త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Padmavathi Temple | తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు.. పంచమితీర్థానికి ప్రత్యేక క్యూ లైన్లు

Padmavathi Temple | తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. డిసెంబరు 6 నుంచి 14 వరకు జరగనున్న ఉత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది.

P

Devotional | Published On Nov 21, 2026, 9.15 pm IST

Padmavathi Temple | తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు.. పంచమితీర్థానికి ప్రత్యేక క్యూ లైన్లు
Advertisement

Padmavathi Temple | తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. డిసెంబరు 6 నుంచి 14 వరకు జరగనున్న ఉత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. ముఖ్యంగా లక్షలాది మంది తరలివచ్చే పంచమితీర్థం సందర్భంగా ప్రత్యేక క్యూ లైన్లు, కంపార్ట్‌మెంట్లు, జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు శనివారం తిరుపతిలోని పద్మావతి విశ్రాంతి భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర.. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

దర్శనం, రవాణా, తాగునీరు, వైద్యం, పారిశుద్ధ్యం, భద్రతకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. పంచమితీర్థం రోజున భక్తులను విడతలవారీగా పుష్కరిణిలోకి అనుమతించడంతో పాటు స్నానఘట్టాల వద్ద రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను వేర్వేరుగా క్రమబద్ధీకరించి బారికేడ్లు, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా ప్రత్యేక బృందాలతో పర్యవేక్షణ చేపట్టనున్నారు. మరోవైపు తిరుమల నుంచి తిరుచానూరు వరకు పడి ఊరేగింపు జరిగే మార్గాల్లో రహదారుల మరమ్మతులు పూర్తి చేయాలని ఈవో ఆదేశించారు. ఉత్సవాల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

ఈసారి బ్రహ్మోత్సవాల్లో ఆలయాన్ని పుష్పాలు, విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించనున్నారు. వాహనసేవలను భక్తులందరూ వీక్షించేలా ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు. భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి అమ్మవారి వాహనసేవలను తిలకించి, దర్శించుకోవాలని కోరారు. సమావేశంలో జేఈవోలు డాక్టర్‌ ఏ. శరత్‌, ప్రభల గోపీనాథ్‌, సీవీఎస్వో కేవీ మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో హరింద్రనాథ్‌, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement