాలు, వస్తువులు ధరించినట్లు శిల్పంలో కనిపిస్తాయి. విజయనగర కాలానికి చెందినదిగా చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. షోడశ గణపతి రూపాల్లోని మహాగణపతి స్వరూపంగా దీన్ని పేర్కొంటారు.
శ్రీశైలం.. భక్తుల యాత్రకు సాక్షి

శ్రీశైలానికి మూడు కిలోమీటర్ల దూరంలో సాక్షి గణపతి ఆలయం ఉన్నది. ఈ ఆలయానికి సైతం ఎంతో విశిష్టత ఉన్నది. శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్న వారి వివరాలను గణపతి నమోదు చేసుకుంటాడని ప్రతీతి. అందుకే ఆయనను సాక్షి గణపతిగా పిలుస్తుంటారు. ఒక చేతిలో పుస్తకం, మరో చేతిలో ఘంటతో భక్తుల వివరాలు నమోదు చేస్తున్నట్లుగా స్వామి రూపం ఉంటుంది. శ్రీశైలం వెళ్లి తిరిగివచ్చే భక్తులు సాక్షి గణపతిని దర్శించి తమ గోత్రనామాలు చెప్పుకోవడం సంప్రదాయంగా వస్తోంది.
యానాం.. పుట్టలోంచి వెలుగులోకి

యానాంలోని సిద్ధి గణపతి ఆలయానికి పాళుక్యుల కాలం నాటి నేపథ్యం ఉందని స్థానిక చరిత్ర పేర్కొంటుంది. గతంలో స్వామిని విజయ గణపతిగా ఆరాధించేవారని చెబుతారు. వరదలు, తుపానులు, భౌగోళిక మార్పుల కారణంగా విగ్రహం పుట్టలో కప్పబడిందని స్థలపురాణం. తరువాత పట్టిస్వామి అనే వైద్యుడికి స్వామి కలలో కనిపించి తన ఉనికిని తెలియజేశాడని చెబుతారు. అనంతరం పురాతన అవశేషాలతో ఆలయాన్ని పునర్నిర్మించారు. స్వామికి 108 ప్రదక్షిణలు, 108 కొబ్బరికాయలు సమర్పించడం భక్తుల ప్రధాన మొక్కుబడుల్లో ఒకటి.
రుద్రారం.. విద్యాగణపతి ఆశీస్సులు

సంగారెడ్డి జిల్లా రుద్రారంలో ఉన్న సంకష్టహర సిద్ధి విద్యా గణపతి ఆలయం విద్యార్థుల విశ్వాస కేంద్రంగా నిలిచింది. శివరాంభట్ ప్రేరణతో ఈ ప్రాంతంలో ఏర్పడిన పంచ వినాయక క్షేత్రాల్లో రుద్రారం ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. చతుర్భుజాలతో, నాగబంధంతో కనిపించే స్వామి విగ్రహంపై శ్రీచక్ర బీజాక్షరాలు ఉన్నాయని విశ్వాసం. అందువల్ల స్వామికి నిత్యం సిందూర లేపనం చేస్తారు. విద్యాగణపతిగా ప్రసిద్ధి చెందడంతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేస్తారు. సంకష్ట చతుర్థి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
కాజీపేట.. జిల్లేడు వేరు నుంచి గణపతి

హనుమకొండ జిల్లా కాజీపేటలోని శ్వేతార్కమూల గణపతి ఆలయం ప్రకృతి సహజ రూపానికి నిదర్శనం. తెల్ల జిల్లేడు వేరు నుంచి గణపతి ఆకృతి ఏర్పడిందని విశ్వాసం. విగ్రహాన్ని ఎవ్వరూ చెక్కలేదని.. ప్రకృతి సిద్ధంగానే స్వామి రూపం ఏర్పడిందని ఆలయ సంప్రదాయం చెబుతోంది. వేరు నుంచి గణపతి ముఖం, చేతులు, సుఖాసనం, మూషికం తదితర ఆకృతులు కనిపిస్తాయని భక్తుల నమ్మకం. 1999లో ఈ శ్వేతార్క గణపతి రూపాన్ని గుర్తించగా.. తరువాత పూజలు ప్రారంభమయ్యాయి. 2002లో ఆలయ నిర్మాణం పూర్తయింది. 2008లో విస్తరించారు. సంకష్టహర చతుర్థి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
విశాఖ.. సంపత్ వినాయగర్

విశాఖపట్నంలోని సంపత్ వినాయగర్ ఆలయం నగరంలోని ప్రముఖ గణపతి క్షేత్రాల్లో ఒకటి. 1962లో కార్యాలయ ప్రాంగణంలో స్వామిని ప్రతిష్ఠించారు. కొంతకాలం నిర్వాహకులే పూజలు నిర్వహించగా.. తరువాత భక్తులకు దర్శన అవకాశం కల్పించారు. 1967లో కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిని దర్శించి గణపతి యంత్రాన్ని ప్రతిష్ఠించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. 1971 యుద్ధ సమయంలో పాకిస్తాన్‌కు చెందిన ‘ఘాజీ’ జలాంతర్గామి విశాఖ తీరానికి చేరిన ఘటన అనంతరం అప్పటి తూర్పు నౌకాదళాధిపతి అడ్మిరల్ కృష్ణన్ స్వామిని దర్శించి 1001 కొబ్బరికాయలు సమర్పించినట్లు స్థానికంగా ప్రచారం ఉంది. స్వామికి ప్రతిరోజూ పంచామృత అభిషేకం నిర్వహిస్తారు.
రేజింతల్.. కోర్కెలు తీర్చే సిద్ధివినాయకుడు

జహీరాబాద్‌కు సమీపంలోని రేజింతల్ గ్రామంలో సిద్ధివినాయకుడు స్వయంభూ రూపంలో కొలువై ఉన్నాడు. రెండు శతాబ్దాలకు పైగా ఈ క్షేత్రం భక్తులను ఆకర్షిస్తున్నట్లు స్థానిక చరిత్ర చెబుతోంది. కర్ణాటక సరిహద్దుకు దగ్గరగా ఉండటంతో రెండు రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు. శివరాంభట్ ప్రేరణతో ఏర్పడిన వినాయక క్షేత్రాల్లో రేజింతల్ ఆలయం కూడా ఒకటని చెబుతారు. కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకంతో స్వామిని సిద్ధివినాయకుడిగా కొలుస్తారు.
సికింద్రాబాద్.. బావిలో బయటపడిన గణపతి

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని గణపతి ఆలయానికి దాదాపు రెండు శతాబ్దాల చరిత్ర ఉంది. 1824లో మంచినీటి కోసం బావి తవ్వుతున్న సైనికులకు వినాయక విగ్రహం కనిపించిందని ఆలయ చరిత్ర చెబుతోంది. అప్పట్లో చిన్న ఆలయంగా ఉన్న ఇది క్రమంగా విస్తరించింది. 1932లో ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యస్వామి, శివుడు, అమ్మవారు, ఆంజనేయస్వామి ఆలయాలు నిర్మించారు. 1960లో పాత బావిని పూడ్చి ఆలయానికి కొత్త రూపు ఇచ్చారు. వినాయక చవితి సందర్భంగా ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
Read Also :
Ganesh Idol | గణపతి తొండం కుడివైపు ఉంటే ఏంటి? ఎడమవైపు ఉంటే ఏంటి? పూజలో ఈ తేడా ఎందుకు?
Vinayaka Chavithi | గణపతి.. విఘ్నహర్తే కాదు.. జ్ఞానదాత కూడా..
Vinayaka Chavithi | గజముఖ గణపతి రూపాలెన్నో తెలుసా?.. ఒక్కో స్వరూపానికి ఒక్కో విశిష్ఠత..
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లకు నేడు సెలవు.. రేపు బ్లడ్ బాత్ తప్పదా..?
- ●Brahmotsavalu 2026 | బ్రహ్మోత్సవాల వెనుక కనిపించని వేల చేతులు..!
- ●Gurugram Woman Biker Hit By Car | భయానక ఘటన: తనను వెంబడించొద్దన్నందుకు మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టి.. వీడియో వైరల్
- ●Kargil War Veteran Attacked Gurugram | గురుగ్రామ్‌లో దారుణం: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్‌తో పార్కింగ్ సిబ్బంది దాడి
- ●Ganesh Chaturthi 2026: గణపతికి 21 రకాల ఆకులే ఎందుకు సమర్పిస్తారు? ఒక్కో పత్రం వెనుక ఆసక్తికరమైన అర్థం!
- ●Gadwal Vijayalakshmi | పర్యావరణహితంగా మట్టి వినాయక విగ్రహాలను పూజించాలి: గద్వాల్ విజయలక్ష్మి

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లకు నేడు సెలవు.. రేపు బ్లడ్ బాత్ తప్పదా..?

Brahmotsavalu 2026 | బ్రహ్మోత్సవాల వెనుక కనిపించని వేల చేతులు..!

Gurugram Woman Biker Hit By Car | భయానక ఘటన: తనను వెంబడించొద్దన్నందుకు మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టి.. వీడియో వైరల్

Kargil War Veteran Attacked Gurugram | గురుగ్రామ్‌లో దారుణం: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్‌తో పార్కింగ్ సిబ్బంది దాడి





